దేవునికడపలో ఆలయానికి వచ్చిన కార్పొరేటర్ ఉమాదేవి, ఇతర మహిళా నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎంత కాలమైనా పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోవాలా.. నాయకత్వ పగ్గాలు పుచ్చుకునే అర్హత మాలో ఎవరికీ లేదా.. నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా’ అని కడప టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామని, మాలో ఒకరికి టికెట్ కేటాయించాలని కోరుతూనే, నాన్‌లోకల్ అభ్యర్థికి సహకరించబోమని తెగేసి చెబుతున్నారు. వెరసి తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న కోల్డ్‌వార్ తెరపైకి వచ్చింది. ఇన్‌చార్జితో ప్రమేయం లేకుండా ఆ ముగ్గురు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు విడుదల కావాలని దేవునికడప శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. టీడీపీ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి తన కోడలు, కార్పొరేటర్ ఉమాదేవికి నియోజకవర్గ ఇన్‌చార్జి అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవీరెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. అప్పటికే పలుమార్లు అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై స్థానికులకు అవకాశం కల్పించాలని కడప నేతలు కోరారు.
గతంలో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దుర్గాప్రసాద్, అమీర్‌బాబుకు అవకాశం కల్పించాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే కార్పొరేటర్ ఉమాదేవికి ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని విన్నవించారు. మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి కడప పట్టం కట్టడాన్ని.. ఆ ముగ్గురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుంటే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.
ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ
ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. అభ్యర్థిగా స్థానికులనే నిర్ణయించాలని కడప గడపలో తెలుగు తమ్ముళ్లు పట్టుబట్టుతున్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రమేయం లేకుండా నాన్‌లోకల్ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికల్లో ఏమి చేయగరలని వాదిస్తున్నారు. అదే విషయాన్ని అధినేత చంద్రబాబుకే తేల్చి చెప్పామని టీడీపీ విజయం సాధించాలంటే లోకల్ వారిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌చార్జి మాధవీరెడ్డితో కలిసి పని చేసే పరిస్థితే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ మేరకు ఆమెతో ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చేపట్టారు. ఈ వ్యవహారం వినాయక ఉత్సవాల నుంచి కొనసాగుతోంది.
టీడీపీ నేతలు లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్, అమీర్‌బాబు ముగ్గురు కలిసికట్టుగా వినాయక మండపాలను సందర్శిస్తూ పూజలు చేపట్టారు. మాధవీరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆదివారం ఆ ముగ్గురు నేతలతోపాటు మరి కొందరు డివిజన్లు ఇన్‌చార్జిలతో కలిసి దేవునికడపలో 101 టెంకాయలు కొట్టారు. సోమవారం నుంచి పాతబస్టాండ్ సమీపంలో నిరసన టెంట్ ఏర్పాటు చేసి, వేరుగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. లోకల్ నాయకుల్ని అందర్నీ కలుపుకొని కార్యక్రమాలకు వెళ్లాలనే దిశగా ఆ ముగ్గురు అడుగులు వేస్తున్నారు. నాన్ లోకల్ అభ్యర్థికి ఇప్పటి నుంచే పోటీగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు.
వాసు ఏకపక్ష వైఖరి సహించం
‘టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుగోలుగా వెళ్లలేదు. పొలిట్‌బ్యూరో సభ్యుడు జిల్లాలోని టీడీపీ నేతల మన్ననలు పొందలేదు. పైగా వర్గ విభేదాలకు ఆస్కారం ఇచ్చేలా చర్యలుండిపోయాయి. వాసు ఏకపక్ష వైఖరి నేపథ్యంలో అభ్యర్థిగా మాధవీరెడ్డి నియామకాన్ని అడ్డుకునే చర్యలకు దిగినట్లు’ ఆ ముగ్గురు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆమెకే టీడీపీ టికెట్ కేటాయిస్తే ఓడగొట్టి తీరుతామని ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలకు, ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment