హెచ్‌యూఎల్ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 22% ఎగసి రూ. 1,062 కోట్లను తాకగా, గతంలో ఇదే కాలానికి రూ. 871 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇక అమ్మకాలు సైతం దాదాపు 10% పెరిగి రూ. 7,038 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,434 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి పనితీరును సాధించగలిగినట్లు కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని పేర్కొన్నారు. పటిష్ట నిర్వహణ ద్వారా లాభదాయకతను పెంచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లు నెమ్మదించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలపై సానుకూలంగా ఉన్నట్లు కంపెనీ సీఎఫ్‌వో ఆర్. శ్రీధర్ వ్యాఖ్యానించారు.
వ్యయాల అదుపు
ముడిసరుకుల ధరలు పెరగడం, వృద్ధి మందగించడం, రూపాయి విలువ క్షీణించడం వంటి ప్రతికూలతలున్నప్పటికీ వ్యయాల అదుపు, పెట్టుబడుల కొనసాగింపు వంటి చర్యల ద్వారా మెరుగైన పనితీరును చూపగలిగినట్లు ఆంగ్లోడచ్ దిగ్గజం యూనిలీవర్‌కు అనుబంధ సంస్థ అయిన హెచ్‌యూఎల్ పేర్కొంది. కాగా, ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్లపై రూ. 929.5 కోట్లను ఖర్చు చేసింది.