‘బుగ్గ’పై సుప్రీం భగ్గు
ఎర్రబుగ్గ కార్లను ఇష్టారాజ్యంగా వాడడానికి వీల్లేదని స్పష్టీకరణ
ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. కార్లపై ఇష్టారాజ్యంగా ఎర్రబుగ్గ వాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే వీటిని ఉపయోగించాలని తెలిపింది. ఈ మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎర్రబుగ్గ వాడేందుకు అర్హులైనవారి జాబితాను మూడు నెలల్లోపు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభయ్‌సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ జీఎస్ సింఘ్వీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలను వెలువరించింది. అలాగే ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులు, పోలీసు, అగ్నిమాపక, ఎస్కార్టు, శాంతిభద్రతల నిర్వహణ కోసం వాడే వాహనాలు మాత్రమే నీలి, తెలుపు, బహుళ రంగు బుగ్గలను వాడాలని తెలిపింది. వీటికి వాడే ‘సైరన్’ కర్ణ కఠోరంగా ఉండకూడదని సూచించింది. ప్రైవేటు వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఎర్రబుగ్గలుకానీ, సైరన్ కానీ వాడకుండా చూడాలని తెలిపింది. దేశంలో పలుచోట్ల నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమ వాహనాలపై ఎర్రబుగ్గలను వాడుతున్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది.
ఎర్రబుగ్గ దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టింది. పోలీసులు కూడా అలాంటి వాహనాలను తనిఖీ చేయడానికి, జరిమానాలు విధించడానికి జంకుతున్నారని వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఎర్రబుగ్గ కార్ల వినియోగం రాచరికాన్ని గుర్తుతెచ్చేదిగా ఉంటుందని, ప్రస్తుత మన గణతంత్ర వ్యవస్థకు ఇది తగదని కోర్టు అభిప్రాయపడింది. ఎర్రబుగ్గ వాడేందుకు అర్హులైన వారి జాబితాను కూడా చాంతాడంత తయారు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం స్పష్టంచేసింది. 2002, 2005లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లకు అనుగుణంగా ఈ జాబితా ఉండాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించింది.