డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్!
తాజా ట్రావెల్ బ్యాన్‌ను సైతం నిలిపేసిన హవాయ్ కోర్టు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికాకు రాకుండా ట్రంప్ తీసుకొచ్చిన సరికొత్త ప్రయాణ నిషేధాజ్ఞల (ట్రావెల్ బ్యాన్)ను సైతం హవాయ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఆ ఆరు దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించవచ్చునని స్పష్టం చేశారు.
గత నెల ఏడు ముస్లిం దేశాలకు ప్రజలు అమెరికాలో పర్యటించకుండా ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఉత్తర్వులను పలు ఫెడరల్ కోర్టులు నిర్ద్వంద్వంగా నిలిపివేశాయి. దీంతో ఆ ఉత్తర్వులను వెనుకకు తీసుకున్న ట్రంప్ తాజాగా సవరించిన నిబంధనలతో ప్రయాణ నిషేధాజ్ఞలను పునరుద్ధరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకొచ్చారు. ఈ సారి ఇరాక్‌కు మినహాయింపు ఇచ్చి ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ తదితర ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. మరికొన్ని గంటల్లో ఈ నిషేధం అమల్లోకి రానుండగా.. అధ్యక్షుడి తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు చట్టబద్ధంగా లేదంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డెరిక్ వాట్సన్ దీనిని నిలిపివేశారు.