ఇలాంటి పెళ్లిళ్లే.. ఎంతో మేలు! | ECO Friendly Marriage in Vizianagaram | Sakshi
Sakshi News home page

ప్రకృతి కాంత.. అక్షతలేయగ

Published Sat, Nov 16 2019 8:14 AM | Last Updated on Sat, Nov 16 2019 8:37 AM

ECO Friendly Marriage in Vizianagaram - Sakshi

అరటి చెట్లు, కొబ్బరి ఆకులు, వరి కంకులతో అలంకరించిన పెళ్లి మండపం

సాక్షి ప్రతినిధి విజయనగరం: కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు అచ్చెరువొందేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్‌ వినియోగించకూడదని నిర్ణయించుకున్న తూనుగుంట్ల  గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు. విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే వాడారు.

విజయనగరంలోని మన్నార్‌ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకలో ఎక్కడా ప్లాస్టిక్‌ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్‌తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాశారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు.


పెళ్లి పనులను సూచిస్తున్న లక్క బొమ్మలు.. వధూవరులు

ఇది పెళ్లికుమార్తె కోరిక
ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక అభిప్రాయం. తన వివాహాన్ని ప్లాస్టిక్‌ రహితంగా జరిపించాలని కోరింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి వినియోగించాం. నిజానికి మూడేళ్లుగా  ప్లాస్టిక్‌ నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్‌ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా పెట్టాం.
– తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం


పూలు, తాటాకు గొడుగులతో అలంకరణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement