సియోల్: ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగ పరంపర గురువారమూ కొనసాగింది. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) సహా కనీసం ఆరుక్షిపణులను ప్రయోగించింది. తాజా పరిణామంతో జపాన్ ఉలిక్కిపడింది. రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి గురువారం ఉదయం 7.40 గంటలకు ఒక ఐసీబీఎంను, ఒక గంట తర్వాత అక్కడికి సమీపంలోని కచియోన్ నుంచి రెండు తక్కువ శ్రేణి మిస్సైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్లు దక్షిణకొరియా సైన్యం ధ్రువీకరించింది.
పొరుగు దేశాల భూభాగాల్లోకి ప్రవేశించకుండా నివారించేందుకు ఐసీబీఎంను ఎత్తులో ప్రయోగించి ఉండవచ్చని తెలిపింది. ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని జపాన్ పేర్కొంది. తమ గగనతలం మీదుగా మాత్రం వెళ్లలేదని తెలిపింది. ఈ ప్రయోగంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ..అండర్‌గ్రౌండ్ లేదా పటిష్టమైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలంటూ మియాగి, యమగట, నిగట ప్రిఫెక్చర్ల ప్రజలను కోరింది. ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం క్షిపణి ప్రయోగాలపై ఉత్తరకొరియా ఒక ప్రకటన చేసింది. దక్షిణకొరియా, అమెరికాలు సైనిక విన్యాసాలను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. తర్వాత మరో 3 క్షిపణుల్ని ప్రయోగించింది.
Comments
Please login to add a commentAdd a comment