HDFC chairman Deepak Parekh
-
సత్యం స్కాం:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లు అందరూ అప్పటి చైర్మన్ బి.రామలింగరాజుకు రబ్బర్ స్టాంప్ మాదిరిగా పనిచేసినట్టు విమర్శించారు. 2009 జనవరిలో రూ.7,800 కోట్ల రూపాయల సత్యం స్కామ్ వెలుగులోకి రావడం తెలిసిందే. (బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్) అనంతరం జరిగిన పరిణామాల్లో సత్యంను టెక్ మహీంద్రా సొంతం చేసుకుని, తనలో విలీనం చేసుకుంది. చాలా ఏళ్లపాటు లేని లాభాలను చూపిస్తూ వచ్చినట్టు రామలింగరాజు స్వయంగా అంగీకరించారు. ఏ కంపెనీ సీఈవో అయినా వాటాదారుల కోసం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకోవాలని పరేఖ్ సూచించారు. విఫలమవుతున్న కంపెనీల సంఖ్య పెరుగుతోందంటూ, కొందరి అత్యాశ కారణంగా ప్రజలు డబ్బును, విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు చెప్పారు. (కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం) ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా స్పందిస్తూ.. నాటి సత్యం కంప్యూటర్ స్కామ్ సమయంలో బోర్డును ప్రభుత్వం రద్దు చేసి, ప్రైవేటు రంగంలో నిపుణులతో భర్తీ చేసినట్టు చెప్పారు. నాడు నిపుణులతో ఏర్పాటు చేసిన సత్యం బోర్డులో పరేఖ్‌కు సైతం స్థానం కల్పించడం గమనార్హం. (Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!) ఇదీ చదవండి: ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే? -
నిరంకుశ శక్తులతోనే ప్రపంచానికి రిస్కు:హెచ్డీఎఫ్సీ చైర్మన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్ల కన్నా నిరంకుశ శక్తులు, సహకార కొరవడటం, వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవడం వంటివే ప్రపంచానికి అతి పెద్ద రిస్కులుగా మారాయని ప్రముఖ బ్యాంకరు, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సంక్షోభాలను ఉటంకిస్తూ .. ప్రపంచం ప్రస్తుతం ఏకకాలంలో అనేక పెను విపత్తులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ‘దేశాల మధ్య విశ్వాసలేమి, గ్రూపులు కట్టడం వంటివి ఎంతగానో పెరిగిపోయాయి. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. వాణిజ్యాన్ని ఆయుధంగా ప్రయోగించడం, పరస్పర సహకారం కొరవడటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవి ఆర్థిక సవాళ్ల కన్నా పెద్ద రిస్కులు. ఇప్పటికే ఇంధనం, ప్రకృతి వనరులు, సెమీ-కండక్టర్లు మొదలైన అంశాల్లో మనం వీటిని చూస్తూనే ఉన్నాం‘ అని కోల్‌కతాలోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ విభాగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరికొన్నాళ్లు కొనసాగుతాయన్నారు. రూపాయి పతనం విషయంలో (డాలరుతో పోలిస్తే మారకం విలువ) రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోరాదని, దేశీ కరెన్సీ తనంత తాను సహేతుక స్థాయిని వెతుక్కునేందుకు వదిలేయాలని పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సూచించినట్లుగా దేశాలు తమ విదేశీ మారక నిల్వలను భవిష్యత్ షాక్‌లను ఎదుర్కొనేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు మరింత వివేకవంతంగా ఉపయోగించుకోవాలని పరేఖ్ చెప్పారు. -
ఇల్లు.. డిమాండ్ ఫుల్లు!
ముంబై: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చక్రంలో ఉందని, ఇళ్లకు ఇక ముందూ డిమాండ్ బలంగానే ఉంటుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో ఇళ్ల మార్కెట్ వాస్తవికంగా ఉంటుందని, స్పెక్యులేషన్ శైలితో నడవదన్నారు. సీఐఐ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందస్తు స్థాయిని దాటిపోవడం బలమైన విశ్వాసానికి నిదర్శనంగా దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారితోపాటు, పెద్ద ఇళ్లకు మారేవారి నుంచి డిమాండ్ వస్తున్నట్టు చెప్పారు. ‘‘నా 50 ఏళ్ల వృత్తి జీవితంలో ఇళ్లు అందుబాటు ధరల్లో లభించడం ఇప్పుడున్న మాదిరిగా ఎప్పుడూ చూడలేదు. పుష్కలమైన నగదు లభ్యత, కనిష్ట వడ్డీ రేట్లు, ఇంటి యజమాని కావాలనే కోరికను గతంలో ఈ స్థాయిలో చూడలేదు. పాశ్చాత్య దేశాల్లో ఇళ్ల ధరలు కరోనా విపత్తు సమయంలో గణనీయంగా పెరగడం చూసే ఉంటారు. సరఫరా పెరగకపోవడానికితోడు, పెట్టుబడులు, స్పెక్యులేషన్ ధోరణి ధరలు పెరగడానికి కారణం. కానీ భారత్‌తో ఇళ్లకు డిమాండ్ నిజమైన కొనుగోలు దారుల నుంచే వస్తుంది. ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కనిష్ట వడ్డీ రేట్లు మద్దతుగా నిలిచాయి. రియల్ ఎస్టేట్ పరిశ్రమ గత క్షీణత సైకిల్ నుంచి కోలుకుంది’’అని పరేఖ్ వివరించారు. ఆదాయాలు పెరిగాయి... జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి 11 శాతంగా ఉన్నట్టు దీపక్ పరేఖ్ తెలిపారు. ఐటీ, ఈ కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసులు, ఆర్థిక సేవల రంగం, పెద్ద కంపెనీల్లో పనిచేసేవారు, నూతన తరం పారిశ్రామికవేత్తలకు ఆదాయ స్థాయిలు పెరిగాయని చెప్పారు. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరిగితే చిన్న వయసులోనే ఇళ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాజెక్టుల ధరలు 15–20 శాతం వరకు పెరిగినట్టు చెప్పారు. కానీ, అందుబాటు ధరల ఇళ్లు ఇప్పటికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్నట్టు తెలిపారు. వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగితే అది ఇళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపబోదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) కాన్సెప్ట్‌కు ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాలని డెవలపర్లకు çపరేఖ్ సూచించారు. కరోనా కాలంలోనూ.. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించినా, పలు విడతలుగా మహమ్మారి విరుచుకుపడినా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి బలంగా నిలదొక్కుకుంది. అంతేకాదు వృద్ధి క్రమంలో ప్రయాణిస్తోంది. నివాస గృహాల మార్కెట్ వృద్ధి క్రమంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుకుతోడు, కనిష్ట వడ్డీ రేట్లు ఉండడంతో 2022లోనూ రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు అదే పనిగా పెరిగిపోవడం 2021లో ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది. – ధ్రువ్ అగర్వాల్, ప్రాప్‌టైగర్.కామ్ గ్రూపు సీఈవో -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ఆశాకిరణం
ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దన్నుతో కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న అంచనాను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యక్తం చేశారు. అంచనాల కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుందన్నారు. లాక్డౌన్ చర్యలను జూలై ఆఖరుకు పూర్తిగా ఎత్తివేస్తే భారత జీడీపీ 2020–21లో హీనపక్షం మైనస్ 5 శాతానికి పడిపోవచ్చని చాలా సంస్థలు అంచనాలను ఇప్పటికే విడుదల చేశాయి. గరిష్టంగా మైనస్ 7.5 శాతం వరకు క్షీణించొచ్చని పేర్కొన్నాయి. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదలడం మొదలైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మే నెలలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి వెళ్లి క్రమంగా తగ్గడం మొదలైంది. డిజిటల్ లావాదేవీలు జోరందుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు తిరిగి 90,000 కోట్ల స్థాయిని చేరాయి. సకాలంలో వర్షాల ఆగమనంతో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది’’ అని చెప్పారు. -
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...?
ముంబై : హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్ లు రెండూ జతకట్టి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ గా ఉద్భవించబోతున్నాయి. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో విలీనం అయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులు విలీన చర్చలు జరపడానికి ముంబైలో సమావేశం కాబోతున్నారని వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఈ సమావేశానికి అధ్యక్షత కాబోతున్నారని పేర్కొన్నారు. ఈ విలీన వార్త మార్కెట్లకి అందగానే శుక్రవారం ఉదయం ట్రేడింగ్ లో మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీస్ లిమిటెడ్ షేర్లు, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. మ్యాక్స్ ఫైనాన్సియల్ షేర్లు 20శాతం, హెచ్ డీఎఫ్ సీ షేర్లు 1.5శాతం పుంజుకున్నాయి. ఈ రెండు కంపెనీలు విలీనమై అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఉన్న ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కంటే దూసుకుపోయేందుకు సన్నద్ధ మవుతున్నాయని తెలుస్తోంది. అదేవిధంగా దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ విలీనం గట్టి పోటీని ఇవ్వనుందని సమాచారం. మార్కెట్ షేర్ ను, లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు కొత్త మార్గాలను చేపడుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రణాళిక గురించి కంపెనీలు అధికారికంగా ఇంకో కొన్ని రోజుల్లో వెల్లడించనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, దాదాపు దశాబ్దం తర్వాత లైఫ్ ఇన్సూరర్స్ లో జరగబోయే మొదటి విలీనం ఇదే కానుంది. ఈ రెండు కంపెనీలు విలీనమై ఒకటిగా సేవలు అందించేందుకు షేర్ హోల్డర్స్ సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ డీల్ ఎలా ఉండబోతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హెచ్డీఎఫ్ లిమిటెడ్ కు, స్టాండర్డ్ లైఫ్ కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్. ఈ కంపెనీ 61శాతం యాజమాన్య వాటా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, 35శాతం యాజమాన్య వాటా స్టాండర్డ్ లైఫ్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మెజార్టి యాజమాన్య వాటా అంటే 68శాతం మ్యాక్స్ ఫైనాన్సియల్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ విలీనంపై స్పందించడానికి హెచ్డీఎఫ్సీ, మ్యాక్స్ లు తిరస్కరించాయి.