అంగన్వాడీల పోరాటానికి అండగా నిలబడదాం
* అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఫెడరేషన్ సమావేశాల్లో ఎంపీ తపన్‌సేన్
* హాజరైన పలు రాష్ట్రాలకు చెందిన 700 మంది అంగన్వాడీ వర్కర్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలు, శిశువుల ఆరోగ్యంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది అంగన్వాడీ కార్యకర్తల చేతుల్లోనే ఉంది. అంతటి మహత్తరమైన పాత్ర పోషిస్తున్న మీకు ప్రతి వర్గమూ అండగా నిలబడి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీఐటీయూ నేత, రాజ్యసభ సభ్యుడు తపన్‌సేన్ అన్నారు. గురువారం ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 8వ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న తొలి జాతీయ సమావేశంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తపన్‌సేన్ చెప్పారు. స్త్రీ, శిశు ఆరోగ్యం గురించి కృషి చేసే అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వని ప్రభుత్వాలున్నాయని, వీరికి కనీస సౌకర్యాలు కల్పించని పరిస్థితులున్నాయని, ఇలాంటి సమస్యల నుంచి బయటపడి వారు సక్రమంగా విధులను నిర్వహించేలా మిగతా వర్గాల ప్రజలు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాలపై పల్లె ప్రజలకు అవగాహన కల్పించి.. వారి మద్దతుని కూడగట్టుకోవడానికి ప్రయత్నించాలని అంగన్వాడీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అంగన్వాడీలు తమ హక్కులను కాపాడుకుంటూనే బాధ్యతలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. దేశ భవిష్యత్తుని మార్చే శక్తి, సామర్థ్యాలు అంగన్వాడీల చేతుల్లోనే ఉన్నాయని, గ్రామాల్లో స్త్రీలు, శిశువులు ఆరోగ్యంగా ఉంటే ప్రగతి తనంతట అదే వస్తుందని అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు రాష్ట్రాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తల పనితీరు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలకు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి చర్చించనున్నారు.
దేశ భవిష్యత్తుకి పునాదిగా చెప్పుకునే ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపే అంగన్వాడీ కార్యకర్తల సేవలకు తగిన గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమని ఇతర నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అధ్యక్షురాలు నీలమ మైత్రి, కో ఆర్డినేటర్ హేమలత, మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్, తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్షురాలు లక్షీ, జాయింట్ సెక్రటరీ భారతి, సాయిబాబు, కోఆర్డినేటర్ ఏఆర్ సింధు తదితరులు పాల్గొన్నారు. ఒడిశా, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మేకిన్ ఇండియా కాదు.. ఇది క్లోజింగ్ ఇండియా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం మేకిన్ ఇండియాకు బదులు క్లోజింగ్ ఇండియాగా మారుతోందని తపన్‌సేన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రచారహోరు, ఆకర్షణీయమైన నినాదాలు తప్ప పారిశ్రామిక, ఉత్పత్తిరంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడంలేదన్నారు.
ఆయన సీఐటీయూ జాతీయ కార్యదర్శి వరలక్ష్మి, రాష్ట్ర నాయకులు రమ, సాయిబాబాలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏడాదిన్నర పాలనలో మోదీ ఉద్యోగ, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలను తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 19న దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు నిరసన దినాన్ని పాటిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 10న పార్లమెంటు ఎదుట నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.