
ఎట్టకేలకు ‘హై సెక్యూరిటీ’
స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే కార్యక్రమం ప్రారంభమయ్యింది.
పరిగి: స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాహనాలకు నంబర్ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. 2013 డిసెంబర్‌లో మొదటిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్లు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసింది.
జిల్లాలో మొత్తం ఆరు ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా.. ఏడు నెలల క్రితం ఒక్క కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభించారు. మిగతా ఆరు ఆర్టీఏ కార్యాలయాల్లో ఐదు అర్బన్ జిల్లాలో ఉండగా గ్రామీణ జిల్లాలో పరిగిలో మాత్రమే ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఈ ఒక్క ఆర్టీఏ కార్యాలయంలోనూ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ వారంలోపు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు అప్పటినుంచీ నాన్చుతూ వచ్చారు.
ఇదే సమయంలో రాష్ట్ర పునర్విభజన కూడా జరగటంతో ఈ ప్రక్రియ కాస్త అటకెక్కింది. సమస్యలన్నీ తొలగటంతో ఎట్టకేలకు శుక్రవారం నుంచి పరిగిలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే ప్రక్రియ ప్రారంభానికి నోచుకుంది. ఇందుకోసం పరిగి ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కేవ లం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఈ నంబర్‌పేట్లు బిగిస్తారు.
అదనపు భారం భరించాల్సిందే..
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకయ్యే ఖర్చును వాహనదారులే భరించాల్సి వస్తుంది. అన్ని రకాల ట్యాక్సులు కలుపుకొని రేట్లు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనాలకు రూ.245, త్రీ వీలర్ (ఆటో తదితర వాహనాలు)కు రూ. 282, లైట్ మోటార్ వెహికల్ కార్లు తదితర వాహనాలకు రూ.619, ఇతర హెవీ ట్రాన్స్‌పోర్టు, వాణిజ్య వాహనాలకు రూ.649 చెల్లించి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగించుకోవాల్సి ఉంటుంది. దీనికిగాను వాహనదారు వారం రోజులు ముందుగానే ఆర్టీఏ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికైతే కొత్తవాహనాలకే
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు బాధ్యతను ఆర్టీఏ పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్లేట్ల బిగింటం, అవి తయారు చేసే బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. ఇప్పటి వరకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించేందుకు 150ప్రొసీడింగ్స్ సిద్ధంచేసి వారికి అందజేశాం. శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యింది. పది మంది వరకు వాహనదారులు దరఖాస్తులు చేసుకున్నారు. వారి వాహనాలకు వారం రోజుల్లో నంబర్ ప్లేట్లను బిగిస్తారు. ముందుగా కొత్త వాహనాలకు మాత్రమే ఏర్పాటు చేస్తాం. పాత వాహనాల విషయంలో ఇంకా ఎలాంటి ఆదేశాలూ అందలేదు.
- శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, పరిగి