ice hockey
-
విషాదం: ఊహించని రీతిలో మృత్యువు ఒడికి..
ఆ యువ ఆటగాడి జీవితాన్ని విధి విచిత్రంగా కాటేసింది. సంబురంగా గడుపుతున్న టైంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో అతను తీవ్రంగా గాయపడగా.. కొన ఊపిరితో మూడుగంటలు పోరాడి మరీ ప్రాణం విడిచాడు. మాటిస్ కివ్‌లెనిక్స్(24)..లాత్వియాకు చెందిన ఐస్ హకీ ఆటగాడు. నేషనల్ హాకీ లీగ్‌లో కొలంబస్ బ్లూ జాకెట్స్ తరపున గోల్టెండర్(గోల్‌ను అడ్డుకునే క్రీడాకారుడు)గా అతనికి మాంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. తొమిదేళ్ల కెరీర్లో జట్టుకు మంచి సేవలు అందించాడు. అలాంటి టాలెంటెడ్ ఆటగాడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం రాత్రి బ్లూ జాకెట్స్ కోచ్ మెన్సీ లెగస్ ఇంట్లో(మిషిగాన్)లో పార్టీ జరిగింది. పటాకుల్ని పేల్చి సంబురాలు చేసుకుంది టీం. ఆ టైంలో కివ్‌లెనిక్స్ సహా ఆటగాళ్లంతా హాట్ టబ్‌లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే పటాకులు ఒక్కసారిగా ఆటగాళ్ల వైపు దూసుకొచ్చాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అంతా తలోదిక్కు పరిగెత్తారు. అయితే కాలు జారి బాత్ టబ్‌లో పడిన కివ్‌లెనిక్స్.. గాయపడ్డ విషయాన్ని తోటి టీం మేట్స్ గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత బాత్ టబ్‌లో పడిపోవడంతో అతని తలకు గాయమై చనిపోయి ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే దూసుకొచ్చిన ఫైర్వర్క్స్ మోటర్ బలంగా ఛాతిని ఢీకొట్టడంతో.. అంతర్గతంగా గాయాలై చనిపోయాడని శవపరీక్షలో తేలింది. కాగా, ఈ యువ ఆటగాడి దుర్మరణంపై క్లబ్‌తో పాటు నేషనల్ హాకీ లీగ్ సంతాపం వ్యక్తం చేసింది. కివ్‌లెనిక్స్ లాత్వియా తరపున పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మే-జూన్‌లో జరిగిన ప్రపంచ టోర్నమెంట్లో కెనెడాపై లాత్వియా తొలి విజయానికి కివ్‌లెనిక్స్ షూట్ అవుట్ కారణం కావడం విశేషం. -
ఘోర ప్రమాదం : 15 మంది హాకీ ఆటగాళ్ల మృతి
హంబోల్డ్ : కెనడాలో జరిగిన రోడ్డుప్రమాదం హాకీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన సస్కచెవాన్ ప్రావిన్సులో శనివారం జరిగింది. జూనియర్ ఐస్ హాకీ జట్టుతో వెళుతున్న బస్సు మార్గమధ్యంలో సెమీ ట్రైలర్ ట్రక్కును ఢీకొంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో టిస్డేల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే మృతుల్లో 24 మంది ఆటగాళ్లు. వీరి వయసు 16 నుంచి 21లోపే. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆట మధ్యలో అమ్మగా...
టొరంటో (కెనడా): అప్పటి వరకు మైదానంలో చురుగ్గా కదులుతూ ఆమె తమ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... తల్లిగా మారిన తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అయినా ఆటలో ఏమాత్రం పదును తగ్గలేదు... ఇంతలో ఆటకు చిన్న విరామం! ఆ సమయంలో ఆమెలోని అమ్మతనం బయటకు వచ్చింది. అంతే... తమ జట్టు లాకర్ రూమ్‌లోనే సహచర క్రీడాకారిణుల మధ్య తన పాపకు పాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎక్కడ ఉన్నా తల్లిగా తన బాధ్యత నిర్వహించడం తప్పు కాదంటూ ఆమె పాలు ఇస్తున్న ఫొటోపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. క్రీడా ప్రపంచంలో ఇది ఎప్పుడూ జరగని ఒక అరుదైన ఘటనగా చెప్పవచ్చు. ఆమె పేరు సేరా స్మాల్. కెనడా ఐస్ హాకీ ప్లేయర్. ప్రస్తుతం తమ జాతీయ టోర్నీలో ఆల్బర్టా రాష్ట్ర జట్టు గ్రూవ్డేల్ వైపర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎనిమిది వారాల క్రితం పాపకు జన్మనిచ్చిన సేరా, మళ్లీ ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగడం విశేషం. టోర్నీ లేని సమయంలో టీచర్‌గా పని చేసే ఆమె... చిన్నతనం నుంచే హాకీని ఇష్టపడింది. అప్పట్లో ఐస్ హాకీలో మహిళలకు అంత మంచి ప్రోత్సాహం లేకపోయినా 13 ఏళ్ల వయసులో పురుషుల జట్టుతో చేరి సేరా సాధన చేసేది. అందుకోసం ఆమె తన పోనీటెయిల్‌ను కూడా కట్ చేసుకుంది! ఆటలో ఒక వెలుగు వెలిగిన తర్వాత పెళ్లి, ప్రసవం తర్వాత తిరిగొచ్చి మళ్లీ మైదానంలో తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు కానీ మ్యాచ్ మధ్యలో ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూడలేదు. ‘నిజానికి ఈ ఫొటోను బయటపెట్టే విషయంలో నేను చాలా సంకోచించాను. అయితే మా జట్టు సభ్యులు తప్పేమీ లేదంటూ ప్రోత్సహించారు. ఒక అమ్మగా నేను చేసిన పనికి గర్వపడుతున్నాను. దీనికి అన్ని వైపుల నుంచి సానుకూల స్పందన రావడం నాకు సంతోషాన్నిచ్చింది’ అని సేరా స్మాల్ పేర్కొంది. -
మన జాతీయ జట్టు భిక్షాటన!
చదవడానికి కటవుగా అనిపించినా ఇది నిజం. క్రికెట్ కురిపించే కాసుల వేటలోపడ్డ ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు మిగతా క్రీడల్ని నిర్లక్ష్యం చేసినంత పచ్చి వాస్తవం. ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి కువైట్‌లో ఆసియా కప్ చాలెంజర్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో భారత జట్టుకూడా పాల్గొంటోంది. అయితే ఖతార్ వెళ్లేందుకుగానీ, ప్రిపరేషన్ క్యాంప్ నిర్వాహణకుగానీ క్రీడా మంత్రిత్వశాఖ ఒక్కపైసా నిధులివ్వలేదు! దీంతో ఐస్ హాకీ జట్టులోని 11 మంది ఆటగాళ్లు తమ స్థోమతకు తగ్గట్టు తలా 20 వేలు వేసుకొని రెండు లక్షల రూపాయలు పోగుచేశారు. ఖతార్ టూర్‌కు మొత్తం రూ. 12 లక్షలు ఖర్చవుతాయి. మిగతా రూ. 10 లక్షలు సేకరించేందుకు సోషల్ నెట్వర్క్ సైట్ల ద్వారా ప్రజలకు విజ్ఞాపనలు పంపారు. స్పందించిన దయార్థహృదయులు కొందరు ఓ ఐదు లక్షల రూపాయల వరకు సమకూర్చగలిగారు. ఇకా రూ.7 లక్షలు పోగైతేగానీ ఆసియా కప్‌లో ఆడలేదు మన భారత ఐస్ హాకీ జట్టు! 'చందాలు స్వీకరించడాన్ని అవమానంగా భావించట్లేదు. ఈ రోజు మేం చేస్తోన్న ప్రయత్నం భవిష్యత్‌లోనైనా ప్రభుత్వాలు, క్రికెట్‌ను మాత్రమే వెర్రిగా ప్రేమించే అభిమానుల కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నాం' అని ఓ ఐస్ హాకీ ఆటగాడు అన్నారు. ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. 1989లోనే ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ గుర్తింపు పొందింది. మొదటి నుంచి క్రీడా మంత్రిత్వశాఖ నిరాదరణకు గురైన ఈ సంస్థ.. అనేక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ తన ప్రస్థానాన్ని సాగిస్తోంది. నిధులు సమకూర్చుకోలేని సందర్భాల్లో జాతీయ జట్టును ఆయా టోర్నమెంట్లకు పంపని సందర్భాలు కూడా ఉన్నాయి.