టొరంటో (కెనడా): అప్పటి వరకు మైదానంలో చురుగ్గా కదులుతూ ఆమె తమ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... తల్లిగా మారిన తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అయినా ఆటలో ఏమాత్రం పదును తగ్గలేదు... ఇంతలో ఆటకు చిన్న విరామం! ఆ సమయంలో ఆమెలోని అమ్మతనం బయటకు వచ్చింది. అంతే... తమ జట్టు లాకర్ రూమ్‌లోనే సహచర క్రీడాకారిణుల మధ్య తన పాపకు పాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎక్కడ ఉన్నా తల్లిగా తన బాధ్యత నిర్వహించడం తప్పు కాదంటూ ఆమె పాలు ఇస్తున్న ఫొటోపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
క్రీడా ప్రపంచంలో ఇది ఎప్పుడూ జరగని ఒక అరుదైన ఘటనగా చెప్పవచ్చు. ఆమె పేరు సేరా స్మాల్. కెనడా ఐస్ హాకీ ప్లేయర్. ప్రస్తుతం తమ జాతీయ టోర్నీలో ఆల్బర్టా రాష్ట్ర జట్టు గ్రూవ్‌డేల్ వైపర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎనిమిది వారాల క్రితం పాపకు జన్మనిచ్చిన సేరా, మళ్లీ ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగడం విశేషం. టోర్నీ లేని సమయంలో టీచర్‌గా పని చేసే ఆమె... చిన్నతనం నుంచే హాకీని ఇష్టపడింది. అప్పట్లో ఐస్ హాకీలో మహిళలకు అంత మంచి ప్రోత్సాహం లేకపోయినా 13 ఏళ్ల వయసులో పురుషుల జట్టుతో చేరి సేరా సాధన చేసేది.
అందుకోసం ఆమె తన పోనీటెయిల్‌ను కూడా కట్ చేసుకుంది! ఆటలో ఒక వెలుగు వెలిగిన తర్వాత పెళ్లి, ప్రసవం తర్వాత తిరిగొచ్చి మళ్లీ మైదానంలో తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు కానీ మ్యాచ్ మధ్యలో ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూడలేదు. ‘నిజానికి ఈ ఫొటోను బయటపెట్టే విషయంలో నేను చాలా సంకోచించాను. అయితే మా జట్టు సభ్యులు తప్పేమీ లేదంటూ ప్రోత్సహించారు. ఒక అమ్మగా నేను చేసిన పనికి గర్వపడుతున్నాను. దీనికి అన్ని వైపుల నుంచి సానుకూల స్పందన రావడం నాకు సంతోషాన్నిచ్చింది’ అని సేరా స్మాల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment