ఐఎంఎఫ్ చోద్యం చూస్తూ కూర్చుంది..
సంస్థ విధానాలను ఆక్షేపించిన ఆర్బీఐ గవర్నర్ రాజన్
ముంబై: ఉదార ఆర్థిక విధానాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యవహరించిన తీరును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా ఆక్షేపించారు. సంపన్న దేశాల మొదలుపెట్టిన విధానాలు వర్ధమాన మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంటే ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మాత్రం చప్పట్లు కొడుతూ, చోద్యం చూస్తూ కూర్చున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తే పరిణామాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఐఎంఎఫ్... దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు.
ఒక దేశానికి మేలు చేసే విధానాలు యావత్ ప్రపంచానికి మేలు చేస్తాయన్న రీతిలో ఐఎంఎఫ్ అధ్యయనాలు ఉంటున్నాయని రాజన్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. కానీ, ఏ సెంట్రల్ బ్యాంకుకైనా నిర్దేశిత లక్ష్యం ఆయా దేశాలకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకోవడమే తప్ప యావత్ప్రపంచం ప్రయోజనార్థం పనిచేయడం కాదన్నారు. సెంట్రల్ బ్యాంకులు స్వదేశం తర్వాతే మిగతా ప్రపంచదేశాలకు రెండో ప్రాధాన్యమే ఇస్తాయని చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ప్రతిద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతున్నాయని, దాని బారి నుంచి తప్పించుకునేందుకు వృద్ధికి ఊతమిచ్చే చర్యల కోసం ప్రయత్నిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు.
పెట్టుబడులు పెడితేనే 9% వృద్ధి..
తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించాలంటే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు సరఫరాలను మెరుగుపర్చి, డిమాండ్‌కి ఊతమిచ్చే చర్యలు అవసరమని రాజన్ చెప్పారు. అయితే, ఇదంతా నిరంతర ప్రక్రియని, ఒక్క రోజులో సాధ్యపడేది కాదని పేర్కొన్నారు. వాస్తవిక వృద్ధి సాధన కష్టంతో కూడుకున్నదన్నారు. కానీ ఏదో రకంగా వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జనాకర్షక విధానాలు పాటించడం సరికాదని రాజన్ తెలిపారు.
సరైన ఆర్థివేత్తలు తగినంతమంది లేరు..
అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగే సత్తా ఉన్న మంచి ఆర్థికవేత్తలు భారత్‌లో తగినంత మంది లేరని కూడా రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెనడా-భారత్ సారథ్యంలో.. ఏర్పాటైన జీ20 మార్గదర్శకాల కమిటీలో కెనడా ఆర్థికవేత్తలు ఏకంగా ఏడుగురు ఉన్నారని, కానీ భారత్ తరఫునుంచి అంత మంది లేరని రాజన్ చెప్పారు.
ఆ నైపుణ్యాలు గల వారు ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. మరోవైపు, ఉద్యోగాల కల్పన మెరుగుపడాలంటే చిన్న సంస్థలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం కూడా ఉందని రాజన్ చెప్పారు.