కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కొన్ని కీలక అంశాలకు బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ అమలుకు ఉద్దేశించిన ఆర్థిక ప్లాన్, హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) ఫ్యాక్టరీ, రష్యా చమురు బావుల్లో వాటా కొనుగోలు, తదితర కీలక అంశాలకు సంబంధించి గ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది. ప్రధానంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ ప్రతిపాదించిన జీఎస్టీ అమలుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లోని ఐటీ ఇన్ఫ్రాక్చర్ మెరుగుదలకు సంబంధించిన అంశాన్ని ఆమోదించింది. దీనికోసం రాబోయే ఏడు సంవత్సరాల్లో 2వేల రెండు కోట్లను వెచ్చించనుంది.
ఐవోసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లు రష్యాలోని తాస్-యురై చమురు బావిలో 29.9 శాతం వాటా కొనుగోలు చేయడానికి 128 కోట్ల డాలర్ల ఒప్పందానికి క్యాబినెట్ ఓకే చేసింది. అలాగే హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) ఫ్యాక్టరీ మూసివేతకు అంగీకారం తెలిపింది.
కాగా జీఎస్టీ అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేసింది సీబీఈసీ . ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్), కన్సార్టియానికి నాయకత్వం వహిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)..రష్యాలోని చమురు బావుల్లో వాటాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్ తయారీ సంస్థ హెచ్సీఎల్ నష్టాలనుఎదుర్కొంటోంది. వైర్లెస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో హెచ్సీఎల్ మూసివేత స్థితికిచేరింది. 2015 ఫిబ్రవరిలో కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది. అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు.