ideal marriage
-
Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): అన్నీ సక్రమంగా ఉన్నా మనసులు కలవని రోజులివి..దివ్యాంగులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్న యువతిని ఓ యువకుడు వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన తల్లి చిన్నప్పుడే మరణించడంతో అప్పటి నుంచి మాకవరపాలెం మండలంలోని కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో ఆశ్రయం పొందుతోంది. సంస్థ సంరక్షణలోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన నాగలక్ష్మి వారి జనరల్ ఆస్పత్రిలోనే పనిచేస్తోంది. తామరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగలక్ష్మి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో గురువారం కొండల అగ్రహారం ఇమ్మానుయేలు చర్చిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటను సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్‌రాయ్ దంపతులు, పెద్దలు ఆశీర్వదించారు. -
పింఛన్ తప్ప ఆస్తులేం లేవు, అయినా పెళ్లికి రెడీ..
కరీంనగర్‌టౌన్: కండరాల క్షీణత వ్యాధి అతడిని మంచానికే పరిమితం చేసింది. కూర్చోవాలన్నా.. పడుకోవాలన్నా.. అన్నం తినాలన్నా ఒకరు ఉండాల్సిందే. వ్యాధితో నరకయాతన భరించలేక 2012లో మెర్సికిల్లింగ్(కారుణ్య మరణం)కు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి కట్టిన రేకుల షెడ్డు.. వికలాంగుల పింఛన్ తప్ప ఎలాంటి ఆస్తులు లేవు. అయినా అతడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిందో మహిళ. మూడేళ్లుగా సేవ చేస్తున్న ఆమె మూడు ముళ్ల బంధంతో అతడికి భార్యగా మారింది. మహిళా దినోత్సవం సోమవారం రోజు ఆ జంట ఏకమైంది. కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీ మధురానగర్‌లో నివాసం ఉంటున్న కట్ల శంకరయ్య, అనసూయ దంపతుల కుమారుడు శ్రీనివాస్(48)కు పద్దెనిమిదేళ్ల వయస్సులో ఎడమకాలు శీలమండ వద్ద స్పర్శ లేకుండా పోయింది. క్రమంగా కాళ్లు, చేతులు, శరీరానికి పాకింది. వైద్యులు పరీక్షించి కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు తెలిపారు. అప్పటి నుంచి శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణిస్తూ పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. తల్లిదండ్రులే సేవ చేసేవారు. మూడేళ్ల క్రితం తండ్రి మృతిచెందాడు. దీంతో శ్రీనివాస్‌కు సపర్యలు చేసేందుకు ఇంటి సమీపంలోనే ఉండే కంచర్ల శాంతమ్మ, గట్టయ్య దంపతుల కూతురు పద్మ(31)ను వేతనానికి నియమించారు. మూడేళ్లుగా సేవలు చేస్తుండడంతో ఇద్దరి మనసులు కలిశాయి. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. బతుకుపై భరోసా పెరిగింది : శ్రీనివాస్ పద్మ నా జీవితంలోకి వచ్చాక బతుకుపై భరోసా పెరిగింది. ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. కానీ బతికినంత కాలం పద్మతో సంతోషంగా బతుకుతాను. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు అన్నీ తానై చూసుకుంటుంది. చావు అంచుల వరకు వెళ్లిన నాకు పద్మ చక్కటి తోడైంది. బతికున్నంత వరకు సేవ చేస్తా : పద్మ శ్రీనివాస్‌ను నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. మూడేళ్లుగా సేవ చేస్తున్నా. భార్యగా ఇంకా గొప్పగా చూసుకుంటాననే నమ్మకం నాకుంది. ఒకరి కోసం ఒకరన్నట్లు జీవిస్తం. శ్రీనివాస్‌కు గానీ, నాకు గానీ ఎలాంటి ఆస్తులు లేవు. మా పరిస్థితి చూసి ప్రభుత్వం గానీ, దాతలు గానీ సహకరిస్తే బతికున్నంత వరకు సేవ చేస్తూ ఉంటా. చదవండి : (73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా) (జీతం రూ.7,500.. అయితేనేం మనసు పెద్దది!) -
ఇలాంటి పెళ్లిళ్లే.. ఎంతో మేలు!
సాక్షి ప్రతినిధి విజయనగరం: కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు అచ్చెరువొందేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్ వినియోగించకూడదని నిర్ణయించుకున్న తూనుగుంట్ల గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు. విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే వాడారు. విజయనగరంలోని మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకలో ఎక్కడా ప్లాస్టిక్ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్‌తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాశారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు. పెళ్లి పనులను సూచిస్తున్న లక్క బొమ్మలు.. వధూవరులు ఇది పెళ్లికుమార్తె కోరిక ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక అభిప్రాయం. తన వివాహాన్ని ప్లాస్టిక్ రహితంగా జరిపించాలని కోరింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి వినియోగించాం. నిజానికి మూడేళ్లుగా ప్లాస్టిక్ నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా పెట్టాం. – తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం పూలు, తాటాకు గొడుగులతో అలంకరణ -
‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఆదర్శ వివాహాలు సమాజంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. కులాంతర వివాహాలే కుల నిర్మూలనకు దోహదం చేస్తాయన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఏకైక కుమర్తె శిరీష, టీ 10 సీఈఓ ఎం.శ్రీనివాస్‌ల ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. యువతలో వస్తున్న మార్పును స్వాగతిస్తున్నామని, మన దేశంలో కట్నాలు పెరిగిపోయాయని, కొంత మంది తమ బ్లాక్ మనీని పెళ్లిల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే, కట్నం లేకుండా వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. భార్యాభర్తలు సమానంగా ఉన్నప్పుడే అది ఆదర్శ వివాహం అవుతుందన్నారు. నేడు ఆడపిల్లలు కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటున్నారని, ఇక్కడే కూతురు, కొడుకులను సమానంగా చూస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆదిరెడ్డి, కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ వివాహం
సాక్షి, కేసముద్రం(వరంగల్): ఈ రోజుల్లో పెళ్లంటే ఆడపిల్ల తరఫున కట్నకానుకలు ఇవ్వడం.. భారీగా ఖర్చు చేసి వివాహం చేయడం సహజం.. అయితే ఎలాంటి కట్నకానుకలు ఆశించకుండా పెళ్లికొడుకే.. సొంత ఖర్చుతో ఆదర్శ వివాహం చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నద్దునూరి వెంకటమ్మ కుమారుడు ఎన్.అశోక్‌స్టాలిన్ బంధువైన మహబూబాబాద్ మండలం వీఎస్ లక్ష్మీపురానికి చెందిన ధర్మారపుసుశీల, బొందయ్య దంపుతుల కుమార్తె మౌనికతో పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయిది నిరుపేద కుటుంబం కావడంతో కట్నకానుకలేమీ లేకుండానే పెళ్లి చేసుకోవాలని అశోక్‌స్టాలిన్ నిర్ణయించుకున్నారు. వివాహానికి అయ్యే ఖర్చు సైతం తానే భరించి ఆదివారం అమీనాపురంలోని ఫంక్షన్ హాల్లో బంధువులు, స్నేహితులను పిలిచి వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామ కార్యదర్శి పెళ్లి మండపంలోనే వారికి అందజేశారు. అయితే పెళ్లి కార్డుపై ఎలాంటి ముహుర్తాలు లేకుండా, ఆదర్శవివాహ ఆహ్వనంగా ముద్రించి పంచడం చర్చనీశాంశమైంది. -
తండ్రిలా తనకు తోడుంటా..
తమిళనాడు పరువుహత్య బాధితురాలు కౌశల్య కొత్త జీవితానికి నాంది పలికారు. భర్త శంకర్ హత్యతో కుంగిపోకుండా పడిలేచిన కెరటంలా సాంఘిక ఉద్యమాల్లో చురుగాగా పొల్గొంటూ అందరినీ ఆకట్టుకున్న కౌశల్య తాజాగా మరోసారి ఆదర్శనీయంగా నిలిచారు. తన జీవితంలో చోటు చేసుకున్న అత్యంత విషాదం నుంచి కోలుకుని సరికొత్త జీవితానికి తొలి అడుగు వేశారు. తన తోటి కళాకారుడు, కార్యకర్త శక్తిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని తందై పెరియార్ ద్రవిడగర్ కజగం ప్రధాన కార్యాలయంలో ఆదివారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు పెరియార్ ఉద్యమ కారులు, ఇతర సామాజిక ఉద్యమ నాయకులు ఈ వివాహానికి హాజరై కౌశల్య, శక్తిలకు అభినందనలు తెలిపారు. తండ్రిలా తోడుంటా.. కుల దురహంకారానికి బలైపోయిన కౌశల్య ‘శంకర్ సోషల్ జస్టిస్ ఫౌండేషన్’ పేరుతో కులానికి, మతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఉద్యమంలో పరిచయమైన కార్యకర్త శక్తిని వివాహం చేసుకున్నారు. శంకర్ ఫౌండేషన్‌తో తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా,ఆ ఉద్యమంలో ఎలాంటి అవరోధం కల్పించకుండా, తండ్రిలాగా కౌశల్యకు అండగా ఉంటానని శక్తి ప్రకటించారు. మరోవైపు ఉద్యమాల్లో రాజకీయంగా శక్తికి అండగా ఉంటూనే పరువు హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చేంతవరకు పోరాడతానని కౌశల్య స్పష్టం చేశారు. కాగా 2016లోదళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో కౌశల్య భర్త శంకరును ఆమె తల్లిందండ్రులు అతికిరాతంగా హత్య చేశారు. 19 సం.రాల వయసులో శంకర్‌తో నూతన జీవితాన్ని ప్రారంభించిన కేవలం 9నెలల కాలంలో ఎదురైన ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న కౌశల్య శంకర్ హంతకులకు శిక్షపడేలా పోరాడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12, 2017న నేరస్తులకు మరణశిక్ష విధిస్తూ తిరుప్పూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. More power to couples like this! This was the best thing I heard today. pic.twitter.com/IkIPstRjqN — Megha Kaveri (@meghakaveri) December 9, 2018 Post-wedding celebration with parai isai. pic.twitter.com/jtBLk0HNSJ — Megha Kaveri (@meghakaveri) December 9, 2018 -
చిన్నాకు పెద్ద మనసు
(చిన్నా) ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ యువ వ్యాపారి. అతను కావాలనుకుంటే పెళ్లికి కోట్ల రూపాయలు కట్నకానుకలుగా వస్తాయి. కానీ చిన్నా మాత్రం ఓ అనాథ యువతిని భార్యగా చేసుకోవాలని భావించాడు. ఆ మేరకు విశాఖలోని ప్రేమసమాజంలో ఉంటున్న ఓ అనాథ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూడా సాదాసీదా కాకుండా అనాథ పిల్లల మధ్య ఈనెల 21న చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారస్తుడైనా..ఉద్యోగస్తుడైనా..పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత కట్నం ఆశిస్తాడు. ఉద్యోగస్తుడైతే సుమారుగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు..వ్యాపారస్తుడైతే..రూ.15 నుంచి రూ.20లక్షలు కట్న రూపంలో గానీ...ఆస్తుల రూపంలో గానీ ఆశించడం సహజం. చిన్నా మాత్రం పెద్ద మనసు చాటుకున్నాడు. కట్న కానుకలు వద్దనుకున్నాడు. ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : మమతల కోవెలలో పెళ్లి సందడి. వేద మంత్రాలు..పచ్చని తోరణాలు..బాజా భజంత్రీలు..మంగళ వాయిద్యాలు..దాతల దీవెనలు..విందు భోజనాలు. కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడుతోంది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి..పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట పుత్రుడు వెంకట సత్యనారాయణ(చిన్న)కు ఈ నెల 21న పెళ్లి జరగనుంది. అందుకు ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియం వేదిక కానుంది. అనాథ పిల్లలే పెద్దలను కల్యాణానికి ఆహ్వానించనున్నారు. 21 ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇరవై ఏళ్లుగా ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మకు పాయకరావుపేటకు చెందిన యువ వ్యాపారి వెంకట సత్యనారాయణతో వివాహం కానుంది. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం, కార్యదర్శి మట్టుపల్లి హనుమంతరావు పాలకవర్గం సమక్షంలో ఈ వివాహం జరగనుంది. మమతల కోవెల ప్రేమసమాజంలో ఇది 110 వివాహం. ప్రేమ సమాజంలో పెళ్లి రాట ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మను, పాయకరావుపేటకు చెందిన కక్కిరాల సత్యనారాయణతో ఈ నెల 21న ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియంలో జరగనున్న వివాహంలో భాగంగా సోమవారం ప్రేమసమాజంలో పెళ్లిరాట వేశారు. పలువురు ముత్తైదువులు పద్మను పెళ్లి కుమార్తెను చేసి ఆశీర్వదించారు. ప్రేమసమాజం పూర్వపు కార్యదర్శి పి.గణపతిరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమసమాజం కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, సహాయ కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, పీఆర్వో ఎం.వి.రాజశేఖర్ ప్రేమసమాజం సిబ్బంది పాల్గొన్నారు. ముందుకొచ్చిన దాతలు..పెద్ద ఎత్తున కానుకలు.. ప్రేమసమాజం అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు దాతలు ముందుకొచ్చారు. కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల భాస్కరరావు, వరాహలక్ష్మి దంపతులు కన్యాదాతగా నిలిచారు. ప్రేమసమాజం మాజీ కార్యదర్శి గణపతిరావు దంపతులు దగ్గరుండీ పెళ్లి కుమార్తెను చేశారు. ఇదిలా ఉండగా..ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ కల్యాణ్‌కుమార్ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ.5వేలు, ఏ.కె.చైతన్య రూ.5వేలు, కటిల్, జగన్ పటేల్ రూ.6,500, సీహెచ్ శేఖర్ రూ.15వేలు, కిరణ్ రూ.6,500, టి.వినీష్ రూ.10వేలు ఇవ్వగా అగర్వాల్ మహాసభ ప్రతినిధులు పుస్తుల తాడు, చెవి రింగులు, పుస్తులు, సంపతి గొట్టాం, పట్టీలు, కాళ్ల మెట్టెలు వంటి పెళ్లి సామాన్లు, అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. ఆదర్శ వివాహమే చేసుకోవాలనుకున్నా.. తల్లిదండ్రులు మంచివారు. ఇద్దరు అక్కలు, బావలు చాలా మంచివారు. అన్నయ్య ఐదేళ్ల కిందట ప్రమాదవశాత్తు చనిపోయాడు. నేను..నాన్న ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. పాయకరావుపేటలోనే మా ఇల్లు. వ్యాపార నిమిత్తం తుని వెళ్తుంటాం. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను, నాన్నను, అక్కలు, బావల్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నా. అందుకు ఆదర్శ వివాహమైతే బాగుంటుందని అనుకున్నా. ప్రేమసమాజంలో అమ్మాయిని చూశాను. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరని తెలుసుకున్నా. అటువంటి అమ్మాయికి జీవితం ఇచ్చిన వాడినవుతానని అనుకున్నా. వెంకట సత్యనారాయణ(చిన్నా), పెండ్లి కుమారుడు ప్రేమసమాజమే అమ్మా..నాన్న తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే చనిపోయారు. ఐదేళ్ల వయస్సులో నన్ను, అన్నయ్య లక్ష్మణ్‌ను బంధువులు ప్రేమసమాజంలో చేర్పించారు. అప్పటి నుంచి మా ఇద్దరికి అమ్మా..నాన్న అంటే ప్రేమసమాజమే. చిన్నప్పటి నుంచి మా ఇద్దర్ని ప్రేమసమాజం ఎంతగానో ఆదుకుంది. తల్లిదండ్రులు లేని మా ఇద్దరికి ప్రేమసమాజమే దైవం. ఇంటర్మీ డియట్ వరకు చదివించారు. అధ్యక్షుడు రాంబ్రహ్మం, కార్యదర్శి హనుమంతరావు ఇక్కడి పిల్లల శ్రేయస్సు కోసం పరితపిస్తుంటారు. పదిహేడేళ్ల పాటు ఇక్కడే ఉన్నాను. కొత్త జీవితంలో అడుగుపెడతున్నాను. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. ఆదర్శ వివాహంచేసుకుంటున్న..కాబోయే భర్త సత్యనారాయణ(చిన్న), అందుకు సహకరించి ముందుకొచ్చిన మావయ్య వెంకటరమణకు కృతజ్ఞతలు. వారికి మంచిపేరు తెస్తాను. –పద్మ, ప్రేమసమాజం పుత్రిక..పెళ్లి కుమార్తె కుమారుడి అభీష్టం మేరకే.. భార్య సత్యవతి అనారోగ్యంతో ఏడాది కిందట చనిపోయింది. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి చేసేశాను. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు ఐదేళ్ల కిందట వినాయక చవితి ఉత్సవాల నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయాడు. చిన్నోడు వెంకటసత్యనారాయణ(చిన్నా)ఇంటర్మీడియట్ వరకు చదివాడు. నాతోనే తునిలో కారం(మసాల సామాన్లు విక్రయం) పనులు చేస్తుంటాడు. ప్రేమ సమాజం అమ్మాయిని చేసుకుంటే ఒకరికి దారి చూపిన వాడినవుతానని చెప్పడంతో సరేనన్నా. నాలుగేళ్ల కిందట రూ.25 లక్షలతో ఇల్లు నిర్మించాను. 300 గజాల ఖాళీ స్థలం ఉంది. నా కుమారుడికి ఆదర్శ వివాహమంటే ఇష్టం. అందుకే ప్రేమసమాజం అమ్మాయితోనే పెళ్లి చేస్తున్నాం. – కక్కిరాల వెంకటరమణ, పెళ్లి కుమారుడు తండ్రి -
ఇద్దరు అనాథ ఆడపిల్లలకు ఆదర్శ వివాహం
అమలాపురం టౌన్: అమలాపురం కామాక్షీ పీఠం పెరిగిన ఇద్దరు అనాథ యువతులను ఆదర్శ వివా హం చేసుకునేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. ప్రేమ మందిరంలో ఆ అనాథ యువతుల నడత, నమ్రతలను చూసిన ఆ ఇద్దరు యువకులు తమ మనసులోని మాటను తొలుత తమ కుటుంబ పెద్దలకు చెప్పుకున్నారు. తర్వాత ఆ పెద్దలు తమ కొడుకుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ పీఠానికి వచ్చి పీఠాధిపతి కామేశ మహర్షి అంగీకారం, ఆశీర్వాదం తీసుకున్నారు. నిశ్చితార్థాలు కూడా అయ్యాయి. ఆ ఇద్దరి అనాథ ఆడపిల్లలకు పీఠంలో ఆదివారం రాత్రి వివాహం చేసేందుకు పీఠాధిపతి ముహూర్తాలు నిర్ణయించారు. దీంతో పీఠం పెళ్లి సందడితో కళకళలాడు తోంది. పీఠంలోని ప్రేమమందిరంలో పెరుగుతున్న కామేశ్వరిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన అర్చకుడు సాయి సత్యనారాయణ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. మరో యువతి వల్లిని రామచంద్రపురానికి చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు నిర్వహిస్తున్న దైవ వరప్రసాద్ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. -
ఫేస్బుక్ రాసింది.. పెళ్లి పుస్తకం
రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోనూ నిన్నేమనుకోనూ... నువు రాయివి కావూ గంగవు కావూ నే రాముడు శివుడూ కానే కానూ తోడనుకో నీవాడనుకో.. అని ఇరువురు బంధం కలుపుకున్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని ప్రేమ బాసలు చెప్పుకున్నారు. దివ్యాంగురాలని తెలిసీ మనసిచ్చాడు. మనువాడాడు. గొప్ప మనసు చాటుకున్నాడు. అతను చూపించిన ప్రేమను పదిలంగా కాపాడుకుంటానని, భర్తను కంటికి రెప్పలా చూసుకుంటానని ఆ దివ్యాంగురాలు వేదమంత్రాల సాక్షిగా శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసి ఏడడుగులు నడిచింది. వీరిద్దర్ని కలిపింది కుటుంబ పెద్దలు కాదు. సామాజిక మాధ్యమ రారాజు ఫేసుబుక్. శనివారం వారిద్దరూ సింహాచలం పుష్కరిణి సత్రంలో ఒకటయ్యారు. వీరి ప్రేమ, పెళ్లి కథేంటో చూద్దాం.. – సింహాచలం ⇒ పేస్‌బుక్‌లో పరిచయమైన సావిత్రి ⇒ దివ్యాంగురాలిని పెళ్లి చేసుకున్న ⇒ ఆదర్శ యువకుడు నవీన్ సుమారు 22ఏళ్ల క్రితం మూడునెలల పసిగొడ్డుగా ఉన్న సావిత్రి (పెళ్లికూతురు)ని నగరంలోని రాణీచంద్రమాదేవి హాస్పటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన తల్లిదండ్రులు పోలియో అని తెలిసి అక్కడే వదిలివెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రి నర్సులు, ఇతర సిబ్బంది సావిత్రిని చేరదీసి పదేళ్ల వరకూ పెంచారు. యుక్తవయçస్సు వస్తుండటంతో అక్కడి నుంచి శ్రీకాకుళంలోని బేబీ హోమ్‌కు పంపించారు. అక్కడే సావిత్రి పదో తరగతి వరకూ చదివింది. పదోతరగతి అనంతరం సావిత్రిని విశాఖలోని ఏయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.పి.సుబ్బారావు, ఆమె భార్య డి.లలిత(స్త్రీ శక్తి మహిళా సంఘ సభ్యురాలు) దత్తత తీసుకుని పీజీ వరకు చదివించారు. ఎమ్.ఎ. ఎకనామిక్స్‌లో 84శాతం ఉత్తీర్ణతను సావిత్రి సాధించింది. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. 2016లో విశాఖలోని గాజువాకదరి నడుపూరులో తాపీమేస్త్రీగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. నవీన్‌కు కూడా నా అనేవాళ్లు ఎవరూ లేరు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాను దివ్యాంగురాలునని పరిచయం అయిన కొన్ని రోజులకు సావిత్రి నవీన్‌కి చెప్పింది. సావిత్రిని చూడటానికి వచ్చిన నవీన్ తాను పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. దీంతో దత్తత తీసుకున్న సుబ్బారావు, లలిత, పలువురు మహిళామండలి సభ్యులు వీరిద్ధరికీ శనివారం వివాహం జరిపించారు. వివాహం జరిపించిన వారితో నవీన్, సావిత్రి -
ఆదర్శ వివాహాలతోనే సామాజిక మార్పు
తిరుపతి కల్చరల్: కులాంతర, మతాంతర వివాహాల ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి. వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో మతాంతర వివాహం జరిపించారు. కర్నూలు జిల్లాకు చెందిన పి.రహంతుల్లా కుమార్తె పి.హసీనా(21), తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన టి.వెంకటేష్ కుమారుడు టీవీ.కిశోర్(24)లు ప్రేమించుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించకపోవడంతో సీపీఐను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఆదర్శ వివాహం చేయించారు. సీపీఐ సీనియర్ నేతలు వెంకటరత్నం, తులసేంద్ర మాట్లాడుతూ దేశంలో కులాలు, మతాలుపై విచ్చలవిడి దాడులు జరుగుతున్నా ఇలాంటి వివాహాలు జరగడం సంతోషకరమన్నారు. ప్రేమ వివాహాలు చేసుకోవడం గొప్పకాదని, ఆదర్శంగా జీవించి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. -
తెలంగాణ యువతి-ఆంధ్రా యువకుడి ఆదర్శ వివాహం
ఝరాసంగం రూరల్: మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ జంట ఆదివారం ఆదర్శ వివాహం చేసుకుంది. తెలంగాణకు చెందిన మరుగుజ్జు యువతిని ఆంధ్రాకు చెందిన ఓ యువకుడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొస్గికి చెందిన వధువు హరిప్రియ (25)కు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వరుడు కె.వెంకట కృష్ణకిశోర్ (32)తో పెళ్లి జరిగింది. హరిప్రియ ఇంటర్, అబ్బాయి ఎంబీఏ చదువు పూర్తి చేశారు. ఆకారం ముఖ్యం కాదని, వ్యక్తిత్వం ప్రధానమని వరుడి తండ్రి కేకేఆర్.పరమేశ్వర్రావు తెలిపారు. స్వామి వారి ఆలయ ప్రధాన మండపం ముందు జరిగిన ఈ వివాహంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. -
బాలికల వసతిగృహంలో పెళ్ళిబాజాలు