health programs
-
సాక్షి బతుకు చిత్రం : ANM ఆరోగ్య కార్యకర్తలపై ప్రత్యేక కథనం
-
మా పథకాలే కాపీ కొడుతున్నారు
సాక్షిప్రతినిధి, వరంగల్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, దేశానికి దిక్సూచిగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం.. దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని, తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో కలసి ఆయన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ములుగులో హెల్త్‌ప్రొఫైల్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సంపేటలో 250 పడకలు, పరకాలలో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట, పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో మాట్లాడారు. ‘తెలంగాణ వస్తే మీ బతుకులు చీకటి అవుతాయి అన్నారు నాడు. కానీ నేడు.. అలా అన్నవాళ్ల జీవితాల్లో చీకటి నిండితే, సీఎం కేసీఆర్ మన బతుకుల్లో వెలుగులు నింపారు. వ్యవసాయ బావులు, బోర్ల వద్ద మీటర్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద 5 ఏళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఇస్తాం అంటున్నది. కానీ తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ’అని హరీశ్ పేర్కొన్నారు. ‘రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ తెచ్చాం. రైతుబంధు అంటే ఒకటి.. రెండు రూపాయల పథకం కాదు. రూ.50 వేల కోట్లు రైతుల అకౌంట్లో వేశాం’అని భావోద్వేగంతో మాట్లాడారు. మండుటెండల్లో కూడా రాష్ట్రంలోని కాలువలు, చెరువుల్లో వరదలు పారుతున్నాయని అన్నారు. ఇంత చేస్తుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ పనులు ఆపాలని ఓ బీజేపీ నేత కేంద్రానికి లేఖ రాశారని మండిపడ్డారు. తెలంగాణ పథకాలను చూసిన కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ‘అలాంటి పథకాలు రాష్ట్రంలో అమలు చేయండి.. లేకుంటే తెలంగాణలో రాయచూర్‌ను కలపండి’అని కోరారంటే మన పథకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారన్నారు. హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి హరీశ్‌కు సీఎం కేసీఆర్ నుంచి అత్యవసర భేటీపై ఫోన్ వచ్చింది. ఏడో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించాల్సి ఉందని ఆయనకు పిలుపు వచ్చింది. పరిస్థితిని సీఎంకు వివరించడంతో పరకాల సభ ముగిసిన వెంటనే హైదరాబాద్‌కు రావాల్సిందిగా హరీశ్‌రావుకు సూచించిన సీఎం కేసీఆర్, వెంటనే పరకాలకు హెలికాప్టర్ పంపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా «ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధనసరి సీతక్క, నన్నపనేని నరేందర్, కలెక్టర్లు జెడ్పీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. -
అమ్మా, నాన్నా నన్ను క్షమించండి
కంగ్టి(నారాయణఖేడ్): దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నందున జీవితంపై విరక్తి కలిగింది. అందుకే... అమ్మా, నాన్నా మీ రుణం తీర్చుకోలేక పోతున్నాను. క్షమించండి.. అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకుడు మైలారం విఠల్(23). స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ గ్రామానికి చెందిన మైలారం హన్మంతు భార్య రాజవ్వతో కలిసి గత వారంలో మెదక్ పట్టణానికి వలస కూలీ పనుల కోసం వెళ్లాడు. కాగా బుధవారం వారి కొడుకు విఠల్ మెదక్ చేరుకొన్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు రాత్రి 9 గంటలకు చర్చి కాంపోండ్‌లో విగతజీవుడై కన్పించారు. డిగ్రీ చదువు పూర్తి చేసి గత రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో కంపెనీల్లో పని చేసేవాడు. ఆకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోధనకు అంతులేదు. మృతుడి తండ్రి హన్మంతు మెదక్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మందమర్రిరూరల్(చెన్నూర్): అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందిన ఆర్మీ జవాన్ కొత్తపల్లి ప్రకాష్ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజామున ప్రకాష్ భౌతికకాయం మందమర్రిలోని గాంధీనగర్‌లో గల స్వగృహానికి చేరుకుంది. ప్రకాష్ భౌతికకాయాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భార్య శ్వేత, తల్లి సరోజ రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించడంతో తండ్రి శంకరయ్య గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్రకాష్ 20 నెలల కొడుకును చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ప్రకాష్ ఇక లేడని అతని మిత్రులు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. బంధువులు, ఇరుగుపొరుగు వారు ప్రకాష్ కలివిడితనం గురించి బాధపడిన తీరు కలచివేసింది. కన్నీటి వీడ్కోలు.. ప్రకాష్ అంతిమ యాత్ర ఉదయం 11:30 గంటలకు మొదలై నాలుగు గంటల వరుకు సాగింది. గాంధీనగర్, సీఈఆర్ క్లబ్ నుంచి మార్కెట్ మీదుగా ప్రజలు, బంధు మిత్రుల అశ్రునయనాల మధ్య సాగిన అంతిమ యాత్ర శ్రీవేంకటేశ్వర ఆలయం వెనుక గల శ్మశాన వాటిక వరకు సాగింది. అక్కడే భౌతికకాయాన్ని ఖననం చేశారు. పోలీస్ అధికారుల నివాళులు.. ప్రకాష్ భౌతికకాయం వెంట ఆర్మీ నుంచి 32 ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్, లెఫ్టినెంట్ కల్నన్ సమల్‌కుమార్, ఆదిలాబాద్ లెఫ్టినెంట్ ఐలయ్య ఉన్నారు. వీరితో పాటు జేసీవో శ్రీనివాస్, జమేదార్ శోబారామ్, రాజనంద భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, మందమర్రి సీఐ రాంచందర్‌రావ్, ఎస్సై శివకుమార్ నివాళులర్పించారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన పెంచాలి
- వైద్యశాఖ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నెల్లూరు(అర్బన్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఉన్న సూపర్వైజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సూపర్వైజర్ తనకు కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఉప కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఏఎన్ఎం అందిస్తున్న సేవలు, రికార్డులు క్రాస్ చెక్ చేయాలని కోరారు. ఉప కేంద్రాల్లో అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని కోరారు. ఆన్లైన్ సేవలపై ఏఎన్ఎంలకు అవగాహన పెంచాలని కోరారు. 35 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలని కోరారు. బీపీ, థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. సీటీ స్కానింగ్, డయాలసిస్ సేవలు లభించే ఆస్పత్రుల వివరాలు తెలపాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం, డాక్టర్ రమాదేవి, డీటీసీఓ సురేష్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఈదూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు