ఆఫ్రికాలో ఇబోలా వైరస్వ్యాప్తిపై ఒబామా ఆందోళన
వాషింగ్టన్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఇబోలా వైరస్ వ్యాప్తిచెందుతుండటంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగినందున తాము ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే వారం తమ దేశంలో జరగనున్న ఆఫ్రికా-అమెరికా సదస్సులో పాల్గొనేందుకు 50 దేశాల ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా దేశాల ప్రతినిధులు స్వదేశాల నుంచి బయలుదేరే ముందు ఒకసారి, అమెరికాకు చేరుకున్నాక మరోసారి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.మరోవైపు పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ బారినపడిన తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను స్వదేశానికి రప్పించి చికిత్స అందించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది.
ఆ అనుమానితులను హింసించడం నిజమే
సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల తర్వాత కొందరు అనుమానితులను విచారణ సందర్భంగా సీఐఏ హింసించినమాట నిజమేనని ఒబామా అంగీకరించారు. 9/11 దాడి తర్వాత అదుపులోకి తీసుకున్న అనుమానిత మిలిటెంట్లను హింసించడానికి ఎలాంటి పద్ధతులు వాడారన్న అంశంపై తమ ప్రభుత్వం త్వరలో ఒక నివేదికను విడుదల చేయనుందని ఆయన చెప్పారు.