చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్‌రేట్) అజేయంగా నిలిచాడు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు.
ఆతర్వాత పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్‌లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్‌బన్సీ (10-0-27-1), సోమ్‌పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.