
ఐఐటీ శిక్షణకు ఆదిలోనే ఆటంకం
ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహించాలనే ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి...
- మంత్రి సొంత విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులతో ఐఐటీ శిక్షణ
- వ్యతిరేకించిన యూటీఎఫ్, తదితర ఉపాధ్యాయ సంఘాలు
- బాయ్‌కాట్ చేసిన ఉపాధ్యాయులు
నెల్లూరు, సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహించాలనే ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారం నెల్లూరులో ఈ కార్యక్రమం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ తరగతుల నిర్వహణ పై ఏర్పాటు చేసిన ఉపాధ్యాయల శిక్షణ కార్యక్రమం రసాభాసగా ముగిసింది.
రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ మాటమార్చారు. తన సొంత ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహించే వారితో మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఐఐటీ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలో శనివారం కావలి, గూడూరు, నెల్లూరు నగర పాలక సంస్థ పాఠశాలల్లో పని చేసే ప్రధాన ఉపాధ్యాయులకు మెసేజ్‌లు ద్వారా ఆదివారం ఐఐటీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిజిక్స్, మ్యాధ్స్, బయాలజీ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా రావాలని సూచించారు. మద్రాసుబస్టాండు సమీపంలోని శింకు చెంగన్న మున్సిపల్ పాఠశాల్లో ఆదివారం ఉదయం కావలి, గూడూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన 75 మంది మున్సిపల్ పాఠశాల ఉపధ్యాయులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.
ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారిచే ఐఐటీ శిక్షణ తరగతులు బోధించడం గురించి మంత్రి వ్యవహరించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా మంత్రి వ్యవహరించారని శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులు బాయ్‌కాట్ చేసి నిరసన తెలిపారు. ఆదివారం కూడా క్లాసుల పేరుతో ఉపాధ్యాయుల పై ఒత్తిడి తీసుకుని రావడం సరైందికాదన్నారు. ఇప్పటికే ఈ ఏడాది మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మంచి మార్కులు సాధించారని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరారు.