'దంగల్' ఎఫెక్ట్: స్పందించిన సీఎం!
ఛండీగఢ్: బాలీవుడ్ 'మిస్టర్ ఫర్ఫెక్ట్' ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో పాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చింది. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ ఆయన కూతుళ్లకు రెజ్లింగ్ శిక్షణ ఇచ్చి ఎలా సక్సెస్ సాధించారన్న కథాంశం ఆధారంగా దంగల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ కారణంగా హర్యాణా ప్రభుత్వం రెజ్లింగ్ క్రీడాకారులకు సహాకారం అందిస్తోంది. అకాడమీలకు వంద రెజ్లింగ్ మ్యాట్లను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న మ్యాట్లను అకాడమీలకు అందజేస్తే.. రెజ్లర్ల ప్రాక్టీస్ ఇబ్బందులు కాస్తయినా తగ్గే అవకాశం ఉంది.
గీతా ఫోగట్, బబితా ఫోగట్‌లతో పాటు, వారి తండ్రి, కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్‌ను సీఎం మరోహర్ లాల్ ఖట్టర్ కలుసుకుని వారిని అభినందించారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించడానికి, రాష్ట్రంలో క్రీడలను మెరుగు పరిచేందుకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు. కమిటీ సిఫారసుల మేరకు కొత్త పాలసీని తీసుకొస్తామన్నారు. రాష్ట్ర అత్యుత్తమ ప్లేయర్స్‌కు తగిన ఉద్యోగం, ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం ధీమా ఇచ్చారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన 'దంగల్' మూవీలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఓవరాల్‌గా రూ.411 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది.