అరవై రకాల పేర్లు.. అడ్డగోలు వసూళ్లు
► ‘ఆకర్షణీయ’ పేర్లతో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా
► 3,487 పాఠశాలలను గుర్తించిన విద్యా శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాల సందడి మొదలు కాబోతోంది. ఇప్పటివరకు వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వాటిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకటో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ అంటూ ‘ఆకర్షణీయ’పేర్లతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అనేక విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చేసినా, ఆ పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టారని విద్యా శాఖను హైకోర్టు ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఫీజుల నియంత్రణ విషయంలో పక్కాగా లేని విధానాలు, మామూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారుల కారణంగా ఫీజుల నియంత్రణ నీరుగారిపోయింది.
ప్రవేశాల సీజన్ మొదలు కానుండటంతో ప్రైవేటు స్కూళ్ల వ్యవహారంపై విద్యా శాఖ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయో లెక్క తేల్చింది. ఆకర్షణీయ పేర్లు పెట్టుకుని అడ్డగోలుగా ఫీజులను పెంచుతున్న స్కూళ్ల వివరాలను సేకరించింది. ప్రస్తుతం ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని భావిస్తున్న విద్యా శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపైనా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో 10,799 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. అందులో 3,487 పాఠశాలలు 62 రకాల ‘ఆకర్షణీయ’పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి వసూలు చేస్తున్నాయని అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణ నిబంధనల్లో ఆకర్షణీయ పేర్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
ఇదో ఆకర్షణీయ దందా...
ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర.. వంటి పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నారుు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును కూడా ఆశ్రరుుంచారు. వన్‌టైమ్ స్పెషల్ యాక్టివిటీ పేరుతో కొన్ని పాఠశాలలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యా శాఖ ఉన్నత స్థారుు కమిటీని ఏర్పాటు ప్రముఖ పాఠశాలల్లో తనిఖీలు చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయట పడ్డారుు. ఏసీ క్లాస్ రూమ్‌లు, ఐఐటీ ఫౌండేషన్ శిక్షణల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
వసూలు చేస్తున్న ఫీజులకు, విద్యా బోధనకు సంబంధం లేదని వెల్లడైంది. ఐఐటీ ఫౌండేషన్ గతంలో ఆరో తరగతి నుంచి మొదలైతే ఇప్పుడు ఒకటో తరగతి నుంచే చెబుతామంటూ అనేక స్కూళ్లు వెలిశాయి. ఐఐటీ, ఒలంపియాడ్.. తదితర ఆకర్షణీయ పేర్లు పెట్టడానికి వీల్లేదని, వాటిని వెంటనే తొలగించాలని జిల్లా విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ గతంలోనే ఆదేశించినా ఎక్కడా అమలు కాలేదు. పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డి జిల్లాలోఆకర్షణీయ పేర్లతో స్కూళ్లు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడి కాగా, నల్లగొండలో తక్కువ సంఖ్యలో ఉన్నట్లు విద్యా శాఖ అధ్యయనంలో తేలింది.