Immigration checking
-
అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ
వాషింగ్టన్: దేశంలో వలసదార్లను పెద్ద సంఖ్యలో ఏరివేసేందుకు, వారిని దేశ బహిష్కారం చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధమైంది. అక్రమ వలసదార్లను ఆదివారం నుంచి అరెస్టు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. లక్షలాది అక్రమ వలసదార్లను అరెస్టు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తగిన ఉత్తర్వులతో వారిని దేశ బహిష్కారం చేయనున్నట్టు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ డైరెక్టర్ మాథ్యూ అల్బెన్స్ తెలిపారు. అరెస్టులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాబోవని, కేసుల దర్యాప్తును అనుసరించి అధికారులు ఎక్కడికంటే అక్కడికి పోతారని ఆయన చెప్పారు. అరెస్టు చేసిన వారిని వారి వారి దేశాలకు పంపుతామని, నేరాలకు పాల్పడిన వారిని ఇక్కడ లేదా వారి దేశాల్లోని జైళ్లకు పంపుతామని ట్రంప్ ప్రకటించారు. అధికారులు అందిస్తున్న వివరాల ప్రకారం – 2000 మందిని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించనున్నారు. గతంలో జరిగిన దాడులను బట్టి ఇప్పుడు కనీసం 200 మందిని అరెస్టు చేయవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ సర్కారు నిర్ణయాలు అగ్రరాజ్యంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ చర్యలు అమానవీయమైనవంటూ డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మధ్య అమెరికా నుంచి ఇంతకు ముందెన్నడూ లేనంత మంది ప్రజలు ఇటీవల యూఎస్ సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే. వీరిలో పలువురు ఇమ్మిగ్రేషన్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. 2016లో బరాక్ ఒబామా హయాంలోను, 2017లో ట్రంప్ హయాంలోను అక్రమ వలసదార్లపై ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించారు. -
న్యూయార్క్ లో ఒమర్ అబ్దుల్లాకు చేదు అనుభవం
న్యూయార్క్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు న్యూయార్క్ విమానాశ్రయంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. చెకింగ్ పేరుతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను రెండు గంటల పాటు విమానాశ్రయంలో వేచి ఉండేలా చేశారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా వెళ్లిన ప్రతిసారి ఈ అనుభవం ఎదురవుతోందని ఆయన తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒమర్ అమెరికా వెళ్లారు. అయితే మొదటిసారి తనిఖీలు పూర్తయినా, మరోసారి ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేయటంపై అభ్యంతరం తెలుపుతూ ఈ మేరకు ఒమర్ విమానాశ్రయం నుంచే తన ట్విటర్ ఖాతా ద్వారా వరుసగా ప్రశ్నలు సంధించారు. తనిఖీల పేరుతో పదే పదే ఇలా జరగడం బాగోలేదని పేర్కొన్నారు. ఎక్కడైనా భద్రత నియమాలను తాను గౌరవిస్తానని.. కానీ అమెరికాలో ప్రతిసారి ఇలా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుచెప్పడం ఇబ్బందిగా ఉందని ట్వీట్ చేశారు. రెండు గంటలపాటు ఖాళీగా విమానాశ్రయంలో గడపాల్సి వచ్చిందని ఒమర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టైమ్ పాస్ చేసేందుకు ఆ సమయంలో పోకీమన్ ను కూడా అందుకోలేకపోయానంటూ ఆయన చమత్కరించారు. కాగా గతంలోనూ బాలీవుడు నటులు షారూఖ్, అక్షయ్ కుమార్లకూ తనిఖీల పేరుతో ఇమిగ్రేషన్ అధికారులు గంటలపాటు నిర్భందించిన విషయం తెలిసిందే. Another "random" secondary immigration check upon landing in the US. Thrice in three visits, the randomness is growing tiresome now. — Omar Abdullah (@abdullah_omar) 16 October 2016 I just spent TWO hours in a holding area & this happens EVERY time. Unlike @iamsrk I don't even catch Pokemon to pass the time. — Omar Abdullah (@abdullah_omar) 16 October 2016 -
ఇమ్మిగ్రేషన్ తనఖీల్లో చిక్కిన 'గోల్డ్‌క్వెస్ట్' నిందితుడు
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కావలిలో గోల్డ్‌క్వెస్ట్ స్కీమ్స్ పేరుతో అనేక మందిని మోసం చేసిన క్వెస్ట్‌నెట్ ఎంటర్ప్రైజెస్ కేసులో మరో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ టి.కష్ణప్రసాద్ చెప్పారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కావలి కేంద్రంగా వ్యవహారాలు నడిపిన క్వెస్ట్‌నెట్ సంస్థ వివిధ స్కీముల పేరుతో అనేక మందికి ఎరవేసి ఒక్కొక్కరి నుంచి 33 వేల రూపాయల నుంచి 66 వేల రూపాయల వరకు వసూలు చేసి మోసం చేసింది. ఈ మోసాలకు సంబంధించి స్థానిక టౌన్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయింది. కొందరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. సదరు నిందితులు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించినా, తిరిగి వచ్చినా తక్షణం అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఈ నోటీసుల్లో ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని కోరారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించిన నిందితుడు రావి రమేష్ బాబు అక్కడి ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో చిక్కారు. విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో రమేష్‌బాబు ఒకడని పోలీసులు తెలిపారు. మనీ సర్క్యులేషన్ స్కీం పేరిట అమాయకులకు దేవుడి బొమ్మతో కూడిన నాణేలు అంటగడుతూ దాదాపు 1250 కోట్ల రూపాయలమేర ఆర్జించిన మలేషియా గోల్డ్‌క్వెస్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పుష్పం అప్పలనాయుడిని గుంటూరు సిఐడి అధికారులు మార్చి నెలలో కావలిలో అరెస్టు చేశారు. ఈ కేసుతోపాటు ఆమెపై దేశవ్యాప్తంగా 21 కేసులు ఉన్నాయి. సిఐడి పోలీసులు 2009 నుంచి ఈమె కోసం గాలించారు. తానిచ్చే బంగారు పురాతన నాణెం ఎంతో విలువైనదంటూ అమాయకులను మోసగించారన్నది ఆమెపై అభియోగం. చెన్నైలో ఈ సంస్థకు చెందిన బంగారం, వెండి కాయిన్స్ గోడౌన్‌ను సీఐడీ సీజ్ చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా, శ్రీలంకలోని ఈ సంస్థ డైరెక్టర్లపై కూడా కేసులు నమోదైయ్యాయి. మలేషియా కేంద్రంగా మనీ సర్క్యులేషన్ రాకెట్‌ను పుష్పం అప్పలనాయుడు నడిపినట్లు తెలుస్తోంది.