ఆ యువ ఆటగాడి జీవితాన్ని విధి విచిత్రంగా కాటేసింది. సంబురంగా గడుపుతున్న టైంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో అతను తీవ్రంగా గాయపడగా.. కొన ఊపిరితో మూడుగంటలు పోరాడి మరీ ప్రాణం విడిచాడు.
మాటిస్ కివ్‌లెనిక్స్(24)..లాత్వియాకు చెందిన ఐస్ హకీ ఆటగాడు. నేషనల్ హాకీ లీగ్‌లో కొలంబస్ బ్లూ జాకెట్స్ తరపున గోల్‌టెండర్(గోల్‌ను అడ్డుకునే క్రీడాకారుడు)గా అతనికి మాంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. తొమిదేళ్ల కెరీర్‌లో జట్టుకు మంచి సేవలు అందించాడు. అలాంటి టాలెంటెడ్ ఆటగాడి జీవితం అర్థాంతరంగా ముగిసింది.
ఆదివారం రాత్రి బ్లూ జాకెట్స్ కోచ్ మెన్సీ లెగస్ ఇంట్లో(మిషిగాన్)లో పార్టీ జరిగింది. పటాకుల్ని పేల్చి సంబురాలు చేసుకుంది టీం. ఆ టైంలో కివ్‌లెనిక్స్ సహా ఆటగాళ్లంతా హాట్ టబ్‌లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే పటాకులు ఒక్కసారిగా ఆటగాళ్ల వైపు దూసుకొచ్చాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అంతా తలోదిక్కు పరిగెత్తారు. అయితే కాలు జారి బాత్ టబ్‌లో పడిన కివ్‌లెనిక్స్.. గాయపడ్డ విషయాన్ని తోటి టీం మేట్స్ గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
తొలుత బాత్ టబ్‌లో పడిపోవడంతో అతని తలకు గాయమై చనిపోయి ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే దూసుకొచ్చిన ఫైర్‌వర్క్స్ మోటర్ బలంగా ఛాతిని ఢీకొట్టడంతో.. అంతర్గతంగా గాయాలై చనిపోయాడని శవపరీక్షలో తేలింది. కాగా, ఈ యువ ఆటగాడి దుర్మరణంపై క్లబ్‌తో పాటు నేషనల్ హాకీ లీగ్ సంతాపం వ్యక్తం చేసింది. కివ్‌లెనిక్స్ లాత్వియా తరపున పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. ఈ మే-జూన్‌లో జరిగిన ప్రపంచ టోర్నమెంట్‌లో కెనెడాపై లాత్వియా తొలి విజయానికి కివ్‌లెనిక్స్ షూట్ అవుట్ కారణం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment