
నాథూరామ్ గాడ్సే దేశభక్తుడు..!
బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ సహా విపక్షాల తీవ్ర నిరసన
రాజ్యసభలో గందరగోళం.. వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఎంపీ
న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాలు లేవనెత్తుతున్న బీజేపీ ఎంపీల జాబితాలోకి తాజాగా మరొకరు చేరారు. మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించి బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో గొడవకు తెరతీశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని సాక్షీ మహరాజ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షీ మహరాజ్ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నాథూరామ్ గాడ్సే చాలా బాధలకు గురైన వ్యక్తి. అతను పొరపాటుగా ఏదైనా చేసి ఉండవచ్చుగానీ దేశద్రోహి మాత్రం కాదు. గాడ్సే దేశ భక్తుడు..’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్షాలు విరుచుకుపడ్డాయి. సాక్షీ మహరాజ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించాయి.
మహాత్మాగాంధీ హంతకుడిని అధికారపక్షం గొప్పవాడిని చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాయి. జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచానికే అహింసా మార్గాన్ని చూపిన మహాత్మాగాంధీని గాడ్సే హత్యచేశాడని, అలాంటిది గత నెల 15న నాథూరామ్ గాడ్సే శౌర్య దివస్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్నవారందరినీ అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో రెండు సార్లు వాయిదా పడింది. అయితే మహాత్మాగాంధీ హంతకుడిని పొగిడే ఎలాంటి అంశాలకైనా ప్రభుత్వం వ్యతిరేకమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలకు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఒక సంస్థను నిందించడం సరికాదని పేర్కొన్నారు. కాగా.. గాడ్సేను తాను దేశభక్తుడు అనలేదని సాక్షీ మహరాజ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు.