రూ.4 కోట్ల ప్రభుత్వ భూమిపై సాదత్ కన్ను
పోలీసుల విచారణలో వెలుగులోకి..
కుత్బుల్లాపూర్: హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎస్ఏ) పేరుతో అక్రమాలకు పా ల్పడిన మహ్మద్ సాదత్ అహ్మద్‌ను ఇటీవల జీడిమెట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకొని భూదందాలకు పాల్పడ్డన్న ఆరోపణలపై విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుమారు రూ.4 కోట్ల విలువ చేసే 4 వేల గజాల స్థలానికి ఎసరు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ స్థల విషయమై అప్పట్లో మండల డిప్యూటీ కలెక్టర్‌ను సైతం హ్యుమన్‌రైట్స్, యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ పేర్లతో సాదత్ బెదిరించాడన్న విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. 200 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి తన భార్య పేరుపై కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి పక్కనే ఉన్న 4వేల గజాల ప్రభుత్వ స్థలంపై కన్నేశాడు. ఈ తతంగానికి సాదత్ సాయం అందించడంతో అప్పట్లో అతని వెంట తిరిగి దూరమైన కొంత మంది ఎదురు తిరిగి మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి స్థలం కబ్జా కాకుండా చూశారు.
అప్పటి నుంచి వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలం తనదే అంటూ తన అనుచరులతో సాదత్ పలుమార్లు అక్కడికి వెళ్లి హల్చల్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నగరంలోని బేగంపేటకు చెందిన ఓ వ్యక్తి ఇందులో కీలక పాత్ర వహించగా అతనికి సాదత్ బాసటగా నిలిచాడని సమాచారం. మూడు రోజుల కస్టడీలో సాదత్ తాను ఎవరెవరిని ఏ విధంగా మోసగించిన విధానంతో పాటు అక్రమంగా పొందిన పట్టాల గురించి వివరించినట్టు తెలిసింది.