horticulture cultivation
-
కోతులు తాకని పంజరపు తోట!
ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. కోతుల తాకిడికి తట్టుకోలేక పెరటి తోటలు/ మేడలపై ఇంటిపంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు. అయితే, పెరట్లో పాతికేళ్లుగా ఇంటిపంటలు సాగు చేసుకునే అలవాటు ఉన్న ముళ్లపూడి సుబ్బారావు కోతుల సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న పట్టుదలతో పంజరపు తోట(కేజ్ గార్డెన్)ను ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బారావు ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగిన వ్యక్తి. సామాజిక చైతన్యం కలిగిన కథా రచయిత కూడా. సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్ మేనేజర్‌గా కొత్తగూడెంలో పనిచేస్తున్న ఆయన తన క్వార్టర్ పక్కనే గచ్చు నేలపై ఇనుప మెష్‌తో పంజరం నిర్మించుకొని.. అందులో మడులు, పాత టబ్‌లు, బక్కెట్లలో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటున్నారు. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవున 9 అడుగుల ఎత్తున తన కిచెన్ గార్డెన్‌కు రూ. 40 వేల ఖర్చుతో ఇనుప పంజరాన్ని నిర్మించుకున్నారు. కుమారుడు విదేశాల్లో స్థిరపడటంతో దంపతులు ఇద్దరే నివాసం ఉంటున్నారు. సుబ్బారావు తన అభిమాన మినీ పొలమైన ఇనుప పంజరంలో.. బెండ, వంగ, టమాటా, అలసంద, పొట్ల, ఆనప(సొర) వంటి కూరగాయలతోపాటు 6 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో 6 నెలలు కూరగాయలు, ఆకుకూరలు నూటికి నూరు శాతం, మిగతా 6 నెలలు 50% మేరకు తమ పంజరపు తోటలో కూరగాయలు, ఆకుకూరలనే తింటున్నామని ఆయన సంతృప్తిగా చెప్పారు. ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను పొందడంతోపాటు.. కంటి నిండా పచ్చదనం పంజరపు తోట రూపంలో అందుబాటులో ఉండటంతో దైనందిన జీవితంలో ఒత్తిడిని మర్చిపోయి సాంత్వన పొందుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఫైబర్ టబ్‌లు అందుబాటులోకి రావడంతో ఇంటిపంటల సాగు కొంత సులభమైందన్నారు. తక్కువ స్థలంలో, మనకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను అధిక దిగుబడి పొందడానికి పంజరపు తోట ఉపకరిస్తోందన్నారు. క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు అవకాశం ఉన్న వారు పంజరపు తోటను ఏర్పాటు చేసుకుంటే.. ఇల్లు మారినా, ఊరు మారినా.. దీన్ని కూడా పెద్దగా కష్టపడకుండానే తరలించుకెళ్లవచ్చని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లున్న వారికి పంజరపు తోట ఖర్చు భరించలేనిదేమీ కాదని, ఒక సోఫాపై పెట్టే ఖర్చుతోనే దీన్ని సమకూర్చుకోవచ్చన్నారు. క్యాంపులకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి టైమర్‌తో కూడిన డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. కోతుల బెడదకు విరుగుడుగా పంజరపు తోటను నిర్మించుకున్న సుబ్బారావు (94911 44769) దంపతులకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది. ముళ్లపూడి సుబ్బారావు -
ఉద్యాన పంటలు పెంచుతాం
ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశాం మామిడి, బత్తాయి, జామ, సీతాఫలం, యాపిల్ బేర్ పండ్ల మొక్కలు సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం 160 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి అనుమతులు పట్టు పరిశ్రమ శాఖ కార్యక్రమాలు విస్తృతం చేస్తాం ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సోమేశ్వర్రావు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తామని.. జిల్లా ఉద్యానవన శాఖ ఏడీ సోమేశ్వర్రావు వెల్లడించారు. పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పాలీహౌస్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. ఇటీవల తమశాఖలో విలీనమైన పట్టు పరిశ్రమ శాఖ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని సోమేశ్వర్రావు తెలిపారు. తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన గురువారం ‘సాక్షి’కి వివరించారు. సాక్షి, సంగారెడ్డి : సాక్షి : జిల్లాలో బిందు సేద్యానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? అధికారి : జిల్లాలో ఈ ఏడాది 2800 హెక్టార్లలో బిందుసేద్యం పరికరాలను అమర్చడం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అయితే పదివేల హెక్టార్లలో ఏర్పాటు చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో దరఖాస్తులు తీసుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా కనీసం ఐదువేల హెక్టార్లలో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. సాక్షి : ఉద్యాన పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది? అధికారి : స్టేట్ హార్టీకల్చర్ మిష¯ŒS కింద ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే యోచనలో ఉన్నాం. మామిడి, బత్తాయి, జామ, సీతాఫలం, యాపిల్ బేర్ తదితర పండ్ల మొక్కల సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. పందిరి కూరగాయలు సాగుకు కూడా ఎకరాకు లక్ష రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. కడీలు, వైర్ తదితరాల ఏర్పాటుకు ఈ మొత్తాన్ని వెచ్చించాల్సి వుంటుంది. సాక్షి : పాలీహౌస్‌లకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? అధికారి :జిల్లాల్లో 160 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి మంజూరు లభించింది. ఒక్కో యూనిట్ విలువ రూ.33.70లక్షలు. ఇందులో 25.30లక్షలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. 2014–15లో 30 ఎకరాలు, 2015–16లో 50 ఎకరాలు 90శాతం సబ్సిడీపై ఇచ్చాం. 2016–17కు సంబంధించి ఇంకా బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది. సాక్షి : పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేశారు కదా. పనితీరు ఎలా ఉంది? అధికారి :ఇటీవల పట్టు పరిశ్రమ శాఖ (సెరికల్చర్) విభాగాన్ని ఉద్యానవన విభాగంలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆ విభాగానికి చెందిన సిబ్బంది మా పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాలో సెరికల్చర్ కార్యక్రమాలు పెద్దగా అమలు కావడం లేదు. సంగారెడ్డి శివారులో ఉన్న చాల్కి సెంటర్ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి కేవలం పట్టుగుడ్లు తెచ్చి స్థానికంగా సరఫరా చేయడానికే పరిమితమైంది. పట్టు పరిశ్రమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తాం. -
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు..
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం భారీ రాయితీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమలు చేసే ప్రత్యేక కార్యక్రమాల్లో జిల్లాకు భారీ వాటా దక్కనుంది. వీటి అమలుతో ఎక్కువ విస్తీర్ణంలో పూలు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు కావాలంటే ఉద్యాన పంటలే మేలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ దిశగా ఆలోచన చేసి భారీ రాయితీలతో గ్రీన్హౌస్ పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా ఉద్యానశాఖ సహాయ సంచాలకులు డి.ఉమాదేవి పేర్కొన్నారు. గతంలో కంటే నాలుగోవంతు రాయితీ పెంచడమే కాకుండా, పరిమితులను సైతం భారీగా పెంచిదని, ఈ పథకం ద్వారా జిల్లా రైతాంగం ఎక్కువగా లబ్ధి పొందుతుందని అన్నారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఉమాదేవి వెల్లడించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్యాన శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, రైతులకు పలు సలహాలను వివరించారు. రంగారెడ్డి జిల్లా: ఉద్యాన సాగు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు పొందేలా రూపొందించిన గ్రీన్హౌస్ పథకంలో భాగంగా రైతులకు భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యాన శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం, అవగాహన సదస్సులు, పంటల సాగులో శిక్షణ, జాగ్రత్తలు, పద్ధతులు తదితర అంశాలపై ఆ శాఖ సహాయ సంచాలకులు ఉమాదేవి ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రయోగాత్మక పద్ధతులు అవలంబించాలి ప్రస్తుతం కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన భూ విస్తీర్ణం విభజించాల్సివస్తోంది. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి వచ్చే విస్తీర్ణం తగ్గడంతో వారు పాత పద్ధతులతోనే పంటలు సాగు చేస్తున్నారు. గతంలో వేసే వ్యవసాయ పంటలైన వరి, జొన్న, ఆముదంలాంటివే వేస్తున్నారు. దీంతో రైతులు లాభాల్లో కాకుండా నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉద్యాన పంటలు సాగు చేయడమే మేలు. పండ్ల రకాల్లో జామ, బొప్పాయి, అరటి, దానిమ్మ పంటలు మన భూములకు మేలు. నీటి లభ్యతను బట్టి ఎంచుకోవాలి. అదేవిధంగా కూరగాయలు, పూల తోటల్లోనూ లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి. విత్తనాలపై ఇప్పటికే ఉద్యానశాఖ రాయితీలు అందజేస్తోంది. పూలు, కూరగాయల సాగుపై ఒక్కో రైతులకు రెండు హెక్టార్లు, పండ్ల తోటలపై ఒక హెక్టారుకు మించకుండా ఈ రాయితీలు వర్తిస్తాయి. గ్రీన్‌హౌస్‌లతో భారీగా దిగుబడులు.. ఉద్యాన పంటల సాగుకు గ్రీన్హౌస్ విధానం ఎంతో మేలు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. గతంలో ఒక్కో రైతుకు గరిష్టంగా అర ఎకరా విస్తీర్ణం వరకే అనుమతి ఇచ్చేవారు. తాజాగా ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు రాయితీ ప్రకటించింది. గతంలో 50 శాతం మాత్రమే రాయితీ ఇస్తుండగా.. ప్రస్తుతం రాయితీని ఏకంగా 75శాతానికి పెంచింది. దీంతో జిల్లాలో రెట్టింపు మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సాధారణ పద్ధతుల కంటే గ్రీన్హౌస్ విధానంలో ఉద్యాన పంటలు సాగు చేస్తే కనీసం రెండింతలు ఎక్కువ దిగుబడి వస్తుంది. మార్కెటింగ్‌కు అనుకూలం.. నైసర్గిక స్వరూపం దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి సులువుగా చేరుకునేలా రహదారులున్నాయి. దూరం కూడా పెద్దగా లేకపోవడంతో రైతులు పండించే ఉద్యాన దిగుబడులు నేరుగా నగరానికి తరలించవచ్చు. కొందరు రైతులు గ్రూపుగా చేరుకుంటే సొంతంగా వాహనాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. నగరంలో ప్రస్తుతం ఉద్యాన పంటలకు డిమాండ్ అధికంగా ఉంది. కానీ దిగుబడుల్లో దాదాపు 80శాతం ఇతర రాష్ట్రాలనుంచే వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో ఉద్యాన పంటల దిగుబడులు భారీగా పతనమవుతాయి. ఈ సమయంలో ఆయా రాష్ట్రాలకు సైతం మనం కూరగాయలు, పూలను ఎగుమతి చేయవచ్చు. ఈ ఎగుమతులకు సైతం జిల్లా రైతాంగానికి అనుకూలంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే చేవెళ్ల, శామీర్‌పేట్ మండలాల రైతులు ఉద్యాన పంటల దిగుమతులను ఇతర రాష్ట్రాలు, అరబ్బు దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రవాణా చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ సైతం కల్పిస్తోంది. శిక్షణ, అవగాహన సదస్సులు.. ఉద్యాన పంటల సాగు పెంచే క్రమంలో రైతులను మరింత చైతన్యం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలో 28 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయలు సాగవుతున్నాయి. ఈ విస్తీర్ణాన్ని కనీసం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. త్వరలో శాఖాపరంగా లక్ష్యాలు ఖరారైన తర్వాత కార్యాచరణ చేపడతాం. -
పూలుంటే తేనె ‘పంటే’!
‘తేనెటీగల పెంపకంలో అతిముఖ్యమైనది ఆహారం. అంటే పుష్పించే కాలం. మామిడి, జీడి మామిడి తదితర తోటలు డిసెంబర్ నెలలో పూత మొదలై ఫిబ్రవరి నెల సగం వరకు పిందె కట్టుతాయి. వివిధ రకాల పూల మొక్కలు, కుంకుడు, కంది వంటివి కూడా చలికాలంలో పుష్పిస్తాయి. కావున తేనెటీగల పెంపకం ఈ కాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉన్న చిన్నతరహా పరిశ్రమ ఇది. దీనికి విశాలమైన స్థలంతో పనిలేదు. చదువులాంటి అర్హతలు అక్కర్లేదు. సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, గృహిణులు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగ యువత... ఎవరైనా ఈ పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. తేనెటీగలు పెంచే ముందు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. పెంపకం పద్ధతులను ఆకళింపు చేసుకుంటే చాలు. తొలి దశలో శిక్షణ తప్పని సరి.’ తేనెటీగల పెంపకం గురించి సూర్యనారాయణ ఇంకా ఏమంటున్నారో ఆయన మాటల్లోనే... పూలే ప్రధానం తేనెటీగలు పెంచాలనుకునే ప్రాంతంలో పుష్పసంపద కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రుతువులు, నెలల్లో పుష్పించే మొక్కల సమాచారాన్ని సేకరించాలి. వీటి పుష్పీకరణ వ్యవధిని కూడా గమనించాలి. పుష్ప సాంద్రత కూడా చాలా ప్రధానం. పూలు అధికంగా ఉండే సీజన్లోనే తేనెటీగలను పెంచాలి. తేనెటీగల పెంపకానికి కావలసిన సామగ్రిలో తేనెటీగల పెట్టే, హైవ్స్టాండ్ ముఖ్యమైనవి. తేనెటీగల పెట్టెగా టేకుతో చేసిన గూడు ఉపయోగించాలి. హైవ్ స్టాండ్: తేనెటీగల గూళ్లను నేలమట్టం కంటే కొంత ఎత్తులో ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. తేనెటీగలను చీమలు, చెద పురుగులు, కీటకాల నుంచి రక్షించేందుకు ఇది దోహదపడుతుంది. నేలలోని తేమ గూళ్లను తాకకుండా ఉండేందుకు అడుగున ఉన్న గూడుకు సైతం గాలి వెలుతురు సోకేం దుకూ ఈస్టాండ్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఐదు ఎకరాల మామిడి తోట ఉన్న రైతు 20-25 బాక్సులు తోట అంతటా అమర్చితే మూడు నుంచి ఐదునెలల కాలంలో సుమారు 25 లీటర్ల తేనె ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా సుమారు రూ. 18,000 నుంచి రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఈ ఆదాయం మామిడి, జీడి మామిడి పంటలకు అదనం. తేనెటీగల వలన పరపరాగ సంపర్కం జరిగి మామిడి, ఇతర పంటల్లో పిందెకట్టు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. -
‘ఉపాధి’లో తోటల పెంపకం
కొందుర్గు : ప్రస్తుతం ఆహార, వాణిజ్య, కూరగాయల పంటలకన్నా పండ్లతోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు సహకారం అందిస్తుండటంతో ఈ సాగుపై మక్కువ పెరిగింది. మహత్మాగాంది జాతీయ ఉపాదీహమీ పథకం ద్వారా తోటల పెంపకానికి ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించింది. మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం మొదలుకొని మొక్కలు పెరిగేంతవరకు దాదాపు అన్ని ఖర్చులు అందిస్తోంది. ఈ పథకంపై చాలామందికి పూర్తిస్థాయి అవగాహన లేక ప్రభుత్వం అందించే రాయితీలకు దూరమవుతున్నారు. ఉపాధి పథకం కింద పండ్లతోటలకు దరఖాస్తు చేసుకునే విధానం, పథకం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం. దరఖాస్తు ఇలా.. ప్రస్తుతం ఉపాధిహమీలో మామిడి, జామ, సపోట తోటలను పెంచుకునే అవకాశం ఉంది. తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు ముందుగా ఉద్యానవనశాఖ అధికారులతో క్షేత్ర ప్రదర్శన చేయించాలి. సాగు నేల ఏ తోటల పెంపకానికి అనుకూలమో తెలుసుకొని తోటల పెంపకం కోసం ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఐదు ఎకరాల పొలం కన్నా తక్కువ పట్టాభూమి గల జాబ్‌కార్డు కలిగియున్న రైతు పట్టాదారు పాసుపుస్తకం, 1బీ, కరెంటున్నట్టు ధ్రువీకరణ పత్రం, చిరునామ, గుర్తింపు దృవపత్రాలతోపాటు తహశీల్దార్ ధ్రువపరిచిన పొలం నక్షా జతచేసి తోటల పెంపకం కోసం ఉపాధిహమీ కార్యాలయంలో దరఖాస్తుచేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు కులధ్రువపత్రం జతచేస్తే, ఏడున్నర ఎకరాల పట్టా ఉన్న తోటల ఈ పథకంలో లబ్ధిపొందేందుకు అర్హుల వుతారు. నీటివసతి లేని వారు డ్రైహార్టికల్చర్ కూడా పెంచుకోవచ్చు. ఒక్కో రైతు నాలుగు ఎకరాల వరకు పెంచుకోవచ్చు. తోటల పెంపకం తీరుతెన్నులు తోటలపెంపకం కోసం ముందుగా భూసార పరీక్షలు చేయించాలి. ఇందుకోసం ఒక ఎకరానికిగాను 169 వస్తాయి. మొక్కకు మొక్కకు, వరుసకు వరుసకు 7.5 మీటర్లు ఉండేలా కొలత ప్రకారం ఎటూ మూడు పీట్ల లోతుగా గుంతలు తవ్వించాలి. గుంతలకు సంబంధించిన డబ్బులు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారానే చెల్లించడం జరుగుతుంది. ఈ లెక్కన ఎకరాకు 70 గుంతలు వస్తాయి. మొక్కలను కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. నర్సరీ నుంచి పొలం వద్దకు తెచ్చకునేందుకు కూడా రవాణాచార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది. మొక్కలు నాటేముందు సేంద్రి య, రసాయనిక ఎరువులు, వర్మీకంఫోస్టు కోసం ఎకరానికి 3500 చెల్లిస్తుంది. మొక్కలు నాటడం, ఊతకర్రల ఏర్పాటుకోసం ఎకరానికి 680 అందిస్తుంది. మొక్కల సంరక్షణలో భాగంగా తోటలో ఒక మొక్కనుంచి మరోమొక్కకు నీళ్లు పారించడానికి కాలువలు తీయడానికి ఎకరానికి 18 వేల వరకు లభిస్తుంది. డ్రిప్ కోసం.. నీటి వసతి ఉన్నట్లయితే ఉద్యానవనశాఖ ద్వారా డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఒక లక్ష వరకు పూర్తిగా ఉచితం, ఇతరులకు 90 శాతం ఉచితంగా డ్రిప్ ఏర్పాటుచేసుకోవచ్చు. అలాగే డ్రిఫ్ పైపులైన్ తీయడానికి కూడా ఉపాధిహమీ ద్వారా ఎకరానికి 5 వేల వరకు ఉపాధి హామీ ద్వారా చెల్లించడం జరుగుతుంది. అలాగే అంతరసేద్యంలో భాగంగా పొలం దున్నడం, అంతర పంటలసాగుకోసం కూడా డబ్బులు చెల్లిస్తుంది. డ్రిప్ సౌకర్యం లేనట్లయితే.. మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి ఏడాదికి 40 సార్లు మొక్కకు 10 లీటర్ల చొప్పున నీళ్లు పోసుకేందుకోసం ప్రభుత్వం ఎకరానికి 11620 చెల్లిస్తుంది. ఇలా మూడేళ్లపాటు నీళ్లు పోయడానికి డబ్బులు అందించడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాలు అందించడానికి ఒక్కో మొక్కకు 25ల చొప్పున ఎకరానికి 1750, మూడేళ్లపాటు అందిస్తుంది. సస్యరక్షణ చర్యలో భాగంగా గుంతల్లోని మట్టిని తిప్పేయడం, ఎరువులు, పిచికారి మందులకోసం ఏడాదికి 12600 చొప్పున మూడే ళ్లపాటు అందజేయడం జరుగుతుంది. ఇలా తోటల పెంపకం ప్రోత్సహించాలని ప్రభుత్వం ఎకరానికి దాదాపు 10 లక్షల వరకు ఉచితంగా అందిస్తుంది. తోటలు పెరిగి పండ్లనిచ్చాక రైతు స్వేచ్ఛగా విక్రయించుకొని లాభాలు పొందవచ్చు.