
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఫ్లెక్సీని చించి అవమానించిన ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీపైన, రఘురామకృష్ణరాజుపైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు.
బుధవారం హైకోర్టు ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో న్యాయవాదులు భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. రఘురామకృష్ణరాజు, నానాజీలను అరెస్ట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి రఘురామకృష్ణరాజు కుల అహంకారాన్ని ప్రదర్శించారని, ఇది క్షమించరాని నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు.
ఆర్థిక నేరస్తుడిగా పరిగణించబడుతున్న రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి భర్తరఫ్ చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన వైద్యుడిపై ఎమ్మెల్యే దాడి హేయమని, ఫ్రొఫెసర్‌కే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి అంబేడ్కర్ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment