hemavathi
-
ప్రాణం తీసిన సెల్ఫీ
యశవంతపుర : నవ దంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన హాసన్ సమీపంలోని హేమావతి నదీ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బేలూరు తాలుకా మురహళ్లి గ్రామానికి చెందిన అర్థేశ్(27), హెన్నలి గ్రామానికి చెందిన కృతికా(23)కు రెండు నెలల క్రితం వివాహమైంది. అర్థశ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా సంస్థకు సెలవు ప్రకటించటంతో రెండు రోజుల క్రితం మురహళ్లికి వెళ్లాడు. బుధవారం అత్తగారి ఊరు హెన్నళికి వెళ్లాడు. సాయంత్రం దంపతులు ఇద్దరూ బైకుపై గ్రామ సమీపంలోని హేమావతి నది వద్దకు వెళ్లారు. రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవటంతో అత్తమామలు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో నది ప్రాంతం వద్దకు వెళ్లగా బైక్ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు నది చుట్టూ గాలింపు చేపట్టగా కృతికా మృతదేహం బయట పడింది. శుక్రవారం తెల్లవారుజామున అర్థేశ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను సకలేశపుర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవదంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారని పోలీసులు తెలిపారు. -
అబ్బుర పరిచే ‘హేమావతి’
అమరాపురం మండలంలోని హేమావతి గ్రామం పేరు వినగానే 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. ఈ ఆలయం అందాలను అక్కడికెళ్లి చూడాల్సిందే. 8వ శతాబ్దంలో నొళంబులు పాలిస్తున్న సమయంలో నిర్మితమైన ఈ ఆలయంలోని ప్రతి స్తంభాన్ని ప్రత్యేక శ్రద్ధతో చెక్కారు. స్తంభాలపై శిల్పాలు అబ్బుర పరుస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా సిద్దేశ్వర స్వామి మూలవిరాట్ లింగాకారంలో కాకుండా మానవరూపంలో దర్శనమిస్తుంటారు. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి అరుదైన ఆలయం మరెక్కడా లేదు. ఆలయ ఆవరణంలో దొడ్డేశ్వరస్వామి శివలింగాకారంలోను, దీనికి ఎదురుగా ఐదు అడుగుల ఎత్తు ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే కాలభైరవేశ్వర, పంచలింగేశ్వర ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు సువిశాలమైన పార్క్ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. భక్తులకు అన్నదాసోహ కేంద్రంలో అన్నదానం చేస్తుంటారు. రోజూ ఉదయం ఐదు నుంచి సాయంత్రం 8 గంటల వరకూ పూజలు చేస్తుంటారు. ఈ ఆలయానికి సందర్శించాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి పెనుకొండ, మడకశిర, బసవనపల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేమావతికి చేరుకోవచ్చు. లేదంటే అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, కుందుర్పి, నాగేపల్లిగేట్ మీదుగా 120 కి.మీ ప్రయాణించి అమరాపురం, ఇక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణిస్తే హేమావతి ఆలయం వస్తుంది. ప్రతి రోజూ అమరాపురం నుంచి ఆటోలు, బస్సులు హేమావతికి వెళుతుంటాయి. - అమరాపురం (మడకశిర) -
ముగిసిన సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
అమరాపురం : మండలంలోని హేమావతిలో సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 24న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజు శయనోత్సంలో భాగంగా స్వామివారికి అర్చకులు, సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పరస్పరం రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా వసంతోత్సవం
అమరాపురం : మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళహారతి పట్టారు. తరువాత సిద్దలింగేశ్వరస్వామి వసంతం సేవ నిర్వహించారు. అనంతరం స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.2.69 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. -
పోటెత్తిన జనం
- కనుల పండువగా సిద్ధేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం - స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన పెద్ద రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మడకశిర, హిందూపురం, కర్ణాటక ప్రాంతాలు చెళ్లికెర, హరియూర్, శిర, తుమకూరు, మైసూర్, బెంగళూరు, మండ్య తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా వివిధ రకాల పూలమాలలతో అలంకరించి బ్రహ్మరథోత్సవం వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చి వేదమంత్రోచ్చారణల మధ్య రథోత్సవంలో కూర్చోబెట్టారు. అశేష భక్త జన సమూహం మధ్య ఓం నమఃశివాయా.. సిద్ధేశ్వరస్వామి మహరాజ్‌కీ జై.. శివ.. శివహర శంభో అంటూ శివనామస్మరణలతో భక్తులు రథోత్సవాన్ని ముందుకు లాగారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో హేమావతి గ్రామం జనాలతో కిక్కిరిసిపోయింది. దీంతో గ్రామంలోని దుకాణాలు, హోటళ్లు బిజీబిజీగా మారాయి. -
వైభవంగా హెంజేరు సిద్ధేశ్వర చిన్నరథోత్సవం
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చిన్న రథోత్సవంలో కూర్చోబెట్టి హంపణ్ణస్వామి గుడి వరకు స్వామివారి నామస్మరణలతో భక్తులు ముందుకు లాగారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాలపల్లకీలో స్వామివారిని గ్రామంలోని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. సర్పంచ్ సదాశివ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మడకశిర సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంటకస్వామి తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు బ్రహ్మరథోత్సవం సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. -
కనులపండువగా సిడిమాను ఉత్సవం
అమరాపురం (మడకశిర): అమరాపురం మండలం హేమావతి హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సిడిమాను ఉత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వెండితో చూడముచ్చటగా అలంకరించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని కుడివైపున ఉన్న సిడిమాను వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. పెద్ద సిడిమానుకు ఒకవైపు భక్తులు వేలాడుతుండగా... మరొకవైపు తిప్పుతుంటారు. మొక్కులు తీర్చుకునేవారు, కోరికలు కోరుకునేవారు పురాతనమైన మానును గాలిలో తిప్పుతూ దానికున్న తాడును పట్టుకుని పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల రోగాలు నయమవుతాయని, సంతానం కలుగుతుందని, పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులకు సర్పంచి సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమార్‌స్వామి అన్నదానం నిర్వహించారు. రాత్రి ముత్యాలపల్లకీలో స్వామివారిని ఊరేగించారు. సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటస్వామి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.