'కైరానాలో హిందూ వలసలు అందుకే'
మీరట్: ఉత్తరప్రదేశ్లో మస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందువుల వలసలు కొనసాగుతుండటం పట్ల సమాజ్వాదీ పార్టీపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నివేదికలో సైతం ఉత్తరప్రదేశ్లోని కైరానా ప్రాంతంలో హిందూ వలసలు కొనసాగుతున్నాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో హిందువులపై కొనసాగుతున్న దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవడం మూలంగానే వలసలు కొనసాగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ సమాజ్వాదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సుమారు 300 కుటుంబాలు భయాందోళనలతో కైరానాను విడిచి వెళ్లాయని హుకుమ్ సింగ్ తెలిపారు. తాను ఎప్పటి నుంచో చెబుతున్న విషయం మానవహక్కుల నివేదికతో తేటతెల్లమైందని అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేరగాళ్లకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని అందువల్లనే ప్రజలు భయంతో వలసలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించి ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల అనంతరం ఆ ప్రాంతంలో సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయని మానవహక్కుల నివేదిక వెల్లడించింది.