సమిష్టి కృషితోనే ఆన్లైన్ బెట్టింగ్‌కి చెక్
న్యూఢిల్లీ: దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేయాలంటే అన్ని వర్గాల నుంచి సమిష్టి కృషి అవసరమని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ .. మెటాలాంటి బడా టెక్ కంపెనీలు కలిసి పని చేయాలని పేర్కొంది. ‘ఈ అక్రమ రంగం ఏటా 100 బిలియన్ డాలర్ల పైగా ఉంటోంది. ఏటా 30 శాతం పైగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ వినియోగం, సాంకేతిక పురోగతి పెరుగుతుండటం, నియంత్రణపరంగా అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణంగా ఉంటోంది. గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రమోషన్లను నియంత్రించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో గూగుల్, మెటాలాంటి బడా సోషల్ మీడియా కంపెనీలతో భారతీయ నియంత్రణ సంస్థలు క్రియాశీలకంగా కలిసి పనిచేయాలి‘ అని నివేదిక వివరించింది. అక్రమ ఆపరేటర్లు అత్యంత అధునాతనమైన డిజిటల్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మాధ్యమాలు, పేమెంట్ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నారని వివరించింది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లనేవి మనీలాండరింగ్, అక్రమ చెల్లింపుల సమస్య పెరిగిపోవడానికి దారి తీస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా తెలిపారు. గూగుల్, మెటాలాంటి కంపెనీలు సాధారణంగా అడ్వరై్టజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో) ద్వారా లాభాలు ఆర్జిస్తుంటాయి కాబట్టి అవి అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోలేకపోతుంటాయని పేర్కొన్నారు. ‘‘వాటికి వచ్చే ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ఈ వెబ్సైట్ల నుంచే ఉంటోంది. ఈ వెబ్సైట్లు విస్తరించే కొద్దీ బిగ్ టెక్ కంపెనీలకు అడ్వరై్టజింగ్ రూపంలో ఆదాయాలు వస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి పూర్తి అవగాహన లేక ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ప్రమోట్ చేస్తున్నారు’’ అని గుప్తా చెప్పారు. ‘ఆపరేటర్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. పేమెంట్ నిబంధనలను తోసిరాజని డొల్ల కంపెనీల ద్వారా, డి్రస్టిబ్యూషన్ చానల్ ద్వారా అక్రమ మార్గాల్లో చెల్లింపులను పొందుతున్నారు. బిగ్ టెక్ కంపెనీలకు నిధులిస్తున్నారు. కాబట్టి బిగ్ టెక్ కంపెనీలు కూడా వారిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం లేదు‘ అని గుప్తా పేర్కొన్నారు.నివేదికలోని మరిన్ని అంశాలు.. → దేశీయంగా అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య పరీమ్యాచ్, స్టేక్, 1ఎక్స్‌బెట్, బ్యాటరీ బెట్ అనే నాలుగు ప్లాట్‌ఫాంలలో 1.6 బిలియన్ పైగా విజిట్స్ నమోదయ్యాయి. → 48.2 మిలియన్ విజిట్లతో దీనికి సోషల్ మీడియా కూడా దోహదకారిగా నిలి్చంది. ఫేస్‌బుక్‌లాంటి ప్లాట్‌ఫాంలలో డైరెక్ట్ పెయిడ్ ప్రకటనలు, కంటెంట్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా ఈ ట్రాఫిక్ వచి్చంది. నియంత్రణ నిబంధనలపరంగా వాటి వెబ్సైట్ల నిలిపివేతను తప్పించుకునేందుకు ఆయా ఆపరేటర్లు పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. → దాదాపు అన్ని సంస్థలు, (సుమారు 600) ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌లో జీఎస్టీ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. → గ్యాంబ్లింగ్ ప్రకటనలను హోస్ట్ చేయకుండా, జీఎస్‌టీలాంటివి చెల్లించని అక్రమ సైట్లను ప్రమోట్ చేయకుండా చర్యలు ఉండాలి. ఆ తరహా సైట్లకు చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్, పేమెంట్ వ్యవస్థలు నిరోధించాలి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను బ్లాక్ చేస్తే సరిపోదని నార్వే, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, అమెరికా వంటి దేశాల అనుభవాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు మార్కెటింగ్పరమైన ఆంక్షలు విధించడం, చెల్లింపులను బ్లాక్ చేయడం మొదలైన వ్యూహాలన్నింటి మేళవింపును అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మనుగడ సాగించేందుకు దోహదకారులను పూర్తిగా కట్టడి చేసేందుకు నియంత్రణ విధానాలు వేర్వేరుగా ఉండకుండా సమగ్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి. → డిజిటల్ మీడియా చానళ్ల ద్వారా యూజర్లకు చేరువ కాకుండా వాటిని కట్టడి చేయడం, అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేందుకు ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం, వైట్‌లిస్ట్/బ్లాక్‌లిస్ట్ రూపంలో నియంత్రణ విధానాలను పటిష్టం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. → పన్నులు చెల్లించే కంపెనీలతో వైట్‌లిస్ట్ తయారు చేసి, మిగతా వాటిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వల్ల కొంత నష్టం తగ్గవచ్చు.