హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: పొంగులేటి
హైదరాబాద్ : రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖే పేషెంట్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం సచివాలయం మీడియా పాయింట్లో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఖమ్మంలో డెంగ్యూ, విష జ్వరాల్లో రికార్డు సృష్టిందన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లోనే 20వేలమందికి పైగా విష జ్వరాలు బారినపడ్డారన్నారు.
ఇందుకు సంబంధించి తాము నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి, కలెక్టర్‌కు లేఖ రామన్నారు. అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పడు హడావుడిగా సమీక్ష సమావేశం పెట్టి ఓ బృందాన్ని పంపిస్తోందన్నారు. ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు.