సాక్షి, అమరావతి: పోషక విలువలు అత్యధికంగా ఉండే మునగను ఆహారంలో తీసుకోవడం ద్వారా చేకూరే లాభాలను వివరిస్తూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో, ఇళ్ల వద్ద మునగ చెట్ల పెంపకం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.
మునగ చెట్లను పెంచి వాటి నుంచి సేకరించిన ఆకును వారంలో రెండు రోజులపాటు అంగన్‌వాడీ మెనూలో చేర్చారు. మునగ ఆకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో ఒక రూపంలో అందిస్తుండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విలువైన పౌష్టికాహారం అందుతోంది.
మునగాకుతో మేలు ఇలా..
మునగ ఆకు ద్వారా లభించే ఐరన్ గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత నివారించేందుకు దోహదం చేస్తుంది. మునగ ఆకులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే మునగ ఆకు గర్భిణుల్లో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేయడంతోపాటు సుఖ ప్రసవం జరిగేలా ఉపకరిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మునగ ఆకును ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి కొవ్వు పెరుగుతుంది. థైరాయిడ్ లాంటి అనేక సమస్యలు దరి చేరకుండా చేస్తుంది.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా..
రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు కలిపి దాదాపు 36 లక్షల మందికి అంగన్‌వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ తల్లులకు 200 మిల్లీ లీటర్లు, పిల్లలకు 100 మిల్లీ లీటర్ల చొప్పున పాలు అందిస్తున్నారు.
మునగ పొడితో మొదటి ముద్ద
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా 1,475 అంగన్‌వాడీల్లో మునగ చెట్ల పెంపకం చేపట్టాం. వారంలో రెండు రోజులపాటు మునగ ఆకుతో చేసిన కూర, పప్పు అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు ప్రతి రోజూ ఆహారంలో మొదటి ముద్ద మునగ ఆకు పొడితో తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. –ఉమాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment