జీఎస్టీఐ డైరెక్టర్ జనరల్‌గా జాన్ జోసఫ్
ఉత్తర కొరియా ‘క్షిపణి’ ప్రయోగం విజయవంతం
అమెరికాతో సహా వివిధ దేశాలపై దాడిచేసే సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) హ్వాసాంగ్–14ను జూలై 4న విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికార వార్త సంస్థ ప్రకటించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఈ ప్రయోగం జరిగిందని; క్షిపణి 2,802 కి.మీ. ఎత్తుకు చేరుకొని, 39 నిమిషాల పాటు 933 కి.మీల దూరం ప్రయాణించి జపాన్ ఆర్థిక మండలి జలాల్లో పడినట్లు పేర్కొంది. కాగా, ఇది మధ్యశ్రేణి క్షిపణి అని, దీనివల్ల అమెరికాకు ముప్పు లేదని అమెరికా పసిఫిక్ కమాండ్ తెలిపింది. మరోవైపు ఈ క్షిపణి 2,500 కి.మీ ఎత్తుకు చేరినట్లు జపాన్ పేర్కొంది. అయితే, ఇది ఖండాంతర క్షిపణేనని, దీని గరిష్ట పరిధి 6,000 కి.మీ. పైనే ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం.
అమెరికా, దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా దక్షిణ కొరియా జలాల్లో క్షిపణి ప్రయోగాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా జూలై 4న దక్షిణ కొరియాకు చెందిన హున్మూ–2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా వెల్లడించింది. ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షకు ప్రతిగా దీన్ని నిర్వహించినట్లు అమెరికా తెలిపింది.
అణ్వస్త్ర నిషేధ ఒప్పందానికి ఆమోదం
అణ్వస్త్రాలను నిషేధించే అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్యసమితిలో ఆమోదం లభించింది. జూలై 7న ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చ, ఓటింగ్‌లో నిషేధానికి అనుకూలంగా 122 దేశాలు ఓటు వేశాయి. నెదర్లాండ్స్ వ్యతిరేకంగా ఓటు వేసింది.
ఈ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాల అభివృద్ధి, నిల్వ, వాటిని ప్రయోగిస్తామని బెదిరించడంపై నిషేధం ఉంటుంది. అణ్వాయుధాలున్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్, జపాన్ ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
హాంబర్గ్‌లో జి–20 సదస్సు
జర్మనీలోని హాంబర్గ్‌లో జూలై 7,8 తేదీల్లో రెండ్రోజులపాటు జి–20 దేశాల సదస్సు జరిగింది. ఉగ్రవాదం అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఉమ్మడి పోరాటం చేయాలని సదస్సు తీర్మానించింది. అలాగే వాణిజ్య రంగంలో రక్షణాత్మక ధోరణులను వ్యతిరేకించడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పనలో సమానత్వానికి కృషి, అన్ని రంగాల్లో అవినీతిపై పోరాటం చేయాలని సదస్సులో నేతలు నిర్ణయించారు. 2019 నాటికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్కరణలను పూర్తిచేయాలని ప్రతిపాదించారు. సమాచార, కమ్యూనికేషన్ వ్యవస్థల దుర్వినియోగంతో ఆర్థిక సుస్థిరతకు ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో 19 దేశాల అధినేతలతోపాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపు
జపాన్‌లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.
అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
వార్తల్లో వ్యక్తులు
జీఎస్టీఐ డైరెక్టర్ జనరల్‌గా జాన్ జోసఫ్
జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా జాన్ జోసెఫ్ జూలై 9న నియమితులయ్యారు. ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1983 బ్యాచ్ అధికారి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీఐగా మారింది.
వైవీ రెడ్డి పుస్తకం ‘అడ్వైజ్ అండ్ డిసెంట్’ ఆవిష్కరణ
రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి రాసిన ‘అడ్వైజ్ అండ్ డిసెంట్: మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్’ పుస్తకాన్ని జూలై 6న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఆర్థిక విధానాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
కామన్వెల్త్ చెస్ చాంపియన్‌గా అభిజిత్ గుప్తా
న్యూఢిల్లీలో జూలై 10న ముగిసిన కామన్వెల్త్ చెస్ చాంపియన్ టైటిల్‌ను అభిజిత్ గుప్తా గెలుచుకున్నారు. రెండు, మూడు స్థానాల్లో వైభవ్ సూరి, తేజస్ బాక్రే నిలిచారు.
క్రీడలు
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రథమ స్థానం
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జూలై 9న ముగిసిన 22వ ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. భారత్‌కు మొత్తం 29 పతకాలు లభించాయి. ఇందులో 12 స్వర్ణ, 5 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. 8 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలతో చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. 40కి పైగా దేశాలకు చెందిన 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లోని వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్నారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ భారత్ కైవసం
వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. జూలై 6న జరిగిన చివరిదైన ఐదో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. ఒక వన్డే వర్షం కారణంగా రద్దయింది.
ఆసియా స్నూకర్ చాంపియన్‌గా భారత్
ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌గా భారత్ నిలిచింది. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్లో జూలై 5న పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది.
జాతీయం
మదర్ థెరిస్సా చీరకు మేధో హక్కు
మదర్ థెరిస్సా ధరించిన నీలి అంచు తెల్లచీరకు మేధో హక్కు లభించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్‌కు ఈ హక్కు దక్కింది. కేంద్ర ప్రభుత్వ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీలో ఈ గుర్తింపును జారీ చేసినట్లు జూలై 9న ఛారిటీస్ తెలిపింది. చీర ట్రేడ్ మార్క్ ధ్రువీకరణకు 2013 డిసెంబర్ 12న దరఖాస్తు చేసినట్లు పేర్కొంది.
వివాహాల తప్పనిసరి నమోదుకు లా కమిషన్ సిఫారసు
వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను జూలై 4న సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. వివాహాల నమోదుకు అందరికీ వర్తించేలా ఒక సంస్థ ఏర్పాటుచేయాలని పేర్కొంది. దీంతో
ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పిచడంతోపాటు మరిన్ని కొత్త హక్కులు లభిస్తాయని పేర్కొంది. ఏ సంప్రదాయం, వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) ప్రకారం వివాహాలు జరిగినా నమోదు తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న జనన, మరణ నమోదు చట్టం–1969 కింద ఈ అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సూచించింది. జనన, మరణాల నమోదుకు బాధ్యులుగా ఉన్నవారికే ఈ బాధ్యతా అప్పగించాలని పేర్కొంది. సరైన కారణం లేకుండా వివాహ నమోదులో జాప్యం చేస్తే రోజుకు రూ.5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, నమోదును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది.
వివాహాల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు, ఇతరత్ర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో భార్య పేరు రాయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రం జతచేయడాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. వివాహం ఏ దేశ చట్ట ప్రకారం జరిగినా భార్యాభర్తల్లో కనీసం ఒకరు భారతీయులైతే వారి వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నివేదించింది.
ఇజ్రాయెల్‌తో భారత్ ఏడు ఒప్పందాలు
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. జూలై 5న ఇరు దేశాల ప్రధానులు మోదీ, బెంజిమన్ నెతన్యాహు సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక, వ్యవసాయ, నీటి పరిరక్షణ రంగాలపై కుదిరిన ఈ ఒప్పందాల విలువ సుమారు రూ.32,500 కోట్లు ఉంటుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోపాటు ఆ దేశ అధ్యక్షుడు రువెన్ రివ్లిన్తోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో అనేక ద్వైపాక్షిక అంశాలతోపాటు ఉగ్రవాదంపై చర్చించారు. తీవ్రవాదంపై కలసికట్టుగా పోరాటం చేయాలని, ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిం చాలని రెండు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇజ్రాయెల్ సీఈవోల సదస్సులోనూ మోదీ పాల్గొన్నారు. భారత్ ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
అహ్మదాబాద్‌కు యునెస్కో వారసత్వ గుర్తింపు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తింపు లభించింది. భారత్‌లో ఈ గౌరవం దక్కిన తొలి నగరం ఇదే. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరానికి వారసత్వ హోదా ప్రకటిస్తూ జూలై 8న పోలెండ్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ సంఘం సమావేశంలో నిర్ణయించారు. దీంతో పారిస్, వియన్నా, కైరో, బ్రస్సెల్స్, రోమ్, ఎడిన్‌బరో తదితర ప్రపంచ వారసత్వ నగరాల సరసన అహ్మదాబాద్ చేరింది. ఈ హోదాకు ఢిల్లీ, ముంబై కూడా పోటీ పడ్డాయి.
అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రపై జూలై 10న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. గుజరాత్‌కు చెందిన యాత్రికుల బృందం అమర్నాథ్ యాత్ర ముగించుకొని బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.