Hit formula
-
కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్ వస్తే
హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్’ ఒక హిట్ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు... పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం. ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది. ప్రేమాభిషేకం పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది. డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది. గీతాంజలి హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్ వస్తే చూస్తారా? ఫ్లాప్ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు. సుందరకాండ దర్శకుడు కె.భాగ్యరాజ్ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్ అయ్యింది. ‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు. మాతృదేవోభవ కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత. చక్రం.. జానీ.. హిందీ ‘ఆనంద్’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్ సినిమా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్–సెంటిమెంట్’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తల్లికి కేన్సర్ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రతిరోజూ పండగే... ఇటీవల కేన్సర్‌ను మెయిన్ పాయింట్‌గా చేసుకుని హిట్ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్ సెటైర్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. – సాక్షి ఫ్యామిలీ -
నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములా
అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ దన్ను రాయితీపై రూ. 6 వేల కోట్ల రుణం నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీలో మోడీ ప్రకటన ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు మూడు ఒప్పందాలపై సంతకాలు విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం కఠ్మాండు: సుదీర్ఘ కాలం తర్వాత నేపాల్‌లో అడుగుపెట్టిన భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రొటోకాల్‌ని పక్కనబెట్టి మరీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా స్వయంగా సాదర స్వాగతం పలికారు. నేపాల్ ఇద్దరు ఉప ప్రధానులూ ఆయన వెంట వచ్చారు. 17 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని మోడీనే కావడం విశేషం. నేపాల్‌తో సరికొత్త బంధాన్ని ఏర్పరచుకుంటామని ఆ దేశానికి బయలుదేరే ముందు ప్రకటించిన మోడీ అందుకు తగినట్లే వ్యవహరించారు. నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములాను ప్రకటించారు. అలాగే అయోడిన్ లోపంతో తలెత్తే జబ్బులను నివారించేందుకు అయోడైజ్డ్ ఉప్పు సరఫరాకు అంగీకరించారు. ఇందుకు రూ. 5 కోట్ల గ్రాంటును కూడా ప్రకటించారు. కాగా, విమానాశ్రయంలో దిగిన మోడీకి నేపాల్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. భారత ప్రధానిని చూడటానికి స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇతర అధికారులతో కూడిన బృందం మోడీ వెంట వెళ్లింది. కఠ్మాండులోని ఓ స్టార్ హోటల్లో దిగిన మోడీతో తొలుత నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర పాండే భద్రత, వాణిజ్యం తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇక్కడి సింగా దర్బార్ సెక్రటేరియట్లో నేపాల్ ప్రధాని సుశీల్‌తో మోడీ చర్చలు జరిపారు. నేపాల్‌లో కొనసాగుతున్న శాంతి ప్రక్రియతో పాటు రాజ్యాంగ నిర్మాణం, ఆర్థిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మూడు ఒప్పందాలపై ఇరువురు నేతలూ సంతకాలు చేశారు. అయోడిన్‌తో కూడిన ఉప్పు సరఫరా, పంచేశ్వర్ ప్రాజెక్టు కోసం రాజ్యాంగ సవరణతో పాటు ఇరు దేశాల అధికారిక టీవీ కేంద్రాలైన దూరదర్శన్,నేపాల్ టెలివిజన్ మధ్య సహకారంపై ఈ ఒప్పందాలు జరిగాయి. అనంతరం నేపాల్ స్పీకర్‌ను కలిసేందుకు న్యూభనేశ్వర్లోని పార్లమెంట్ భవనం వద్దకు మోడీ బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్‌ని ఆపి మరీ సాధారణ ప్రజలను పలకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘హిట్’తో శీఘ్రాభివృద్ధి.. నేపాల్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆ దేశానికి రూ. 6 వేల కోట్ల రాయితీలతో కూడిన రుణాన్ని మోడీ ప్రకటించారు. మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం దీన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందిస్తున్న సాయానికి ఇది అదనమన్నారు. నేపాల్ వేగంగా అభివృద్ధి చెందేందుకు ‘హిట్(హెచ్ఐటీ)’ ఫార్ములాను మోడీ ప్రకటించారు. ‘హిట్ అంటే హెచ్-హైవేస్(జాతీయ రహదారులు), ఐ-ఐవేస్(అంతర్గత రోడ్లు), టి-ట్రాన్స్‌వేస్(వాయు, జల మార్గాలు). ఈ మూడింటి వల్ల నేపాల్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీలైనంత త్వరగా ఈ బహుమతిని అందించాలని భారత్ ఆశిస్తోంది’ అని సభ కరతాళ ధ్వనుల మధ్య అన్నారు. నేపాల్‌లో జల విద్యుదుత్పత్తికి అద్భుత అవకాశాలున్నాయని, కేవలం భారత్‌కు విద్యుత్‌ను అమ్మడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నేపాల్ స్థానం సంపాదించవచ్చని అన్నారు. నేపాల్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన రెండో విదేశీ నేతగా మోడీ ప్రత్యేక ంగా నిలిచారు. మోడీ శాకాహార ప్రియుడు! పరాయి దేశంలోనూ మోడీ శాకాహారానికే ఓటేస్తున్నారు. ఆదివారం రాత్రి నేపాల్ ప్రధాని సుశీల్.. మోడీకి ఐదు నక్షత్రాల హోటల్లో విందు ఇచ్చారు. భారతీయ పాకశాస్త్ర నిపుణుడు (చెఫ్) నందకుమార్ గోపీ సూచనల మేరకు మోడీ కోసం శాకాహార భోజనాన్ని సిద్ధం చేశారు. నాన్రోటి, పప్పు, కూరగాయలనే మోడీ ఇష్టపడతారని, బ్రేక్‌ఫాస్ట్‌లో మసాలా టీ, నిమ్మరసం తీసుకోవడానికి ప్రాధాన్యం చూపుతారని ఆ చెఫ్ తెలిపారు.ట నేపాలీల మది దోచుకున్న మోడీ మోడీ నేపాల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి నేపాలీ భాషలో మాట్లాడి నేపాలీల హృదయాలను కొల్లగొట్టారు. హిందీలో మాట్లాడేముందు కాసేపు నేపాలీలో మాట్లాడారు. ఇదివరకు యాత్రికుడిగా నేపాల్‌ను సందర్శించానని, ఇప్పుడు ప్రధానిగా, స్నేహితుడిగా రావడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. నేపాల్ శస్త్ర(ఆయుధాలు)ను వదిలి శాస్త్ర(విజ్ఞానం) వైపు మళ్లి, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆయన 45 నిమిషాల పాటు మాట్లాడారు. -
అత్తా అళ్లుల్ల హిట్ ఫార్ములా
-
హిట్ ఫార్ములా