చదువు'కొన' లేక కొడుకును పోగొట్టుకున్నారు!
చదువు కొననంత మాత్రాన నిండు ప్రాణాలు పోతాయని.. ఆ చదువురాని తల్లిదండ్రులకు తెలియదు! అందుకే కొడుకు పుస్తకాలు అడిగినప్పుడు కొనివ్వలేమని తెగేసి చెప్పారు. పుస్తకాలు కొనాల్సిందేనని మంకుపట్టుపట్టిన 14 ఏళ్ల కొడుకు.. పంతం నెరవేరలేదని ఒంటికి నిప్పంటించుకొని చనిపోయాడు. 'దహన సంస్కారాలకోసం ఎలాగూ అప్పుచేయాల్సిందే.. అదేదో ముందే చేసుంటే కొడుకు బతికుండేవాడేనే..' అంటూ మిన్నంటేలా దోరిస్తున్నారు తల్లిదండ్రులు!
స్థానికులు సహా పోలీసులనూ కంటతడి పెట్టించిన ఈ ఘటన బీహార్లోని చంపారన్ జిల్లా కతారి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానిక ప్రభుత్వ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోన్న అఫ్రోజ్ అజ్మల్.. కొత్త పుస్తకాలు కొనివ్వమని తల్లిదండ్రుల్ని కోరాడు. కూలి పనికి వెళితే తప్ప పొట్టనిండని తాము రూ.1500 పెట్టి పుస్తకాలు కొనివ్వలేమని బదులిచ్చారు. దీంతో అజ్మల్ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోపాటు పుస్తకాలు కూడా ఉచితమే కదా మరి ఇలా ఎందుకు జరిగిందంటే.. ఉచిత పుస్తకాల ముద్రణ, సరఫరాలో అవినీతి చోటుచేసుకోవడంతో పిల్లలకు పుస్తకాలు అందడంలేదు. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీలో రభస కూడా జరిగింది.