తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు..
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం భారీ రాయితీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమలు చేసే ప్రత్యేక కార్యక్రమాల్లో జిల్లాకు భారీ వాటా దక్కనుంది. వీటి అమలుతో ఎక్కువ విస్తీర్ణంలో పూలు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు కావాలంటే ఉద్యాన పంటలే మేలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ దిశగా ఆలోచన చేసి భారీ రాయితీలతో గ్రీన్‌హౌస్ పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా ఉద్యానశాఖ సహాయ సంచాలకులు డి.ఉమాదేవి పేర్కొన్నారు. గతంలో కంటే నాలుగోవంతు రాయితీ పెంచడమే కాకుండా, పరిమితులను సైతం భారీగా పెంచిదని, ఈ పథకం ద్వారా జిల్లా రైతాంగం ఎక్కువగా లబ్ధి పొందుతుందని అన్నారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఉమాదేవి వెల్లడించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్యాన శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, రైతులకు పలు సలహాలను వివరించారు.
రంగారెడ్డి జిల్లా: ఉద్యాన సాగు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు పొందేలా రూపొందించిన గ్రీన్‌హౌస్ పథకంలో భాగంగా రైతులకు భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యాన శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం, అవగాహన సదస్సులు, పంటల సాగులో శిక్షణ, జాగ్రత్తలు, పద్ధతులు తదితర అంశాలపై ఆ శాఖ సహాయ సంచాలకులు ఉమాదేవి ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ప్రయోగాత్మక పద్ధతులు అవలంబించాలి
ప్రస్తుతం కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన భూ విస్తీర్ణం విభజించాల్సివస్తోంది. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి వచ్చే విస్తీర్ణం తగ్గడంతో వారు పాత పద్ధతులతోనే పంటలు సాగు చేస్తున్నారు. గతంలో వేసే వ్యవసాయ పంటలైన వరి, జొన్న, ఆముదంలాంటివే వేస్తున్నారు. దీంతో రైతులు లాభాల్లో కాకుండా నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉద్యాన పంటలు సాగు చేయడమే మేలు. పండ్ల రకాల్లో జామ, బొప్పాయి, అరటి, దానిమ్మ పంటలు మన భూములకు మేలు. నీటి లభ్యతను బట్టి ఎంచుకోవాలి. అదేవిధంగా కూరగాయలు, పూల తోటల్లోనూ లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి. విత్తనాలపై ఇప్పటికే ఉద్యానశాఖ రాయితీలు అందజేస్తోంది. పూలు, కూరగాయల సాగుపై ఒక్కో రైతులకు రెండు హెక్టార్లు, పండ్ల తోటలపై ఒక హెక్టారుకు మించకుండా ఈ రాయితీలు వర్తిస్తాయి.
గ్రీన్‌హౌస్‌లతో భారీగా దిగుబడులు..
ఉద్యాన పంటల సాగుకు గ్రీన్‌హౌస్ విధానం ఎంతో మేలు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. గతంలో ఒక్కో రైతుకు గరిష్టంగా అర ఎకరా విస్తీర్ణం వరకే అనుమతి ఇచ్చేవారు. తాజాగా ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు రాయితీ ప్రకటించింది. గతంలో 50 శాతం మాత్రమే రాయితీ ఇస్తుండగా.. ప్రస్తుతం రాయితీని ఏకంగా 75శాతానికి పెంచింది. దీంతో జిల్లాలో రెట్టింపు మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సాధారణ పద్ధతుల కంటే గ్రీన్‌హౌస్ విధానంలో ఉద్యాన పంటలు సాగు చేస్తే కనీసం రెండింతలు ఎక్కువ దిగుబడి వస్తుంది.
మార్కెటింగ్‌కు అనుకూలం..
నైసర్గిక స్వరూపం దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి సులువుగా చేరుకునేలా రహదారులున్నాయి. దూరం కూడా పెద్దగా లేకపోవడంతో రైతులు పండించే ఉద్యాన దిగుబడులు నేరుగా నగరానికి తరలించవచ్చు. కొందరు రైతులు గ్రూపుగా చేరుకుంటే సొంతంగా వాహనాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. నగరంలో ప్రస్తుతం ఉద్యాన పంటలకు డిమాండ్ అధికంగా ఉంది. కానీ దిగుబడుల్లో దాదాపు 80శాతం ఇతర రాష్ట్రాలనుంచే వస్తున్నాయి.
ఈ పరిస్థితిని అధిగమించాలంటే జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో ఉద్యాన పంటల దిగుబడులు భారీగా పతనమవుతాయి. ఈ సమయంలో ఆయా రాష్ట్రాలకు సైతం మనం కూరగాయలు, పూలను ఎగుమతి చేయవచ్చు. ఈ ఎగుమతులకు సైతం జిల్లా రైతాంగానికి అనుకూలంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే చేవెళ్ల, శామీర్‌పేట్ మండలాల రైతులు ఉద్యాన పంటల దిగుమతులను ఇతర రాష్ట్రాలు, అరబ్బు దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రవాణా చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ సైతం కల్పిస్తోంది.
శిక్షణ, అవగాహన సదస్సులు..
ఉద్యాన పంటల సాగు పెంచే క్రమంలో రైతులను మరింత చైతన్యం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలో 28 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయలు సాగవుతున్నాయి. ఈ విస్తీర్ణాన్ని కనీసం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. త్వరలో శాఖాపరంగా లక్ష్యాలు ఖరారైన తర్వాత కార్యాచరణ చేపడతాం.