
యశవంతపుర : నవ దంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన హాసన్ సమీపంలోని హేమావతి నదీ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బేలూరు తాలుకా మురహళ్లి గ్రామానికి చెందిన అర్థేశ్(27), హెన్నలి గ్రామానికి చెందిన కృతికా(23)కు రెండు నెలల క్రితం వివాహమైంది. అర్థశ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సంస్థకు సెలవు ప్రకటించటంతో రెండు రోజుల క్రితం మురహళ్లికి వెళ్లాడు. బుధవారం అత్తగారి ఊరు హెన్నళికి వెళ్లాడు. సాయంత్రం దంపతులు ఇద్దరూ బైకుపై గ్రామ సమీపంలోని హేమావతి నది వద్దకు వెళ్లారు. రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవటంతో అత్తమామలు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో నది ప్రాంతం వద్దకు వెళ్లగా బైక్ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు నది చుట్టూ గాలింపు చేపట్టగా కృతికా మృతదేహం బయట పడింది. శుక్రవారం తెల్లవారుజామున అర్థేశ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను సకలేశపుర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవదంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment