hundred note
-
కొత్త రూ. 100 నోట్లు వచ్చాయోచ్..
విశాఖపట్నం, పరవాడ(పెందుర్తి): రిజర్వు బ్యాంకు ఈనెల 1 న మార్కెట్లోకి విడుదల చేసిన రూ.100 నోట్లను పరవాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధర్ సేకరించారు. ఈ నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణికి వావ్’ ముద్రించి ఉంది. లావెండర్ కలర్లో ముద్రించిన కొత్త వంద నోటు 142 మిల్లిమీటర్ల పొడవు, 66 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ, అశోకుడి నాలుగు సింహాలు, 100 సంఖ్య వాటర్ మార్కు ఉన్నాయి. నోటు వెనుక భాగంలో స్వచ్ఛభారత్ లోగో నినాదం ఉంది. పాత వంద నోట్లతో పాటు కొత్త నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. -
ఏటీఎంలో కలర్ జెరాక్స్ వంద నోటు
పాలకొండ రూరల్: సామాన్య మనుషులనే కాదు... బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన యంత్రాలకు సైతం జల్లకొట్టగల ఉద్దండులు తయారయ్యారు. గతంలో ఏటీఎంల ద్వారా దొంగనోట్లు వచ్చిన దాఖలాలు ఎక్కువగా ఉండేవి. తాజాగా సోమవారం పాలకొండ పట్టణంలో ఆర్సీఎం స్కూల్ ఎదురుగా ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో కలర్ జెరాక్స్ వందనోటు వచ్చింది. పట్టణానికి చెందిన ఉదయాన దిలీప్‌కుమార్ 12 గంటల సమయంలో ఏటీఎం నుంచి రూ.1500 విత్‌డ్రా చేయగా, అందులో ఒక వందనోటు ప్రత్యేకంగా కనిపించింది. దీన్ని పరీక్షించగా కలర్ జెరాక్స్ తీసిన వందనోటుగా తేలింది. ఈ విషయమై సీతంపేటలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్‌ద్వారా సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఏటీఎంలో నగదు నింపే విషయం తమ పరిధిలో ఉండదని, థర్డ్‌పార్టీ వ్యక్తులు కాంట్రాక్ట్ విధానంతో ఏటీఎంలో నగదు ఉంచుతారని బ్యాంకు ప్రతినిధి పేర్కొవడంతో దిలీప్ కుమార్ తెల్లముఖం వేశారు.