icrisat scientist
-
‘నల్ల తామర’కు ముకుతాడు?
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్ పసిఫిక్ సీడ్ అసోసియేషన్(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది. ఏభయ్యేళ్ల పరిశోధన ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్ సోయాబీన్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది. ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్ సైంటిస్ట్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్ ఆవరణ, పటాన్చెరు -
ఆకట్టుకుంటున్న అన్నదమ్ములు
సాక్షి, ధారూరు: అన్నాదమ్ముళ్లిద్దరూ సేవాభావంతో విశే ష సేవలందిస్తున్నారు. డబ్బులకు ప్రాధాన్యత ఇ వ్వకుండా సంపాదించింది చాలు, ప్రజలకు ఎంతోకొంత సేవ చేద్దామన్న తపన వారిలో నాటుకుపోయింది. అన్న తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సలహాదారుగా పనిచేస్తూ సేవలందిస్తున్నారు. తమ్ముడు సర్పంచ్‌గా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. వారిది వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామం. అన్న పెంటారెడ్డి ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొంది అమెరికాలో ఉన్న సమయంలో.. సీఎం కేసీఆర్ పిలిపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారునిగా నియమించారు. ఆయన ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించి అందరి మన్ననలు పొందారు. సీఎం కేసీఆర్ సైతం ఆయనను అభింనందించారు. దీంతో పెంటారెడ్డికి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రాగా గురువారం ఇంజినీర్స్డే సందర్భంగా ఆలిండియా ఇంజినీర్స్ అసోషియేషన్ సభ్యులు ఆయనను, ఆయన భార్య మంజులను హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా సన్మానించారు. అవార్డును రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేసి సన్మానించారు. తమ్ముడు కె. నర్సింహారెడ్డి ఇక్రిశాట్లో శాస్త్రవేత్తగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన స్వగ్రామంలో సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. కాతా అవార్డును అందుకున్న పెంటారెడ్డిని సోదరులు నర్సింహారెడ్డి, సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డిలు అభినందించారు. -
సైంటిస్టు లైంగిక వేధింపు కేసుపై ఇక్రిశాట్ వివరణ
హైదరాబాద్: ఇక్రిశాట్ మహిళా సైంటిస్టుపై లైంగిక వేధింపు కేసులో ఇక్రిశాట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి క్షమాపణలు చెప్పినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక్రిశాట్లో మహిళలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేస్తామని ఇక్రిశాట్ వర్గాలు పేర్కొన్నాయి. -
కర్షక మిత్రుడికి నిండైన పురస్కారం
వ్యవసాయ కోర్సులంటే ఇప్పటికీ కొందరు విద్యార్థులకు చిన్నచూపే! కానీ, దశాబ్దాల కిందటే ఆయన ఈ కోర్సుల ఉజ్వల భవిష్యత్తును గుర్తించి.. ఆ దిశగా అడుగులేశారు. అహర్నిశలూ శ్రమిస్తూ ప్రపంచ ప్రఖ్యాత క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా నుంచి క్రాప్ సైన్స్ రీసెర్చ్ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగారు.. ఆయనే ఇక్రిశాట్ జీన్ బ్యాంక్ హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ హరి డి.ఉపాధ్యాయ. నేటితరం విద్యార్థులు కొంత విశాల దృక్పథంతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటే, వ్యవసాయ కోర్సుల్లో అద్భుత అవకాశాలు ఉంటాయన్న ఆయన సలహాలు, సక్సెస్ స్పీక్స్.. పంటల శాస్త్రం (క్రాప్ సైన్స్)లో బేసిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఫలితాలు, ఈ రంగంలో సృజనాత్మక నైపుణ్యాల ఆధారంగా క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా అవార్డులను అందజేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలను వడపోసి అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ అవార్డు నాకు వచ్చిందన్న విషయం తెలిసి చాలా సంతోషించా. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమనేది జీవితంలో అత్యున్నత మైలురాయిగా చెప్పగలను. ప్రస్తుత పరిశోధన ఇదే: ఇక్రిశాట్లో వేరుశనగ బ్రీడర్ హోదాలో.. వర్షాభావ/అనావృష్టి పరిస్థితుల్లోనూ, చీడపీడలను ఎదుర్కొనే వేరుశనగ రకాల ఉత్పత్తులపై పరిశోధన సాగిస్తున్నాను. ఇది విజయవంతమైతే ప్రధానంగా ఆసి యా, ఆఫ్రికా దేశాల్లోని వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అడుగెందుకు పడింది: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న రోజుల్లో (1974) అఫ్రిది అనే లెక్చరర్ వ్యవసాయ కోర్సుల భవిష్యత్తు గురించి వివరించారు. ముఖ్యంగా ప్లాంట్ బ్రీడింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దీంతో జీబీ పంత్ యూనివర్సిటీలో ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో అడుగుపెట్టాను. ఆ తర్వాత సోయాబీన్ స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ కూడా పూర్తిచేశాను. ఇది పూర్తయ్యాక ఇక్రిశాట్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేయడం నా జీవిత గమ్యాన్నే మార్చేసింది. కొత్త రకం వంగడాలు, విత్తనాల పరిశోధనలు, ఆవిష్కరణలు వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తాయి. క్రాప్ సైన్స్‌కు ప్రాధాన్యం: ప్రస్తుతం దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా క్రాప్ సైన్స్ కోర్సులు, అందులో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరిగింది. క్రాప్ సైన్స్‌లోని ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్, జెనెటిక్ రిసోర్సెస్ వంటి స్పెషలైజేషన్లలో పరిశోధనలు చేస్తే అద్భుత కెరీర్ సొంతమవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రతిష్టాత్మక వ్యవసాయ సంస్థలతోపాటు దేశంలోని చాలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్రాప్ సైన్స్ పరిశోధన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మేలు కలిగించే ఒక కొత్త ఆవిష్కరణ చేసినప్పుడు కలిగే ఆనందం వర్ణించలేనిది. ప్రోత్సాహకాలు పెంచాలి: యువతలో వ్యవసాయం, దాని అనుబంధ కోర్సులపై అవగాహన అంతంతమాత్రమే. వీటిపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన పెంపొందించాలి. ఆర్థిక ప్రోత్సాహకాలు, పరిశోధన చేసే వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. అప్పుడే వినూత్న ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి. ఈ క్రమంలో ఇక్రిశాట్.. విద్యార్థులకు చేయూతనిచ్చేలా.. ఇప్పటికే ఉన్న సైంటిస్ట్‌లతో కలిసి పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులూ.. మారాలి: వ్యవసాయ కోర్సులకు సంబంధించి విద్యార్థుల్లోనూ మార్పు రావాలి. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దీన్ని గుర్తించి ఈ రంగంలో కోర్సులు, కెరీర్ దిశగా అడుగులు వేస్తే అటు దేశాభివృద్ధి, ఇటు వ్యక్తిగతాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి పరిశోధనల పట్ల ఆసక్తి ఉండాలి. అప్పుడే చక్కగా రాణించగలరు. అకడమిక్, ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఎమ్మెస్సీ, ప్లాంట్ బ్రీడింగ్‌లో పీహెచ్డీ: జీబీ పంత్ యూనివర్సిటీ. 1980-82: ఇక్రిశాట్-ఇండియాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్. 1982-83: జీబీ పంత్ యూనివర్సిటీలో సైంటిస్ట్. 1983-87: యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్, ధార్వాడ్‌లో సోయాబీన్ బ్రీడర్‌గా విధులు. 1987-91: యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్, ధార్వాడ్‌లో గ్రౌండ్నట్ బ్రీడర్, హెడ్ ఆఫ్ ఆయిల్ స్కీమ్‌గా బాధ్యతలు. 1991-97: ఇక్రిశాట్ ఇండియాలో జెనెటిక్ రిసోర్సెస్ విభాగంలో సీనియర్ సైంటిస్టు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇక్రిశాట్లో పలు కీలక హోదాల్లో కొనసాగుతున్నారు.