జూలు విదిల్చిన జూదం..! | Persons Playing Illegal Gambling Games In Mahabubnagar | Sakshi
Sakshi News home page

జూలు విదిల్చిన జూదం..!

Published Fri, Feb 14 2020 12:06 PM | Last Updated on Fri, Feb 14 2020 12:06 PM

Persons Playing Illegal Gambling Games In Mahabubnagar - Sakshi

బిజినేపల్లిలో ఓ ఇంట్లో పేకాటలో పట్టుబడ్డ నగదు, సెల్‌ఫోన్లు (ఫైల్‌)

సాక్షి,  నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లాలో పేకాట ‘మూడురాజాలు, ఆరు రాణులు’గా విచ్చల విడిగా సాగుతుంది. ఎంతో మంది పేకాటకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా రాజా, రాణిలతో సాహవాసం చేస్తూ పేకాటలో డబ్బులు పోగుట్టుకుని జోకర్లుగా మిగిలిపోతున్నారు. రోజుకు రూ.లక్షల్లో పేకాటలో డబ్బులు చేతులు మారుతున్నాయి. పట్టణంలోని లాడ్జీలు, ప్రైవేటు గృహాలు, పట్టణ, గ్రామాల్లోని శివారు ప్రాంతాలు పేకాటకు అడ్డాలుగా మారాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోట పోలీసుల దాడుల్లో పేకాట రాయుళ్లు పట్టుబడటమే గాక రూ.లక్షల్లో నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకుంటున్నారు.  జిల్లాలో కొందరు వ్యక్తులు సురక్షిత ప్రాంతాలను అడ్డాగా చేసుకుని పేకాట శిబిరాలను నిర్వహిస్తూ రూ.లక్షలు సంపాదించుకుంటున్నారు. 

రహస్యంగా పేకాట  
జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, ప్రాంతాల్లో చాలాకాలంగా  పేకాట జోరుగా సాగుతుంది. పేకాట కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరి పేకాటను ఆడుతున్నట్లు సమాచారం.  పట్టణాలలో, గ్రామ శివారు ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను తమ అడ్డాలుగా మార్చుకుని పేకాట ఆడుతున్నారు. నగర శివారులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఆలోచనతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి పేకాటరాయుళ్లను అరెస్టు చేసినా.. వారు మాత్రం తమ పద్దతి మార్చుకోవడం లేదు. పోలీసు యంత్రాంగం పేకాటరాయుళ్లను మాత్రమే కాకుండా పేకాట నిర్వహకులపై గట్టి చర్యలు తీసుకుని బీద, మధ్యతరగతి కుటుంబాలను పేకాట ఊబిలోంచి బయటపడేలా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

గత ఏడాది 156 మంది అరెస్టు  
జిల్లా పరిదిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సరం పోలీసులు జరిపిన దాడుల్లో 156 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయడమే కాకుండా వారి వద్ద నుండి రూ.3,62,080 నగదును స్వాదీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో సెల్‌ఫోన్లు, వాహనాలు అధికంగా పట్టుబడుతున్నాయి.  

ఇవిగో సంఘటనలు..
23జూలై 2019 జిల్లా కేంద్రంలో సంతబజారులో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.18,100 నగదును స్వాదీనం చేసుకున్నారు. 22 డిసెంబర్‌ 2019 బిజినేపల్లి మండలంలోని అనకాపల్లితండా శివారులో పేకాట ఆడుతుండగా 11మందిని అరెస్టు చేసి రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 పిబ్రవరి 2020 బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.75,500, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని 10మందిని అరెస్టు చేశారు.  

కఠిన చర్యలు తీసుకుంటాం 
ఎవరైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తేవారిపై కఠినచర్యలు ఉంటాయి. పేద, మధ్యతరగతి యువత పేకాట ఆడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పట్టణ శివారులో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పేకాటలో పట్టుబడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.
– గాంధీనాయక్, సీఐ, నాగర్‌కర్నూల్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement