కొందుర్గు : ప్రస్తుతం ఆహార, వాణిజ్య, కూరగాయల పంటలకన్నా పండ్లతోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు సహకారం అందిస్తుండటంతో ఈ సాగుపై మక్కువ పెరిగింది. మహత్మాగాంది జాతీయ ఉపాదీహమీ పథకం ద్వారా తోటల పెంపకానికి ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించింది.
మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం మొదలుకొని మొక్కలు పెరిగేంతవరకు దాదాపు అన్ని ఖర్చులు అందిస్తోంది. ఈ పథకంపై చాలామందికి పూర్తిస్థాయి అవగాహన లేక ప్రభుత్వం అందించే రాయితీలకు దూరమవుతున్నారు. ఉపాధి పథకం కింద పండ్లతోటలకు దరఖాస్తు చేసుకునే విధానం, పథకం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం.
దరఖాస్తు ఇలా..
ప్రస్తుతం ఉపాధిహమీలో మామిడి, జామ, సపోట తోటలను పెంచుకునే అవకాశం ఉంది. తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు ముందుగా ఉద్యానవనశాఖ అధికారులతో క్షేత్ర ప్రదర్శన చేయించాలి. సాగు నేల ఏ తోటల పెంపకానికి అనుకూలమో తెలుసుకొని తోటల పెంపకం కోసం ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఐదు ఎకరాల పొలం కన్నా తక్కువ పట్టాభూమి గల జాబ్‌కార్డు కలిగియున్న రైతు పట్టాదారు పాసుపుస్తకం, 1బీ, కరెంటున్నట్టు ధ్రువీకరణ పత్రం, చిరునామ, గుర్తింపు దృవపత్రాలతోపాటు తహశీల్దార్ ధ్రువపరిచిన పొలం నక్షా జతచేసి తోటల పెంపకం కోసం ఉపాధిహమీ కార్యాలయంలో దరఖాస్తుచేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు కులధ్రువపత్రం జతచేస్తే, ఏడున్నర ఎకరాల పట్టా ఉన్న తోటల ఈ పథకంలో లబ్ధిపొందేందుకు అర్హుల వుతారు. నీటివసతి లేని వారు డ్రైహార్టికల్చర్ కూడా పెంచుకోవచ్చు. ఒక్కో రైతు నాలుగు ఎకరాల వరకు పెంచుకోవచ్చు.
తోటల పెంపకం తీరుతెన్నులు
తోటలపెంపకం కోసం ముందుగా భూసార పరీక్షలు చేయించాలి. ఇందుకోసం ఒక ఎకరానికిగాను 169 వస్తాయి.
మొక్కకు మొక్కకు, వరుసకు వరుసకు 7.5 మీటర్లు ఉండేలా కొలత ప్రకారం ఎటూ మూడు పీట్ల లోతుగా గుంతలు తవ్వించాలి. గుంతలకు సంబంధించిన డబ్బులు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారానే చెల్లించడం జరుగుతుంది. ఈ లెక్కన ఎకరాకు 70 గుంతలు వస్తాయి.
మొక్కలను కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. నర్సరీ నుంచి పొలం వద్దకు తెచ్చకునేందుకు కూడా రవాణాచార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది.
మొక్కలు నాటేముందు సేంద్రి య, రసాయనిక ఎరువులు, వర్మీకంఫోస్టు కోసం ఎకరానికి 3500 చెల్లిస్తుంది.
మొక్కలు నాటడం, ఊతకర్రల ఏర్పాటుకోసం ఎకరానికి 680 అందిస్తుంది.
మొక్కల సంరక్షణలో భాగంగా తోటలో ఒక మొక్కనుంచి మరోమొక్కకు నీళ్లు పారించడానికి కాలువలు తీయడానికి ఎకరానికి 18 వేల వరకు లభిస్తుంది.
డ్రిప్ కోసం..
నీటి వసతి ఉన్నట్లయితే ఉద్యానవనశాఖ ద్వారా డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఒక లక్ష వరకు పూర్తిగా ఉచితం, ఇతరులకు 90 శాతం ఉచితంగా డ్రిప్ ఏర్పాటుచేసుకోవచ్చు. అలాగే డ్రిఫ్ పైపులైన్ తీయడానికి కూడా ఉపాధిహమీ ద్వారా ఎకరానికి 5 వేల వరకు ఉపాధి హామీ ద్వారా చెల్లించడం జరుగుతుంది. అలాగే అంతరసేద్యంలో భాగంగా పొలం దున్నడం, అంతర పంటలసాగుకోసం కూడా డబ్బులు చెల్లిస్తుంది.
డ్రిప్ సౌకర్యం లేనట్లయితే..
మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి ఏడాదికి 40 సార్లు మొక్కకు 10 లీటర్ల చొప్పున నీళ్లు పోసుకేందుకోసం ప్రభుత్వం ఎకరానికి 11620 చెల్లిస్తుంది. ఇలా మూడేళ్లపాటు నీళ్లు పోయడానికి డబ్బులు అందించడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాలు అందించడానికి ఒక్కో మొక్కకు 25ల చొప్పున ఎకరానికి 1750, మూడేళ్లపాటు అందిస్తుంది.
సస్యరక్షణ చర్యలో భాగంగా గుంతల్లోని మట్టిని తిప్పేయడం, ఎరువులు, పిచికారి మందులకోసం ఏడాదికి 12600 చొప్పున మూడే ళ్లపాటు అందజేయడం జరుగుతుంది. ఇలా తోటల పెంపకం ప్రోత్సహించాలని ప్రభుత్వం ఎకరానికి దాదాపు 10 లక్షల వరకు ఉచితంగా అందిస్తుంది. తోటలు పెరిగి పండ్లనిచ్చాక రైతు స్వేచ్ఛగా విక్రయించుకొని లాభాలు పొందవచ్చు.
‘ఉపాధి’లో తోటల పెంపకం
Published Mon, Sep 29 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement