ఐటీ పంజా
♦ కాళీశ్వరీ రిఫైనరీపై ఐటీ దాడులు
♦ 54 చోట్ల ఏకకాలంలో తనిఖీలు
♦ గోల్డ్‌విన్నర్ ఆయిల్ అమ్మకాలపై ఆరా
ప్రముఖ ప్రయివేటు వంటనూనెల తయారీ సంస్థ కాళీశ్వరీ రిఫైనరీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులకు దిగారు. చెన్నై, వేలూరు, దిండుగల్లు, మధురై, ముంబయి, బెంగళూరు తదితర 54 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: గోల్డ్ విన్నర్ వంటనూనె, ఎల్డియా కొబ్బరినూనె తదితర అనేక నిత్యావసర వస్తువుల ప్రముఖ ప్రయివేటు తయారీ సంస్థ కాళీశ్వరీ రిఫైనరీ. ఈ సంస్థ యజమాని మునుస్వామి చెన్నై మైలాపూర్‌లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ శాఖలు విళుపురం, మధురై, దిండుగల్లు, వేలూరు, చిదంబరం, తిరుప్పూరు, తూత్తుకూడి, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుచ్చిరాపల్లి తదితర ప్రాంతాల్లోనూ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరీ, ఒడిస్సా, మహారాష్ట్రలోనూ ఉన్నాయి.
అంతేగాక సింగపూర్, మలేషియా, కువైట్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక దేశాలకు కూడా విస్తరించి ఉన్నాయి. సదరు కాళీశ్వరీ రిఫైనరీ గత కొంతకాలంగా ఆదాయపుపన్ను సక్రమంగా చెల్లించడం లేదని గుర్తించారు. సుమారు వంద మంది ఐటీ అధికారులు సంస్థ యజమాని మునుస్వామి ఇల్లు, కార్యాలయం, గిడ్డంగిలపై బుధవారం ఉదయం 6–7 గంటల మధ్య ఒక్కసారిగా దాడులు చేపట్టారు. తమిళనాడులో 46 చోట్ల (చెన్నైలో 32 ప్రాంతాల్లో) తనిఖీలు ప్రారంభించారు. దాడులకు అడ్డుపడకుండా ముందు జాగ్రత్తగా సీఆర్పీఎఫ్ దళాలను బందోబస్తుగా పెట్టుకున్నారు.
చెన్నై మైలాపూరు ఆర్కే రోడ్డు రాజశేఖరన్ వీధిలో పార్క్ చేసి ఉన్న రెండు వాహనాలను కూడా సోదా చేశారు. చెన్నై వన్నార్పేటలో కాళీశ్వరి రిఫైనరీ సంస్థకు చెందిన జ్యూయలరీలోనూ, పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. అలాగే కాళీశ్వరి ఆయిల్ సంస్థ ఉత్పత్తుల ఈరోడ్ జిల్లా హోల్‌సేల్ ఏజెంట్ రమేష్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు, కార్యాలయం, లాడ్జీలలో 15 మంది అధికారులు సోదాలు చేశారు. పళని సమీపంలోని ఉడుమలైపేట జాతీయ రహదారిలోని పిరపత్తూరులో ఈ సంస్థకు సొంతమైన ఆయిల్ కంపెనీలో గోల్డ్‌విన్నర్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కంపెనీలో సైతం ఉదయం 6 గంటలకు ఐటీ అధికారులు ప్రవేశించి తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో అక్కడి ఉద్యోగులను సైతం లోనికి అనుమతించలేదు. తూత్తుకూడి బైపాస్‌రోడ్డులోని గిడ్డంగిలో సోదాలు చేశారు. దాడులు జరిపిన ప్రాంతాల్లో ముందుగా టెలిఫోన్ కనెక్షన్లను తొలగించి, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులు చేసేపుడు బందోబస్తు నిమిత్తం రాష్ట్ర పోలీసులను తీసుకు వెళ్లడం ఆనవాయితీ. అయితే గత ఏడాది నుంచి జరుగుతున్న ఐటీ దాడులకు కేంద్ర బలగాలను వెంటపెట్టుకునే సంప్రదాయాన్ని పాటిస్తుండడం గమనార్హం.