ఆటపాకలో హైటెన్షన్
చింతమనేని రాకతో ఉద్రిక్తత
మంత్రి కామినేనితో కలిసి చెరువు గట్టు పరిశీలన
పక్షులు, ప్రజలు రెండూ ముఖ్యమని వెల్లడి
సమస్య పరిష్కారానికి హామీ
కైకలూరు : ఆటపాక పక్షుల విహార కేంద్రం వద్ద ఆదివారం హైటెన్షన్ నడిచింది. సమీప పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కోమటిలంక ప్రజలకు ఆటపాక పక్షుల కేంద్రం చెరువుగట్టు నడక మార్గంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ గత నెల 29న చెరువుగట్టు రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులను ఆదేశించారు. దీంతో రోడ్డు పనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కైకలూరు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే చింతమనేని, మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వెంటబెట్టుకుని ఆటపాక తీసుకువెళ్లారు.
పక్షుల కేంద్రం గట్టు పరిశీలన...
ఆటపాక పక్షుల కేంద్రం వద్ద మంత్రి, ఎమ్మెల్యే వస్తున్నారని సమాచారం అందుకున్న కోమటిలంక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వచ్చీరాగానే టపాసులు పేల్చారు. దీంతో మంత్రి సీరియస్ అయ్యారు. విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఈ కేంద్రం విడిదిగా ఉందన్నారు. టపాసులు పేల్చడం వల్ల అవి చెల్లాచెదురవుతాయని మందలించారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనాలపై మంత్రి కామినేని, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పక్షుల కేంద్రం గట్టును పరిశీలించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆకాశం మేఘావృతం కావడంతో వాహనాలు తిరిగి వచ్చే అవకాశం ఉండదని వెనక్కి వచ్చేశారు.
అన్నా.. నువ్వే ఏదో ఒకటి చేయాలి
చింతమనేని ప్రభాకర్ మంత్రి కామినేనితో ‘అన్నా.. నా నియోజకవర్గ పరిధిలోని కోమటిలంక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.. నువ్వే ఏదో ఒకటి చేయాలి’ అని కోరారు. పత్రికా సోదరులు కూడా మానవతాదృకృథంతో వ్యహరించాలన్నారు. వర్షం వస్తే రోడ్డు బురదకయ్యగా మారుతోందని, విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.కామినేని స్పందిస్తూ.. దేశ వ్యాప్తంగా పర్యాటకులు వచ్చే ఏకైక పర్యాటక ప్రాంతం ఆటపాక పక్షుల కేంద్రమన్నారు. దురదృష్టవశాత్తూ ఈ రోడ్డు అటవీశాఖ అభయారణ్య పరిధిలో ఉందన్నారు.
అటవీ చట్టాలను గౌరవించాలి...
అటవీ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌర వించాలని మంత్రి చెప్పారు. కోమటిలంక గ్రామస్తుల ఇబ్బందులు వాస్తవమేనని, అటవీ అధికారుల వాదనలోనూ వాస్తవముందన్నారు. ఆటపాకలోని 300 ఎకరాల చెరువు పక్షులకు ఆశ్రయమిస్తోందని, దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పక్షులు, ప్రజలు రెండూ ముఖ్యమని ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కోమటిలంక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.