కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా మదనపల్లెలో బీఎస్పీ
కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీని అరెస్ట్ చేయాలని డిమాండ్
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును బర్తరఫ్ చేయాల్సిందేనని పట్టు
మదనపల్లె: టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేక పాలన చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద రోజుల కూటమి పాలనలో దళితులపై వంద దాడులు జరిగినా.. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగినా ఏమీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ‘వంద రోజుల టీడీపీ కూటమి ప్రభుత్వం.. దళితులపై 100 దాడుల ప్రభుత్వం’ పేరిట బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేస్తూ దళితులు నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల కాలంలో జరిగిన దాడులు, టీడీపీ పాలనలో కేవలం నాలుగు నెలల్లోనే జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందన్నారు. బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడిచేసి దూషణకు పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల కూటమి పాలనను గమనిస్తే.. దళితులనే లక్ష్యంగా పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై దళితులంతా ఆగ్రహంతో ఉన్నారని, ఇదే పంథాలో పాలన కొనసాగిస్తే టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటామన్నారు.
బీఎస్పీ నేతలపై కేసులు నమోదు
సబ్ కలెక్టరేట్ ఎదుట టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సబ్ కలెక్టరేట్‌కు చేరుకుని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కించి, వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై ధర్నా నిర్వహించినందుకు ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 290, పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ 341, సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వ చర్యల్ని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి.పరంజ్యోతి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment