High Court Advocates Association
-
ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఫ్లెక్సీని చించి అవమానించిన ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీపైన, రఘురామకృష్ణరాజుపైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. బుధవారం హైకోర్టు ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో న్యాయవాదులు భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. రఘురామకృష్ణరాజు, నానాజీలను అరెస్ట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి రఘురామకృష్ణరాజు కుల అహంకారాన్ని ప్రదర్శించారని, ఇది క్షమించరాని నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తుడిగా పరిగణించబడుతున్న రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి భర్తరఫ్ చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన వైద్యుడిపై ఎమ్మెల్యే దాడి హేయమని, ఫ్రొఫెసర్కే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి అంబేడ్కర్ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. -
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్‌తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్‌స్కేప్‌లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్‌లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్‌లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
కదం తొక్కిన న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: తమ సంక్షేమానికి బడ్జెట్లో రూ.5 వేల కోట్ల కేటాయింపు, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల ఉపకార వేతనం చెల్లింపు, మెడిక్లెయిమ్, రూ.20 లక్షల బీమా తదితర డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టులో కూడా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు కూడా లేకపోవడంతో న్యాయమూర్తులు బెంచ్ దిగి తమ చాంబర్లకు వెళ్లిపోయారు. ఉదయం 11.30 కల్లా హైకోర్టు దాదాపుగా ఖాళీ అయింది. అనంతరం న్యాయవాదులు బార్ కౌన్సిల్ గేటు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు అక్కడ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఆ తరువాత పలువురు న్యాయవాదులు హైదరాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడ కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రం అందించారు. ఆ వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపాలని కలెక్టర్‌ను కోరారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పీపుల్స్ ప్లాజాకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్‌తో పాటు హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఇతర కోర్టుల న్యాయవాదుల సంఘాల ప్రతివాదులు మంగళవారం నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బార్ కౌన్సిళ్లకు జూన్ 29న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు విడివిడిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ బార్ కౌన్సిల్ ప్రతిపాదనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో రెండు బార్ కౌన్సిళ్లకు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 17 నుంచి 26 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 29న తుది జాబితా విడుదల చేస్తారు. జూన్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి హైకోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ భవనంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో విడివిడిగా పోలింగ్ జరగనుంది. ఒక్కో బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యుల చొప్పున ఎన్నుకుంటారు. ఎన్నికైన సభ్యులు బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. -
వైఎస్ జగన్ సంఘీభావం
తెనాలి: రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు. మద్దతు తెలిపిన హైకోర్టు న్యాయవాదులు ఇదిలా ఉండగా.. ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ ఎంపీలకు హైకోర్టు న్యాయవాదులు(ఏపీ) సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు బయట ర్యాలీ నిర్వహించి.. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మీకు అండగా మేముంటాం.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం మరింత ఉధృతమయ్యింది. హోదా సాధనే లక్ష్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ ఎంపీలకు ప్రజలు బాసటగా నిలిచారు. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన ఎంపీలకు సంఘీభావం తెలిపారు. మీ వెంట మేమున్నామంటూ రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థులు యువకులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలుచోట్ల బైక్‌ర్యాలీలు నిర్వహించగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక హోదా కోసం పూజలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదుల సంఘీభావం
-
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కనకయ్య
కార్యదర్శులుగా పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జెల్లి కనకయ్య ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి రేసు మహేందర్‌రెడ్డిపై 157 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా ఎస్.సురేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోశాధికారిగా నగేశ్ దారా, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా అరవింద్ కుమార్ కాటా విజయం సాధించారు. వీరితో పాటు మరో 13 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. వీరంతా ఏడాది పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. -
'కేంద్రం తీరుపై సీఎం ఆవేదనతో ఉన్నారు'
హైదరాబాద్ : హైకోర్టు విభజన విషయంల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ ఆవేదనతో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ కె.కవిత తెలిపారు. అందుకే ఆయన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామని కేంద్రప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో కె.కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైకోర్టు విభజనపై ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు చర్చించారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రక్రియ అంతా కేంద్రంపరిధిలోనే జరగాలన్నారు. క్లాస్ -4 ఎంప్లాయిస్ నుంచి జడ్జిల నియామకం వరకు వివాదం నెలకొని ఉందన్నారు. రేపు జరిగే ఎల్పీ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయాధికారులకు ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కె.కవిత డిమాండ్ చేశారు. ఇద్దరు జడ్జిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. కేంద్రం వెంటనే స్పందించి హైకోర్టును విభజించాలన్నాని తెలిపారు. జడ్జిలకు జరిగిన అన్యాయంపై స్పందించాలని ఆమె అన్ని పార్టీలకు సూచించారు. ఇంత జరుగుతున్న విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని కె.కవిత ప్రశ్నించారు. -
మధ్యవర్తిత్వంతో ప్రజలకు తక్షణ న్యాయం
హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలే విశాఖ లీగల్: మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు తక్షణ న్యాయం అందుతుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలే అన్నారు. ఆ దిశగా న్యాయవాదులు దృష్టి సారించాలని సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం నిర్వహించిన న్యాయవాదుల క్రీడా సాంస్కృతిక ఉత్సవాల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశాఖలో త్వరలో న్యాయవాదులకు, సంబంధిత వ్యక్తులకు మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇప్పిస్తామన్నారు. విశాఖలో న్యాయవాదులందరూ హైకోర్టు న్యాయవాదులుగా ఎదిగా అవకాశముందంటూ ఇక్కడ హైకోర్టు ఏర్పాటుపై పరోక్ష సంకేతాలిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ మాట్లాడుతూ న్యాయవిద్య వ్యక్తిగతం కాదని, సమాజానికి, జాతికి సంబంధించిందన్నారు. -
మరో అవినీతి చేప
ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్‌శాఖ సీనియర్ అసిస్టెంట్ - రూ.3,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైన - పట్టించిన హైకోర్టు న్యాయవాది.. ఖమ్మం క్రైం: కిందిస్థాయి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోరుున సత్తుపల్లి ట్రాన్స్‌కో డీఈఈ సుదర్శన్ ఉదంతం మరవకముందే మరో అవినీతి చేప పట్టుబడింది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని పరిపాలన విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జె.గణపతిరావు రూ.3,000 లంచం తీసుకుంటూ బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టు బడ్డాడు. కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన బెరైడ్డి సీతారాంరెడ్డి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయనకు సంబంధిం చిన వాల్యుడేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.100తో చలా నా కూడా చెల్లించాడు. ఈ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.గణపతిరావు రూ.3వేలు లం చం అడిగాడు. సీతారాంరెడ్డి రూ.100 చలానాతో వచ్చే వ్యాలిడేషన్ సర్టిఫికెట్‌కు రూ.3వేలు లంచం ఏమిటని ప్రశ్నించగా.. లంచం ఇస్తే కాని సర్టిఫికెట్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ తెగేసి చెప్పాడు. సీతారాంరెడ్డి ఏసీబీ సిబ్బందిని ఆశ్రయించారు. వారు పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న గణపతిరావును అరెస్ట్ చేసి ఆయన వద్ద ఉన్నరూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు. పూర్వాపరాలు.. హైకోర్టు లాయర్ సీతారాంరెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నకుమారుడు అరుణ్‌రెడ్డి సినీ హీరోగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్దకుమారుడు గౌతమ్‌రెడ్డికి, ఆయన భార్యకు మధ్య ఇటీవల వివదాలు పొడచూపారుు. సీతారాంరెడ్డి కుటుంబంపై కేసులు అయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఆయన ఇద్దరు కుమారులు ఇక్కడున్న వారి ఆస్తులకు సంబంధించి తండ్రి పేరు మీద ఆదేశం నుంచి పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు. దీనికి సంబంధించి రూ.100 చలానా కట్టి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాల్యుడేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. దీనికోసం సీతారాంరెడ్డి ఈనెల 13న చలానా కట్టారు. వాల్యుడేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయూనికి వచ్చారు. దీనికి సంబంధించిన విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జె. గణపతిరావుని సంప్రదించారు. ఆయన రూ.3,000 లంచం అడిగారు. ఖంగుతిన్న సీతారాంరెడ్డి రూ.100 చలనా కడితే వచ్చే సర్టిఫికెట్ కోసం రూ.3,000 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తాను హైకోర్టు న్యాయవాదినని కూడా చెప్పారు. అవన్నీ పక్కనబెట్టు డబ్బులిస్తే గానీ సర్టిఫికెట్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ గణపతిరావు తెగేసి చెప్పారు. బాధితుడు జిల్లా రిజిస్ట్రార్‌ను కలవడానికి ప్రయత్నించారు. వరంగల్ ఇన్చార్జి సుభాషిణి జిల్లాకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండటంతో ఆమె అందుబాటులో లేరు. వాస్తవానికి 18వ తేదీనే రిజిస్ట్రార్ ఈ సర్టిఫికెట్‌పై సంతకం చేశారు. సీతారాంరెడ్డి వస్తే ఇవ్వమని సీనియర్ అసిస్టెంట్‌కు అప్పగించి వెళ్లారు. ఆయన రూ.3,000 ఇస్తేనే పనవుతుందని ఈనెల 24వ తేదీ నుంచి తిప్పించుకుంటున్నాడు. గత్యంతరం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రరుుంచారు. ఏసీబీ నిఘా వేసిందిలా.. రూ.500 నోట్లు ఆరింటికి ఏసీబీ సిబ్బంది రసాయనం పూశారు. వాటిని సీతారాంరెడ్డి చేతిలో పెట్టి కార్యాలయంలో పలికి పంపించారు. రూ.3,000 లంచం తీసుకుంటుండగా ఏసీ బీడీఎస్పీ సాయిబాబా దాడి చేసి పట్టుకున్నారు. గణపతిరావు గతంలో సత్తుపల్లి, కూసుమంచి తదితర ప్రాంతాల్లో పనిచేశారని ఆయనపై అప్పట్లోనూ అవినీతి ఆరోపణలున్నాయని ఏసీబీ సిబ్బంది తెలిపారు. ఆయన పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారని రిజిస్ట్రేషన్ సిబ్బంది పేర్కొన్నారు.ఈ దాడిలో ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, పాపారావు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘ఉమ్మడి’ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సేవలు - అధికారిక నోటిఫికేషన్ విడుదల - వేసవి సెలవుల తర్వాత - 2న హైకోర్టు పునఃప్రారంభం - ప్రవేశంపై భద్రతా కారణాలతో ఆంక్షలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా న్యాయసేవలు అందించనుంది. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో పాటు అదే రోజున హైకోర్టు వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ‘హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఉన్నా సోమవారం నుంచి ‘హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30కి అనుగుణంగా ఈ మార్పులు చేశారు. ఇందుకు సంబంధిం చి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కె.శివప్రసాద్ శని వారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రకారం జూన్ 2 నుంచి కక్షిదారులు, న్యాయవాదులు కొత్త పేరు మీదనే పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ఇదే పేరు మీద ఉంటాయి. ఇదిలాఉండగా, ఉమ్మడి హైకోర్టును తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ నుంచి కూడా హైకోర్టుకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో న్యాయవాదులు, కక్షిదారుల ప్రవేశానికి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ శివప్రసాద్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈమేరకు సరైన కారణం చెప్పకుంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేయని న్యాయవాదులనెవర్నీ అనుమతించరు. భద్రతా సిబ్బందికి హైకోర్టు న్యాయవాదులు, ఇతరులు తమ గుర్తింపు కార్డులు చూపాల్సి ఉంటుం ది. కక్షిదారుల గుర్తింపునకు సంబంధించి సమస్య వస్తే వారి న్యాయవాది భద్రతా సిబ్బందికి తెలియజేయాలి. -
సెమీస్‌లో ఏపీ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా హైకోర్టు లాయర్ల క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జట్టు సత్తాచాటింది. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో రాష్ట్ర హైకోర్టు లాయర్ల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు లాయర్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏపీ జట్టు... అలహాబాద్ హైకోర్టు జట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఏపీ జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఠాకూర్ కరణ్ సింగ్ (56) అర్ధసెంచరీ సాధించగా, సయ్యద్ మన్సూర్ 33, సుమన్ గౌడ్ 32 పరుగులు చేశారు. ప్రత్యర్థి బౌలర్ ఫైజాన్ సిద్దిఖీ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అలహాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫైజాన్ సిద్ధిఖీ 26, శేఖర్ యాదవ్ 27, శైలేశ్ పాండే 30 పరుగులు చేశారు. ఏపీ బౌలర్లలో షాహిద్ 5 వికెట్లు తీయగా, సతీశ్ 2 వికెట్లు పడగొట్టాడు. -
లాయర్లపైనే దాడి చేస్తే మిగతావారి పరిస్థితేంటి?
హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ అన్నారు. లాయర్లపైనే దాడి చేస్తే మిగిలినవారి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో న్యాయవాదులపై దాడి ప్రజాస్వామ్య విలువలు దిగజార్చేలా ఉందని అన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పరిగణించాలన్నారు. పరిస్థితిని అదుపుచేయలేకుంటే ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పోలీసు కమిషనర్ కలిసిన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా అని అడిగారు. శాంతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని జూపూడి విమర్శించారు. హైకోర్టులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన
హైదరాబాద్‌లో సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లాయర్లు అప్రజాస్వామికంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యమాలు జరిగినప్పుడు సీమాంధ్ర లాయర్లు ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర లాయర్లపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అన్నారు. ఇలాంటి చర్యలతో సమైక్య ఉద్యమం మరింత బలపడుతుందని చెప్పారు. హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై తెలంగాణ న్యాయవాదుల దాడిని విశాఖపట్టణం బార్ అసోసియేషన్ ఖండించింది. దాడికి నిరసనగా జిల్లాకోర్టు దగ్గర న్యాయవాదుల రాస్తారోకో నిర్వహించారు. మానవహారం చేపట్టారు. తమ ప్రాంత న్యాయవాదులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.