Harvard Medical School scientists
-
బ్యాండేజీ తీయకుండానే మందులు వేస్తారు!
గాయమైనప్పుడు రోజూ కట్టు కట్టించుకోవడం అనేది నరకప్రాయం అంటే అతిశయోక్తి కాదేమో. కట్టు తీసే ధాటికి చర్మంపై ఒత్తిడి పెరిగి విపరీతమైన మంట లేదా నొప్పి ఖాయం. బాగా తీవ్రమైన గాయాలైతే ఒకే మందుతో అది మానదు కూడా. మానుతున్న కొద్దీ మందుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ మళ్లీ కట్టు విప్పాలన్నమాట. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఎంచక్కా బ్యాండేజీ తీయకుండానే కావాల్సిన మందులేసేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కావాల్సిన మందులు ఉన్న చిన్న చిన్న సంచీలను తొలిసారి కట్టు కట్టేటప్పుడే చర్మంపై ఉంచేయడం ఇందులో ముఖ్యాంశం. ఈ సంచీలన్నింటినీ కలుపుతూ ఓ తీగ ఉంటుంది. ఈ తీగ సాయంతో ఒక స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కావాల్సిన మందు సంచీ తెరుచుకునేలా చేయవచ్చు. అది కూడా వైర్లెస్ పద్ధతిలో అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే నర్సు అవసరమే లేకుండా ఎక్కడి నుంచైనా మందు వేయవచ్చునన్నమాట. ఈ పద్ధతిలో మందులు వేయడం సంప్రదాయ పద్ధతుల కంటే చాలా మెరుగైందని, గాయం లోపలికంటా మందులు వెళ్లిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కనెక్టికట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తే ప్రొఫెసర్ అలీ తమయోల్ అంటున్నారు. మధుమేహంతో బాధపడుతున్న ఎలుకల చర్మం పూర్తిగా §ð బ్బతిన్న గాయాలు కూడా ఈ కొత్త బ్యాండేజీ ద్వారా మెరుగ్గా నయమయ్యాయని ఆయన చెప్పారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
గర్భంతో ఉంటే నో కూల్‌డ్రింక్స్!
గర్భంతో ఉన్నప్పుడు చక్కెర ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ తాగితే పుట్టే పిల్లలకు భవిష్యత్తులో ఊబకాయం వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు అంటున్నారు. చక్కెర ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ ప్రభావం గర్భంలో ఉన్న బిడ్డపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఓ అధ్యయనం నిర్వహించింది. దాదాపు 1,078 మంది గర్భిణులను వారి రెండో త్రైమాసికం నుంచి పరిశీలించామని, వాళ్లు తీసుకుంటున్న పానీయాలపై దృష్టి పెట్టామని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన రిఫాస్ షిమన్ తెలిపారు. వీరి పిల్లలు ప్రాథమిక పాఠశాలలో ఉండగా వారి బరువులను పరిశీలించగా దాదాపు 25 శాతం మంది అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గర్భిణులుగా ఉన్నపుడు వీరు రోజుకు రెండు సార్లు కూల్‌డ్రింక్స్ తాగినట్లు గుర్తించారు. అయితే ఈ రెండింటికీ ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అన్నది స్పష్టం కాకపోయినా గర్భం దాల్చినపుడు కూల్‌డ్రింక్స్‌ను తగ్గించడం మేలని, వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవాలని రిఫాస్ సూచిస్తున్నారు. -
మెదడు నుంచి మెదడుకు తొలి సందేశం!
భారత్‌లో ఒక వ్యక్తి ఆలోచించాడు. ఫ్రాన్స్‌లో మరో వ్యక్తి ఆ ఆలోచనను గ్రహించాడు. వీడియోలు, ఆడియోలు, మాటలు లేకుండానే.. ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేకుండా ఇంటర్నెట్తో ఇది జరిగిపోయింది! మనుషుల మెదళ్ల మధ్య సమాచార ప్రసారాన్ని సాధ్యం చేసే ‘బ్రెయిన్-టు-బ్రెయిన్ కమ్యూనికేషన్’లోని ఈ ప్రక్రియను హార్వార్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఇద్దరు మనుషుల మధ్య సాధించారు. ఒక వ్యక్తి మెదడులోని ప్రేరేపణలను మరో వ్యక్తి మెదడుకు అందిస్తే.. అతడు ఆ భావాలను అర్థం చేసుకుంటాడా? లేదా? అన్న కోణంలో వీరు ఈ ప్రయోగం చేపట్టారు. తొలుత భారత్‌లో ఓ వ్యక్తి మెదడుకు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ)ను, ట్రాన్స్‌క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్(టీఎంఎస్)ను అమర్చారు. తర్వాత అతడు ‘హోలా(స్పానిష్‌లో హలో)’, ‘సియావో(ఇటాలియన్లో హలో)’ అనే పదాల గురించి ఆలోచించాడు. ఈ ఆలోచనల వల్ల మెదడులో కలిగిన మార్పులను రికార్డు చేసి ఫ్రాన్స్‌లోని వ్యక్తికి అమర్చిన ఈఈజీ, టీఎంఎస్లకు పంపించారు. అతడు ఈ పదాలను గ్రహించాడు. దీంతో మాటలు లేకుండానే ఇద్దరి మధ్యా పదాలు మార్పిడి జరిగింది. -
ఒక కోతి ఆలోచించింది.. ఇంకో కోతి ఆచరించింది..!
సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘అవతార్’ చూశారా? అందులో హైబ్రిడ్ మనుషులను సృష్టించి అవతార్లుగా మార్చడం.. వారి మెదడుని జన్యుపరంగా దగ్గరి సంబంధం ఉండే వ్యక్తి ఆలోచనల ద్వారా నియంత్రించడం.. అద్భుతంగా ఉంటుంది కదూ! అయితే ఇంతదాకా కల్పితమే అయిన ఈ అద్భుతం భవిష్యత్తులో నిజం కాబోతోంది. అవతార్ సినిమా స్ఫూర్తితో పరిశోధన చేపట్టిన హార్వార్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఒక కోతి మెదడులోని స్పందనలను ఇంకో కోతికి అనుసంధానం చేసి ఆ కోతిలో 98 శాతం కచ్చితత్వంతో కదలికలు తీసుకువచ్చారు. దీంతో భవిష్యత్తులో పూర్తిస్థాయి శరీరాన్నీ కదిలించవచ్చని, క్రమంగా ఈ టెక్నాలజీని మనుషులకూ ఉపయోగపడేలా అభివృద్ధిపర్చి పక్షవాతం రోగులను పరుగెత్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకూ ఎలా చేశారంటే.. తొలుత ఓ కోతిని మాస్టర్ మంకీగా ఎన్నుకుని దాని మెదడులో 100 నాడీకణాల చర్యలను చదివే ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారు. తర్వాత ఆ కోతితో కంప్యూటర్‌పై కర్సర్‌ను కదపడం, జాయ్‌స్టిక్‌ను కదిలించడం వంటివి చేయించారు. మరో కోతిని అవతార్ గా ఎన్నుకుని దాని వెన్నులో 36 ఎలక్ట్రోడ్లను అమర్చారు. తర్వాత మాస్టర్ కోతిలో కదలికల కోసం మెదడు నుంచి వెలువడే విద్యుత్ సంకేతాలను.. అవతార్ కోతి నాడీవ్యవస్థలోకీ ఎలక్ట్రోడ్ల ద్వారా ప్రవేశపెట్టి నాడీవ్యవస్థను ప్రేరేపించారు. దీంతో మాస్టర్ కోతి చేయిని ఎలా కదిలించిందో... అవతార్ కోతి కూడా అచ్చం అలాగే చేయిని కదిలించిందన్నమాట.