HPCL Visakha Refinery cooling tower
-
23కు పెరిగిన హెచ్‌పీసీఎల్ మృతుల సంఖ్య
హెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురు ఈరోజు మృతి చెందారు. ఆగస్టు 23న విశాఖ హెచ్‌పీసీఎల్ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. కూలింగ్ టవర్‌లోకి గ్యాస్ లీకేజీ వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులు తర్వాత వెల్లడించారు. కూలింగ్ టవర్‌కు వెళ్లే పైపుల్లోకి గ్యాస్ (హైడ్రో కార్బన్, మీథేన్, ఈథేన్, ప్రొఫేన్) లీకేజీ కావడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చినట్లు చెప్పారు. గ్యాస్ భారీ స్థాయిలో రావడంతో అలారం పనిచేయలేదన్నారు. దీనిపై విచారణ జరపనున్నట్టు తెలిపారు. 2009లో నిర్మించిన రెండో కూలింగ్ టవర్‌ను యూరో-4 నాణ్యతాప్రమాణాల మేరకు ఆధునీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. దుర్ఘటన సమయంలో కూలింగ్ టవర్ వద్ద సుమారు వంద మంది పనిచేస్తున్నారని చెప్పారు. పనులు పూర్తయిన టవర్‌లో నిర్వహించిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంప ముంచాయని వారు చెబుతున్నారు. హైడ్రాలిక్ టెస్ట్ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్‌పైన వెల్డింగ్ పనులు కూడా ప్రమాదానికి దోహదం చేశాయి. -
హెచ్పీసీఎల్లో కొనసాగుతున్న బంద్
విశాఖ : విశాఖ హెచ్పీసీఎల్లో సోమవారం కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. అగ్ని ప్రమాదంలో గల్లంతు అయిన వారి వివరాలను హెచ్‌పీసీఎల్ యాజమాన్యం ఇప్పటివరకూ స్పష్టంగా ప్రకటించలేదు. మృతుల సంఖ్యను కూడా అధికారులు స్పష్టంగా వెల్లడించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హెచ్పీసీఎల్లో కూలింగ్ టవర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ నిన్న కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా సంఘటన స్థలం వద్ద ఐదు సంప్పుల్లో ఉన్న వ్యర్థాలను క్రేన్, కాంట్రాక్ట్ కార్మికుల సాయంతో తొలగించారు. శుక్రవారం రాత్రి నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. శనివారం తొలగింపు కార్యక్రమంలో భాగంగా సుమారు ఐదు మృతదేహాలను వెలికితీయగా, ఆదివారం తొలగింపులో మరో రెండు మృతదేహాలను గుర్తించినట్టు సమాచారం. అయితే దీనిని సంస్థ యాజమాన్యం నిర్థారించడం లేదు. అటువంటిదేమి లేదని శనివారంతోనే శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలగించినట్టు వివరించారు. ఆదివారం తొలగింపు చేపట్టిన కార్యక్రమంలో ఎటువంటి మృతదేహాలు లభ్యం కాలేదని, కేవలం సంప్‌లో ఉన్న వ్యర్థాలను తొలగించామన్నారు. నేడు కూడా తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశముంది.