గాంధీ హత్య కేసులో ఆ ముగ్గురూ ఏరి?
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన కేసులో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలేమిటో తెలపాలంటూ ఒడిశాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత్ పాండా కోరారు. నిందితులు గంగాధర్ దహవాటే, సురియా దేవ్ శర్మ, గంగాధర్ యాదవ్‌ల అరెస్టు విషయంలో చేసిన ప్రయత్నాలేమిటో తెలపాలని ఆర్టీఐ దరఖాస్తులో విన్నవించారు. ఇందుకు సంబంధించి కేంద్ర సమాచార కమిషన్ స్పందిస్తూ.. మహాత్మాగాంధీ హత్య కేసుకు సంబంధించి అన్ని రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంలో పాండా చాలా ఆసక్తి ఉన్నవారని..అతడో పరిశోధకుడని తెలిపింది.
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ హత్య కేసుకు సంబంధించి రెండు అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు, గాంధీ హత్యకేసులో వేసిన ఫైనల్ చార్జ్‌షీట్ కనిపించలేదని, దీంతోపాటు గాడ్సేను విచారించమని చెప్పిన ఢిల్లీ పోలీసుల ఆదేశాల పత్రం కూడా కనిపించలేదని పాండా తెలిపారు. అయితే ఈ ప్రశ్నలపై సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పందిస్తూ...‘గాంధీ హత్యకేసుకు సంబంధించి ఫైనల్ చార్జ్‌షీట్ రికార్డుల్లోనే ఉంటుందని ఒకవేళ ఆ చార్జ్‌షీట్ రికార్డుల్లో లేకుంటే దానిపై ఇప్పుడేమీ చెప్పలేమన్నా’రు.