hukum singh
-
అంతుచిక్కని మిస్టరీగా రాజా హుకుం సింగ్ హత్య
జోద్పూర్ పరిసర ప్రాంతాలన్నీ ఉదయాన్నే తెలిసిన ఆ వార్తతో ఉలిక్కపడ్డాయి. 1984 ఏప్రిల్ 17న అర్ధరాత్రి వేళ జరిగింది ఆ సంఘటన. రావు రాజా హుకుం సింగ్ అలియాస్ టుటు బనాను ఎవరో చంపేశారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన జరిగిన రాజ్‌పుత్ రెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. హత్య జరిగి కొన్ని గంటలు గడిచిపోవడంతో అప్పటికే హుకుం సింగ్ శరీరం చల్లబడిపోయింది. విచిత్రంగా ఇద్దరు నిందితులు హుకుం సింగ్ మృతదేహం పక్కనే పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నిందితుల్లో మరో ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. మృతదేహం పక్కనే నెత్తుటి మరకల కత్తి పడి ఉంది. అది హుకుం సింగ్‌దే! హుకుం సింగ్ శరీరంపై ఇరవైకి పైగా కత్తి వేట్లు ఉన్నాయి.జోద్పూర్ రాజవంశానికి చెందిన రావు రాజా హుకుం సింగ్ హత్యపై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.హుకుం సింగ్ జోద్పూర్ మహారాజా గజ్ సింగ్‌కు సవతి సోదరుడు, జోద్పూర్ మాజీ పాలకుడు మహారాజా హనువంత్ సింగ్, జుబేదా బేగంల కుమారుడు. హనువంత్ సింగ్, జుబేదా బేగం దంపతులు 1952లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి హుకుమ్ సింగ్ వయసు ఏడాది మాత్రమే! సవతి తల్లి కృష్ణకుమారి ఆలన పాలనలో పెరిగాడు. తండ్రి హనువంత్ సింగ్ మరణం తర్వాత హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్ పట్టాభిషిక్తుడయ్యాడు.అతి గారాబం వల్ల హుకుం సింగ్ అల్లరి చిల్లరిగా, దురుసుగా తయారయ్యాడు. రాచప్రాసాద మర్యాదలను పెద్దగా పట్టించుకోకుండా, ఊళ్లోని ఆకతాయి యువకులతో కలసి విచ్చలవిడిగా తిరిగేవాడు. తాగుడుకు అలవాటుపడి, జనాలతో తరచు తగవులు పెట్టుకునేవాడు. ఒక సందర్భంలో తనను నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులనే తుపాకి గురిపెట్టి బెదిరించాడు. తుపాకితో బెదిరించినందుకు పోలీసులు హుకుం సింగ్‌పై హత్యాయత్నం అభియోగం మోపుతూ కేసు పెట్టారు. హైకోర్టు ఆ కేసును కొట్టేసి, బెదిరింపు కేసు కింద విచారణ చేపట్టింది. ఇలాంటి దుందుడుకు స్వభావం ఉన్న హుకుం సింగ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. జోద్పూర్ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగాడు. అకస్మాత్తుగా అతడు హత్యకు గురవడంతో జోద్‌పూర్‌లో కలకలం రేగింది.మొదటగా రంగంలోకి దిగి, దర్యాప్తు చేసిన జోద్పూర్ పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు. నలుగురు నిందితులను అరెస్టు చేసినా, అసలు దోషులను నిరూపించలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత జోద్పూర్ ఎస్పీ శంతను కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. అతను చెప్పిన ప్రకారం– హుకుం సింగ్‌కు నేరప్రవృత్తి ఉంది. పర్యాటక శాఖ ఉపమంత్రి నరేంద్రసింగ్ భాటితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, కొద్దిరోజులగా ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. హత్య జరిగిన రోజు సాయంత్రం హుకుం సింగ్ సమీపంలోని బస్తీలో జరిగిన డ్యాన్స్ కార్యక్రమం చూసి, రాత్రి రెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. అందరూ మందు పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో తనతో ఉన్నవాళ్లతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే హత్యకు గురయ్యాడు. హత్య జరిగాక మృతదేహం వద్ద వేచి చూస్తున్న ఇద్దరినీ, అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారే దోషులని నిరూపించలేకపోయారు. హుకుం సింగ్ హత్య కాంగ్రెస్ జాతీయ పార్టీలోనూ అలజడి రేపింది. హత్య వెనుక మంత్రి భాటి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భాటి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘హత్యకు కొద్దిరోజుల ముందు హుకుం సింగ్ జైపూర్ సర్క్యూట్‌హౌస్‌లో గొడవ పడ్డాడు. సంఘటనా స్థలానికి వచ్చిన విధాయక్పురి పోలీసులు అతణ్ణి కొట్టారు. హత్యాయత్నం కేసులో దిగువకోర్టు శిక్ష విధిస్తే, నాలుగు నెలలు జైల్లో గడిపి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. తరచు తగవులు పెట్టుకునే హుకుం సింగ్‌కు చాలామంది శత్రువులు ఉంటారు’ అని భాటి చెప్పారు. ఈ సంఘటనలో హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్‌పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఇద్దరికీ పొరపొచ్చాలు ఉన్న మాట నిజమే అయినా, హత్యలో గజ్ సింగ్ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.అయితే, జోద్పూర్ కాంగ్రెస్ నేతలు భాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మూపనార్‌కు ఫిర్యాదు చేశారు. మూపనార్ దీనిపై భాటిని ప్రశ్నించారు. హుకుం సింగ్ ఢిల్లీలో తన పరువుతీసే పనులు చేస్తున్నాడని, తన ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడని, అయితే అతడి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హుకుం సింగ్ హత్యలో రాజకీయ నాయకులెవరి ప్రమేయమూ లేదని రాజస్థాన్ ఐజీ జీసీ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే రాజస్థాన్ పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐ చేతికి మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు సీబీఐ ఈ కేసులో గుమన్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. విచిత్రంగా విచారణకు ముందే అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ఈ కేసు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. -
ఒకే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నంబర్
భిండ్: ఒకే పేరున్న ఇద్దరికి ఒకే ఖాతా నంబర్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వాకమిది. ఆ ఇద్దరిలో ఒకరు డబ్బులు డిపాజిట్ చేస్తుండగా, మరొకరు వాటిని విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. చివరికి విషయం కనుక్కొని ప్రశ్నించగా.. ‘మోదీజీ(ప్రధాని మోదీ)నే నా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడనుకున్నా’అని విత్ డ్రా చేసుకున్న వ్యక్తి జవాబివ్వడంతో బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హుకుమ్ సింగ్ అనే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్‌ను ఎస్బీఐ ఆలంపూర్ బ్రాంచ్ కేటాయించింది. రురాయి గ్రామానికి చెందిన హుకుంసింగ్.. స్థలం కొనుక్కునేందుకు డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా అకౌంట్లో డబ్బులు వేసేవాడు. వాటిని రవుని గ్రామానికి చెందిన హుకుంసింగ్ విత్ డ్రా చేసుకుని వాడుకునేవాడు. అలా దాదాపు రూ. 89 వేల రూపాయలను విత్ డ్రా చేసుకున్నాడు. డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకుందామని బ్యాంక్‌కు వెళ్లిన హుకుంసింగ్‌కు తన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు విత్ డ్రా అయిన విషయం తెలిసింది. మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై విత్ డ్రా చేసిన హుకుంసింగ్‌ను ప్రశ్నిస్తే.. ‘మోదీజీ ఇస్తున్నాడనుకున్నా. అందుకే వాడుకున్నా’అని జవాబిచ్చాడు. -
‘అవును.. అందుకే నాకు టికెట్ ఇవ్వలేదు’
లక్నో : తనకు లోక్‌సభ టికెట్ రాకపోవడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని బీజేపీ దివంగత ఎంపీ హకుం సింగ్ తనయ మ్రిగాంకా సింగ్ ఆరోపించారు. బీజేపీ నినాదం బేటీ బచావో.. బేటీ పడావోను ఉటంకిస్తూ.. ‘ నన్ను ఎన్నికల బరిలో నిలవకుండా చేసేందుకు కొంతమంది కుట్ర పన్నారు. బేటీ హఠావో.. అస్థిత్వ మిటావో (కూతుళ్లను తొలగించండి.. వారి వారసత్వాన్ని పూర్తిగా తుడిచేయండి) అనే నినాదంతో సదరు వ్యక్తులు ముందుసాగుతున్నారు’ అని బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా 2018లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ హుకుం సింగ్ మరణించడంతో యూపీలోని కైరానా నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మ్రిగాంక సింగ్‌ను బీజేపీ ఎన్నికల బరిలో దింపగా ఆమె ఓడిపోయారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆరెల్డీ) అభ్యర్థి తబస్సుం బేగం చేతిలో పరాజయం చవిచూశారు. ఈ క్రమంలో కైరానాతో పాటు గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికల్లో ఓటమి చెందడంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మ్రిగాంకను కాదని.. 2019 ఎన్నికల్లో కైరానా నుంచి ప్రదీప్ చౌదరికి బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో మ్రిగాంక మంగళవారం మాట్లాడుతూ... ‘ అవును నాకు టికెట్ రాలేదు. 2018 ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి నాకు మరోసారి అవకాశం ఇస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నా తండ్రి 45 ఏళ్లుగా కైరానాలో చురుగ్గా పనిచేశారు. కానీ నేను అలాచేయలేకపోయానని బాధ పడుతున్నా. నాకు టికెట్ రావడం వెనుక కొంతమంది ప్రమేయం ఉంది అని వ్యాఖ్యానించారు. -
భూసర్వేకు కేంద్ర సాయం
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి హుకుమ్‌సింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేకు కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి (భూ వనరులు) హుకుమ్‌సింగ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమం అత్యంత విప్లవాత్మకమైనదని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ఆయన తన బృంద సభ్యులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన సమగ్ర భూసర్వేపై చర్చ జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్ తొలుత మాట్లాడుతూ 1932–36 మధ్య కాలంలో జరిగిన సర్వే ఆధారంగా భూవివరాలు సరిగా లేకపోవడం వల్ల వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతీ ఎకరానికి ఏడాదికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి అందించే కార్యక్రమం ప్రారంభించిందని, ఈ పథకం సక్రమ అమలుకుగాను ఏ భూమి ఎవరి అధీనంలో ఉందో తెలుసుకునేందుకే సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు. భూ సర్వే కార్యక్రమానికి కేంద్ర సహకారం కావాలని ఆయన కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి పంపుతామని కేసీఆర్ చెప్పారు. అనంతరం హుకుమ్‌సింగ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి భూ సర్వే నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి భూ వనరు ల విభాగం టెక్నికల్ డైరెక్టర్లు గౌతమ్ పొత్రు, దినేశ్ కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
'కైరానాలో హిందూ వలసలు అందుకే'
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో మస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందువుల వలసలు కొనసాగుతుండటం పట్ల సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నివేదికలో సైతం ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ప్రాంతంలో హిందూ వలసలు కొనసాగుతున్నాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో హిందువులపై కొనసాగుతున్న దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవడం మూలంగానే వలసలు కొనసాగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ సమాజ్‌వాదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుమారు 300 కుటుంబాలు భయాందోళనలతో కైరానాను విడిచి వెళ్లాయని హుకుమ్ సింగ్ తెలిపారు. తాను ఎప్పటి నుంచో చెబుతున్న విషయం మానవహక్కుల నివేదికతో తేటతెల్లమైందని అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేరగాళ్లకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని అందువల్లనే ప్రజలు భయంతో వలసలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించి ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల అనంతరం ఆ ప్రాంతంలో సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయని మానవహక్కుల నివేదిక వెల్లడించింది.