హైసెక్యూరిటీ కష్టాలు
►ముందే డబ్బులు చెల్లించినా 15 రోజులు ఆగాల్సిందే..
►ప్లేటు బిగించుకునేందుకు కార్యాలయానికి రావాల్సిందే
►నంబర్ ప్లేట్‌కు డబ్బులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్‌కు అనుమతి నిరాకరణ
►చోద్యం చూస్తున్న ఆర్టీసీ, రవాణా అధికారులు
నెల్లూరు (రవాణా) : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తయారైంది రవాణాశాఖలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల జారీ పరిస్థితి. ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాణాలతో కూడిన నంబర్లు ప్లేట్లను బిగించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ ప్రక్రియతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా, ఆర్టీసీ శాఖలమధ్య సమన్వయలోపం కారణంగా కాంట్రాక్టరు ఆడింది ఆట పాడిందే పాటగా మారింది. దీంతో రవాణాశాఖలో వాహనదారులకు నంబరు ప్లేటు కష్టాలు వెంటాడుతున్నాయి.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనానికి తప్పనిసరిగా గుర్తింపుపొందిన సంస్థ నుంచే నంబర్ ప్లేటు బిగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నంబరు ప్లేట్‌కు ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధనను రవాణాశాఖ జారీ చేసింది. దీనిని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టర్ లింకోఆటోటెక్ సంస్థ నిర్వాహకులు నంబర్ప్లేట్ల జారీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారునికి 4 రోజుల్లో నంబర్‌ప్లేట్ జారీ చేయాలన్న నిబంధనను మరచి 15 రోజులకుపైగా తిప్పుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో రోజుకు 200 వాహనాలకుపైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.
వాటిలో కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోట్రాలీలు, ట్రాక్టర్ట్రాలీలు, లారీలు ఉన్నాయి. వాహనదారులు తమ ఇష్టారాజ్యంగా నంబర్లు ప్లేట్లు బిగించుకునే వీలులేకుండా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్లేట్లను మాత్రమే బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు బిగింపు కాంట్రాక్ట్‌ను లింకో ఆటోటెక్కు అప్పగించింది. జనవరి 15 నుంచి హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగింపు అమలులోకి తీసుకువచ్చారు. ద్విచక్రవాహనానికి రూ.250లు, నాలుగు చక్రాల వాహనానికి రూ.619లు, లారీకి రూ.650లు, ట్రాక్టర్ టేలర్‌కు రూ.900లు లెక్కన వసూలు చేస్తున్నారు.
డబ్బులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్
వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ముందుగా నంబరు ప్లేటు కోసం డబ్బులు చెల్లించి రసీదు తీసుకువస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రవాణా అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక వాహనదారులు ముందుగానే డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటున్నారు. వాస్తవంగా నిబంధనలు ప్రకారం రిజిస్ట్రేషన్‌కు, నంబరుప్లేటు వ్యవహరానికి ఎలాంటి సంబంధం పెట్టకూడదు.
నిర్లక్ష్యంగా సమాధానం
కాంట్రాక్టు నిబంధనలు ప్రకారం వాహనదారుడుకు 4 రోజుల్లో నంబరు ప్లేటు జారీచేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా హైసెక్యూరిటీ ప్లేటు జారీ 12 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. నంబరు ప్లేటు ఎందుకు ఆల స్యం చేస్తున్నారని ఎవరైన వాహనదారుడు ప్రశ్నిస్తే కాంట్రాక్టు సంస్థ సిబ్బం ది నుంచి నిర్లక్ష్యపు సమాధానం వస్తోం ది. పోనీ రవాణాశాఖ సిబ్బందిని అడిగితే నంబరు ప్లేటు వ్యవహారం తమకేమి తెలియదని సెలవిస్తున్నారు. పెపై చ్చు వాహనాన్ని రవాణా కార్యాలయానికి తీసుకువస్తేనే ప్లేటు ఇస్తామని మెలి కపెడుతున్నారు. రిజిస్ట్రేషన్, నంబరుప్లేటు బిగింపు వ్యవహారంలో రెండుసార్లు బండిని రవాణా కార్యాల యానికి తీసుకురావాల్సి వస్తుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
హైసెక్యూరిటీ నంబరు ప్లేటు వ్యవహరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రవాణాశాఖ అధికారులు కూడా ఈ వ్యవహారంలో మిన్నకుండిపోతున్నారు.
రిపోర్టు చేస్తున్నాం
నంబరు ప్లేటు జారీ ఆలస్యం విషయం నాదృష్టికి వచ్చింది. ఈ విషయంపై విచారించి రిపోర్టు తయారు చేస్తున్నాం. ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం. నంబరు ప్లేట్ల వ్యవహరం ఆర్టీసీ పర్యవేక్షణలో జరగాల్సి ఉంది.
- ఎన్.శివరాంప్రసాద్,ఉపరవాణా కమీషనర్