
‘గాంధీ హత్యపై ఎఫ్‌ఐఆర్ బహిర్గతం చేయండి’
1948, జనవరి 30న జరిగిన మహాత్మా గాంధీ హత్యపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌ను బహిర్గతం చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను...
న్యూఢిల్లీ: 1948, జనవరి 30న జరిగిన మహాత్మా గాంధీ హత్యపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌ను బహిర్గతం చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. మహాత్ముడి హత్య అనంతరం ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్, పోస్టుమార్టం ఇలా ఏడు ప్రశ్నలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ ఒడిశాకు చెందిన హేమంత్ పండా హోంమంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును అధికారులు కేంద్ర పురావస్తు విభాగానికి పంపించారు.
గాంధీ స్మృతి మ్యూజియం(బిర్లా హౌజ్)లో కలసి వివరాలు తెలుసుకోవాలంటూ పురావస్తు అధికారులు పండాకు సూచించారు. గాంధీ హత్య అనంతరం అతని కుటుంబ సభ్యులు కోరని కారణంగా పోస్టుమార్టం జరపలేదని బిర్లా హౌజ్ పేర్కొంది. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని ఆ వివరాల కోసం హోంమంత్రిత్వ శాఖను సంప్రదించాల్సిందిగా వివరించింది.